Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Child marriages: బాల్య వివాహాలపై గగ్గోలు

Child marriages: బాల్య వివాహాలపై గగ్గోలు

కొద్ది రోజుల క్రితం ఒక ముస్లిం మహిళా సంఘం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న బాల్య వివాహాల నిరోధక చట్టం, లైంగిక కార్యకలాపాల నుంచి పిల్లలను కాపాడే చట్టం (పోక్సో) తదితర చట్టాలను ముస్లిం మతస్థులకు కూడా వర్తింప జేయాలని ముస్లిం మహిళల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. తమ మతస్థులలో అత్యధికంగా జరుగుతున్న బాల్య వివాహాల వల్ల మహిళల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా కల్పించుకుని మహిళలకు రక్షణ కల్పించేందుకు నడుంబిగించాలని ఆ సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వారు ఒక సమావేశంలో తీర్మానం కూడా ఆమోదించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది.
ఈ సమావేశంలో పలువురు మహిళలు భావోద్వేగంతో ప్రసంగించారు. వక్తలలోనే కాదు, ప్రేక్షకులలో సైతం ఆ రకమైన భావోద్వేగాలు, ఆవేదనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తమకు మరీ ముక్కుపచ్చలారని వయసులో వివాహాలు జరుగుతున్నాయని, వీటివల్ల జీవితం వ్యర్థంగా మారిపోతోందని వారు కన్నీరు మున్నీరవుతూ వెల్లడించారు. 14, 15, 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ముస్లిం బాలికల్లో అత్యధిక శాతం మందికి వివాహాలు జరిగిపోతున్నాయని వారు పేర్కొన్నారు. తమకు వైవాహిక జీవితం అంటే ఏమాత్రం తెలి యని వయసులో పెళ్లిళ్లు జరపడం, ఆ చిన్న వయసులోనే తమకు సంతానం కలగడం, ఇంటి బాధ్యతలు మీద పడడం వగైరా కారణాల వల్ల తమ కలలన్నీ కుప్పకూలిపోతున్నాయని, తమకు ప్రపంచమంటే ఏమిటో తెలియకుండాపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ వయసులో బాలికలకే కాదు, బాలురకు కూడా వివాహాలు జరిపించడం జరుగుతోందని, ఇది పెళ్లి వయసు కాకపోవడం అటుంచి, చట్టబద్ధమైన వయసు కూడా కాదని ఈ సమావేశంలో పలువురు ముస్లింలు వాపోయారు. వారికి ఆ వయసులో పెళ్లికి సంబంధించిన బాధ్యతలు కూడా తెలియవు. పైగా కుటుంబాలు కూడా పెద్దవి కావడం వల్ల వారు పెళ్లి సంబంధమైన బాధ్యతలకు కూడా నోచుకోలేకపోతున్నారు. పెళ్లికి వారు శారీరకంగా, మానసికంగా ఇంకా సిద్ధం కాని సమయంలో వారికి వివాహాలు జరిపించేయడం జరగుతోంది. ఈ దారుణ సంప్రదాయం నుంచి తమను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలని, వీటిని వెంటనే నిరోధించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు వక్తలు కోరారు. ఈ నేపథ్యంలోనే బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం ఉక్కు పాదం మోపడం ప్రశంసనీయమైన నిర్ణయంగా మారింది. అయితే, వివాహాలు జరిగిన మహిళలంతా మైనర్లు కారనే విషయాన్ని కూడా అసోం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కుటుంబంలోని పురుషులు జైలు పాలయినా లేక మరణించినా అటువంటి కుటుంబంలోని మైనర్‌ బాలికలకు వివాహాలు జరిపించడాన్ని నేరంగా లేదా చట్ట విరుద్ధంగా భావించాలా, వద్దా అన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కుటుంబం దెబ్బ తిన్నప్పుడు, కుటుంబ పెద్ద మరణించినప్పుడు మైనర్‌ బాలికలను ఇతరులు వేధించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారికి వివాహం రూపేణా రక్షణ కల్పించడం అనివార్యమవుతుంది.
ఒక్క ముస్లిం మతస్థులలోనే కాకుండా, ఇతర మతాల్లోనూ, తెగల్లోనూ, కులాల్లోనూ కూడా ఇటువంటి దురాచారాలు యథేచ్ఛగా, అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. అందువల్ల, బాల్య వివాహాల వల్ల చోటుచేసుకునే కష్టనష్టాల గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తోంది. బాల్య వివాహాలు చేసుకోవడం చట్ట విరుద్ధమని, ఎవరు బాల్య వివాహం చేసుకున్నా ఇందుకు బాధ్యులైన వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తోంది. ఎక్కడైనా, ఎవరి కుటుంబంలో అయినా వివాహం జరగబోతున్నట్టు తెలిసిన పక్షంలో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా ప్రభుత్వం సూచిస్తోంది. నిజానికి, ఇరుగు పొరుగు ఇళ్లలో బాల్య వివాహం జరగబోతున్నట్టు చాలామందికి ముందే తెలిసినప్పటికీ, అది చట్ట విరుద్ధం అని తెలియనందు వల్లే పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. సమాజంలో ఈ విషయంలో చూసీ చూడనట్టు ఊరుకునే వారి సంఖ్యే ఎక్కువ. అందువల్ల ప్రజలను ముందుగా ఈ విషయంలో చైతన్యవంతుల్ని చేయడం అన్నిటికన్నా ముఖ్యం.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News