నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. పశ్చిమ మధ్యంగా ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడ్రోజుల వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రేపు, ఎల్లుండి (నవంబర్23,24 తేదీల్లో) ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్టరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు కనిష్టానికి తగ్గాయని వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో గంటకు 15 కి.మీ వేగంతో చల్లటి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.