Friday, November 22, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు సకల ఏర్పాట్లు పూర్తి

Rajanna Sirisilla: ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు సకల ఏర్పాట్లు పూర్తి

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వేములవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈ.వి.ఎం యంత్రాలను సదరు పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అప్పజెప్పాలని, రిజర్వ్ ఈవీఎం యంత్రాలు, రిజర్వు పోలింగ్ సామాగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉండాలని,సెక్టార్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

అనంతరం మీడియాతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ మన జిల్లాలో ఉన్న 2 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 547 పోలింగ్ కేంద్రాలలో 4 లక్షల 72 వేలకు పైగా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తప్పనిసరిగా మే 13న జరిగే పోలింగ్ లో పాల్గొనేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి,వారి ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన చల్లని త్రాగునీరు,క్యూలైన్ల వద్ద టెంట్లు,టాయిలెట్ ఇతర వసతులు కల్పించామని అన్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రం వద్ద అవసరమైన ర్యాంప్, ట్రై సైకిళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. వేసవి దృష్ట్యా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా కూలర్ ఏర్పాటు చేశామని, పారామెడికల్ బృందాలు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉన్నాయని, వీరికి అదనంగా మొబైల్ పారామెడికల్ బృందాలను సైతం సిద్ధం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలోనీ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, మన పోలీసు అధికారులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు.


50% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించామని అన్నారు. వేసవిలో ఎండల దృష్ట్యా భారత ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడగించిందని, సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ కేంద్రాల వద్ద పోలింగ్ సామాగ్రి సేకరించి వాటిని కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అధిక పోలింగ్ శాతం నమోదయ్యే విధంగా విస్తృతంగా ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని, జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలలో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఆలోచించి, స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ లైవ్ సెక్టర్ ఆఫీసర్ జి.పి.ఎస్ ట్రాకింగ్ వాహనాల వివరాలు పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News