2022 సంవత్సరంలో ఏకంగా 2.25 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవటం సంచలనం సృష్టిస్తోంది. ఈలెక్కన మనదేశంలో మేధో వలసలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఈమేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖా మంత్రి జయశంకర్ ఇచ్చిన సమాధానం షాకింగ్ గా మారింది. అసలు లక్షల మంది భారతీయులు ఎందుకు మనదేశం వీడుతున్నారనేది ఆశ్చర్యకరమైన విషయమే.
2011 నుంచి చూస్తే 16 లక్షల మంది భారతీయులు మన పౌరసత్వాన్ని వదులుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. గతేడాది ఏకంగా 2,25,620 మంది భారతీయ పౌరసత్వం వదులుకోగా 2020లో 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకోవటం విశేషం. 2011 నుంచి ఇప్పటివరకు 16,63,440 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవటంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇలా వెళ్లిన మనవాళ్లు ప్రపంచంలో మొత్తం 135 దేశాల్లో పౌరసత్వాన్ని స్వీకరించారు.