ప్రజలకు భద్రత, భరోసా కల్పించడానికే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని రూరల్ సీఐ సదన్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రూరల్ సీఐ సదన్ కుమార్, ఎస్సై సుధాకర్ లు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన జరుగు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనలకు తావు లేకుండా చేయడంలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత, భరోసా కల్పించడానికి, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా, పారదర్శంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మండలంలోని ప్రతి ఎన్నికల కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండవద్దని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని ఎవరైనా సరే అతిక్రమించినట్లయితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.