ఓట్ల కోసం బిజెపిపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, రిజర్వేషన్ల రద్దు చేస్తామని కాంగ్రెస్ బోగస్ ప్రచారం చేస్తోందని మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉర్కొండ నుంచి మాదారం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో డికె అరుణ పాల్గొన్నారు. మార్గమధ్యలో స్థానికులను పలకరిస్తూ బిజెపికి మద్దతు ఇవ్వాలని కోరారు.
మిడ్జిల్, రాజాపూర్, జడ్చర్ల మండల కేంద్రాలలో రోడ్ షో లు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. జడ్చర్లలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని, మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ తెలంగాణకు మోడీ ఏం చేశాడని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి చేసింది గాడిద గుడ్డని, ఒక మహిళ అని కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, మోడీ గురించే మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని, కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలను నమ్మొద్దని ఆ పార్టీలు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నది మోదీనేనని, ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడింది బిజెపి ప్రభుత్వమేనని, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్య మవుతుందన్నారు. మిషన్ భగీరథకు జల శక్తి యువజన కింద కేంద్రం నిధులు కేటాయిస్తూ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బిజెపి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటున్నామని, ఇది మోదీ గ్యారంటీ అని.. కాంగ్రెస్ లా ఉత్తుత్తి గ్యారంటీలు కాదన్నారు.
మోదీ బంటుగా నేను మీ ముందుకు వచ్చానని మీరు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే ఐదేళ్లలో ఊహించని విధంగా అభివృద్ధి పనులు చేయాలని మోదీ ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని, ఇవి దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలని మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు బిజెపిని గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అజయ్ కుమార్, ఎడ్ల బాలవర్ధన్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్క నవీన్, సామల నాగరాజు, వెంకట్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.