బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఒక మ్యాచ్ ఫిక్సర్ అని, అభివృద్ధి పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడతాడే తప్ప అభివృద్ధి జరగనివ్వడని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు. కరీంనగర్ నగరంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలోనే అయోధ్య రామాలయ భూమి పూజ జరిగిందని, పదేళ్లు కేంద్రంలో పాలన కొనసాగించిన బిజెపి ఇప్పుడు ఓటమి భయంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారని ఆరోపించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత సమర్పించాల్సిన అక్షింతలను విగ్రహ ప్రతిష్టకు ముందే ప్రజలకు అందజేసి దేవునితో వ్యాపారం కొనసాగిస్తున్నారని అన్నారు. చదువూ సంధ్యా లేని బండి సంజయ్ కు ప్రజా సమస్యల మీద అవగాహన లేదని, ఎంపీ, కలెక్టర్ పర్యవేక్షణలో నెలకు ఒకసారి జరగాల్సిన దిశా కమిటీ విజిలెన్స్ సమావేశాన్ని ఒకటంటే ఒక్కసారి కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అలాంటి బండి సంజయ్ కు మరోసారి ఓటేస్తే మన నోట్లో మనమే మట్టి పోసుకున్నట్టు అవుతుందని అన్నారు.
కాళేశ్వరం సబ్ కాంట్రాక్ట్ నుండి వచ్చిన అక్రమ సొమ్ముతో బోయినపల్లి వినోద్ ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మనిషి ఒకచోట మనసు ఒకచోట అన్నట్టు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పటికీ వరంగల్ మీద ప్రేమ వొలకబోసేవారని గుర్తు చేశారు. భారత్ జూడో యాత్ర ద్వారా దేశ ప్రజలను ఒక తాటి మీదికి తెచ్చేందుకు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని, కుల గణన జరిగితే అన్ని వర్గాల వారికి ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. తన తండ్రి స్ఫూర్తిగా రాజకీయాలు వచ్చిన తాను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని కోహినూర్ డైమండ్ల తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు కొండూరు సత్యనారాయణ గౌడ్, ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, ప్రభాకర్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.