Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్TDP-Janasena honeymoon: టీడీపీ, జనసేనల హానీమూన్‌ వైసీపీలో పెరుగుతున్న టెన్షన్‌

TDP-Janasena honeymoon: టీడీపీ, జనసేనల హానీమూన్‌ వైసీపీలో పెరుగుతున్న టెన్షన్‌

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన పార్టీ టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్‌ పదేపదే చెప్పడం వెనుక అంతరార్థం ఇదేనని ఇరు పార్టీల నేతలు బలంగా చెబుతున్నాయి. సీట్ల సర్దుబాటు కుదరడమే మిగిలినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఏపీలో టీడీపీ జనసేన రెండూ కలసి ముందుకు సాగడం ఖాయమని ఇటీవలి రాజకీయ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పవన్‌, చంద్రబాబు ఇటీవల విజయవాడలో ఒక సంయుక్త సమావేశం కూడా ఏర్పాటు చేసారు. ఇందులో ఉభయులు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతునట్లు, ఇందులో భాగంగా త్వరలో ఇద్దరూ కలిసి రోడ్‌ మ్యాప్‌ కూడా తయారు చేయబోతు నట్లు ప్రకటించారు. దానితో బీజేపీతో కటీఫ్‌ చేసుకొని, టీడీపీతో జనసేన జతకట్టడం దాదాపుగా ఖ్యాయమని తేలిపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఓట్ల శాతంలో ఈ రెండు పక్షాలకు కనీసం 42-44 శాతం వుండవచ్చునని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఓట్ల శాతాన్ని కాపాడుకోగలిగితే, టీడీపీ జనసేన కూటమి అధికారానికి దగ్గరలో రాగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఈ కొత్త కలయిక ప్రభావం గట్టిగా ఉంటుందని అంచనా. దాంతో ఇప్పటి దాకా 175కి 175 సీట్లు మనకే వస్తాయని ధీమా పడిన వైసీపీ అధినాయకత్వం కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. గోదావరి జిల్లాలలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని గత ఎన్నికలలో ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు విడివిడిగా పాటీ చేయడం వలన, మొత్తం ఓట్లను గంపగుత్తగా తమకు అనుకూలంగా మలచుకోవడంలో ఈ రెండు పార్టీలు విఫలమవడం వలన వైసీపీ పని సుళువు అయ్యింది. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ చేసి ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లను ఏకం చేసి తమ కూటమికి మలచుకొని, దానికి తోడుగా కమ్యూనిస్టు, బీఎస్‌పీ ఓట్లను కూడా తెచ్చు కోవాలన్నదే వీరి వ్యూహంగా అనిపిస్తోంది. మచ్చిక చేసు కుంటూనే బీసీల మీద ఆధారపడి కొత్త రాజకీయం చేయాలని వైసీపీ వ్యూహంగా భావిస్తున్నారు..
టీడీపీ, జనసేన పార్టీలలో తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన నెట్‌వర్క్‌, క్యాడర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మాస్‌ ఇమేజ్‌ ఉన్నా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే స్థాయిలో లేదు. టీడీపీతో పోలిస్తే జనసేన బలం కాస్త తక్కువే అని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలను సామాజిక కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో రెండు బలమైన సామాజిక వర్గాలు రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
అయితే ఈ కూటమి జత కట్టడం రాజకీయ అని వార్యమైనా, ఇందులో అనేక తలనొప్పులు వున్నాయి. ముఖ్యంగా సీట్ల సర్ధుబాటు ప్రధాన సమస్యగా మారనున్నది. టీడీపీతో పొత్తు అనివార్యం కాబట్టి మెజార్టీ స్థానాలలో పోటీ చేసేందుకు జనసేన అవకాశం కోరుతోంది. ప్రస్తుతం టీడీపీ అధినేత మాత్రం 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందిన 18 స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. జనసేన మాత్రం అంతకు మించి ఎక్కువ స్థానాలను ఆశిస్తోంది. కనీసం 40 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలని భావిస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.
ఇప్పుడు వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన మరొకవైపు అన్నది దాదాపుగా ఖరారు అయ్యింది. అయితే బీజేపీ పరిస్థితి ఏమిటో ఇప్పటివరకు తెలియలేదు. పవన్‌తో తమ పార్టీ కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలే ప్రకటించినా అది పై పై మాటలుగా అర్ధమౌతోంది. ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య పొత్తు సంకేతాలు బలంగా వస్తున్నా, జనసేనతో సంబంధాలు బలపరచుకోవడం దిశగా ఆ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదన్నది నిర్వివాదాంశం. ఇదే జరిగితే, తమ వ్యతిరేక ఓటు చీలి విజయం సుసాధ్యం అంటూ వైసీపీ వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనల కూటమిలోకి బీజేపీని కూడా తీసుకువస్తే మంచిదన్నది టీడీపీ లక్ష్యంగా వుంది. రెండు పార్టీల పొత్తు ఫిక్స్‌ అయితే చాలామంది వైసీపీ ఫ్యాన్‌ ఎమ్మెల్యేలు ఓటమి బాట పట్టే ఛాన్స్‌ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలు జనసేన ఓట్లు చీల్చడం వల్లే గెలిచారు. అంటే వారికి టీడీపీపై వచ్చిన మెజారిటీ కంటే, వారు పోటీ చేసిన స్థానాల్లో జనసేనకు వచ్చిన ఓట్లే ఎక్కువ.. కాబట్టి టీడీపీ-జనసేనలు కలిసి బరిలో దిగితే దాదాపు 60 స్థానాల్లో ఫలితాలు మారిపోయే ఛాన్స్‌ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యగా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా రావోచ్చు. ఈ జిల్లాల్లో దాదాపు 50 సీట్లలో వైసీపీకి గెలుపు చాలా కష్టమని అంటున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో 10 స్థానాల్లో వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా వుంది. మొత్తానికైతే టీడీపీ-జనసేన ప్రభావం వల్ల వైసీపీ ఎమ్మెల్యే లకు రిస్క్‌ ఎక్కువే. అందుకే ఎప్పుడు జనసేన, టీడీపీల పొత్తు వార్తలు మీడియాలో వస్తున్నా వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు.

-సీహెచ్‌ ప్రతాప్‌
95508 51075

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News