సిపిఎం రాష్ట్ర కమిటీ ఆదేశాలతో మేరకు మానుకోట పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పొరిక బలరాం నాయక్ కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మంగపతిరావు భవనంలో ఇమ్మడి గోవింద్ అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. పదేండ్ల బిజెపి పాలనలో బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టి రైతులు, కార్మికులు, సామాన్యులను మోడీ విస్మరించారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి రాకముందు నల్లధనం వెలికితీసి ప్రతి జన ధన్ ఖాతాల ద్వారా ఒక్కరి ఎకౌంటులలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని ప్రజలను, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు మరలా హమీలను ఇస్తున్న బిజెపి హమీలను ప్రజలు నమ్మే పరిస్థితులలో దేశ ప్రజలు లేరని అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించని, నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు అదుపు చేయని, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించని బిజెపి పాలనకు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఎంపిగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ గెలుపు నకు సిపిఎం అన్ని గ్రామ శాఖలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి బలరాం నాయక్ గెలుపుకు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి అయా గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా జరిపి ఎర్రజెండాలను ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సమావేశంలో మండల నాయకులు కె.ఈశ్వర్ లింగం, వి.పి.వెంకటేశ్వర్లు,యం.నాగమణి, అంబటి వీరాస్వామి,బి.లోకేశ్వరావు, బి.ఉపేందర్ రెడ్డి, సిహెచ్. ఎల్లయ్య, వి.మోహన్, ఎ.రామకృష్ణ, జి.వీరభద్రం, కె.రామకృష్ణ,డివైఎఫ్ ఐ నాయకులు వి.కొండయ్య, జి.అశోక్, వీరన్న, సర్వన్ తదితరులు ఉన్నారు.