పార్లమెంటు ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మంది బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ జెడ్పిటిసి, సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, గోపాల్ రావుపేట్ ఎంపిటిసి సభ్యుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ బండ అజయ్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మడ్డి శ్యాంసుందర్, తాజా మాజీ సర్పంచులు నాగుల సంగీత రాజశేఖర్ గౌడ్, బక్క శెట్టి నరసయ్య, బిజెపి కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఎడవెల్లి రాజిరెడ్డి, వార్డ్ మెంబర్ బడుగు పద్మచంద్రయ్య, మన్నే గంగ మల్లు, టిఆర్ఎస్ బిసి సెల్ మండల ప్రధాన కార్యదర్శి పెంటి శంకర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. గంగాధరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వీరికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు విలువ లేదని పేర్కొన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తూ, పార్టీ కోసం కష్టపడ్డ వారిని నిర్లక్ష్యం చేశారన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల ఒంటెద్దు పోకడతో విసిగిపోయినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మకంతో ఆ పార్టీలో చేరినట్టు నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో రామడుగు ఎంపీపీ జవ్వాజి హరీష్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరవెణి తిరుపతి, వెన్నం రాజ మల్లయ్య, కొల రమేష్, నేరెళ్ల ఆంజనేయులు, అమిర్ శెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.