థర్డ్ గ్రేడ్ దొంగ కల్వకుంట్ల తారక రామారావు అంటూ నిప్పులు చెరిగారు వెలిచాల రాజేందర్. మీడియా ముఖంగా వెలిచాల రాజేందర్ రావు ఎవరు అని కేటీఆర్ తన గురించి అడుగుతున్నారని, గతంలో తనతో ఖర్చు పెట్టించి, అవసరం ఉన్నంత వరకు నన్ను వెంట తిప్పుకొని, ఎన్నికల్లో పోటీ చేయమని అభ్యర్థించి, చివరకు దొంగ బీఫారం ఇచ్చిన కెసిఆర్ ని అడిగితే నేనెవరో చెబుతాడని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ గడ్డమీద పుట్టి, ఇక్కడే చదివి, ఇక్కడ జనాల మధ్య పెరిగిన నా గురించి అమెరికాలో బాత్రూంలు కడిగిన కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కరీంనగర్ లో కాలు మోపితే స్థానిక ప్రజలు కేటీఆర్ కు బడిత పూజతో స్వాగతం పలుకుతారని వెలిచాల తీవ్ర పదజాలంతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నగరంలోని మంచిర్యాల రోడ్డు చౌరస్తా, భగత్ నగర్ చౌరస్తా, కాశ్మీర్ గడ్డ రైతు బజార్ ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ మీటింగ్ లలో ప్రజల ఉద్దేశించి ప్రసంగించారు. తాను చిన్నతనం నుండి జగపతిరావు తనయుడుగా ఇక్కడ ప్రజలకు సుపరిచితుడునని, తన తండ్రి కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేసేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నానని, జగపతిరావు తనయుడుగా మీ ముందుకు వచ్చిన తనను హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో పార్లమెంటుకు పంపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కరీంనగర్ పర్యటిస్తున్న తనకు స్థానికుల నుండి వచ్చే ఆదరణ అమోఘమని, జీవితాంతం మీ ప్రేమను మర్చిపోనని, తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు కరీంనగర్ ప్రజల సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు.
35 ఏళ్ల క్రితం తన తండ్రి జగపతిరావు కట్టిన ట్యాంకుల నుండే నేటికీ కరీంనగర్ ప్రజల దాహార్తి తీరుతుందని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధి పథంలో ఉంది కాబట్టే స్మార్ట్ సిటీ శాంక్షన్ అయిందని, దాన్ని తెచ్చింది నేనేనంటూ బోయినపల్లి వినోద్ సంకలు గుద్దుకుంటున్నారని విమర్శించారు. స్మార్ట్ సిటీ పేరుతో కేంద్ర నుంచి వచ్చిన నిధుల్లో బండి సంజయ్, వినోద్ లు 30% వాటాను కాజేశారని ఆరోపించారు.
తన కుటుంబం మొదటి నుంచీ ఆర్థికంగా బలమైందని, ఎలాంటి చిన్న మచ్చ కూడా లేని తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. తాను ఎంపీగా గెలిచిన నెలలోపే పనులు ప్రారంభించి మూడు నెలల్లో మార్కెట్ భవనాన్ని పూర్తి చేసి రైతులకు కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు.