Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Anantapuram: ప్రశాంతంగా, పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

Anantapuram: ప్రశాంతంగా, పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

2,236 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ క్యాస్టింగ్

జిల్లాలో ప్రశాంతంగా, పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఎస్.ఎస్.బి.ఎన్ కళాశాలలో సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం నగరంలోని జూనియర్ కళాశాలలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్ I.A.S, జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

- Advertisement -

గొడుగు, వాటర్ బాటిల్ తెచ్చుకోండి..

తదనంతరం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలలో భాగంగా ఈనెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ రోజు ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో మీ బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నా ఓటు వేసేందుకు ఖచ్చితంగా రావాలని చెప్పాలన్నారు. వేసవికాలం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టడం జరిగిందని, అయినప్పటికీ పోలింగ్ కేంద్రానికి ఓటర్లు ఉదయమే త్వరగా వచ్చి ఓటు వేయాలని, వీలైతే చిన్న వాటర్ బాటిల్ లో తాగునీరు, గొడుగు తీసుకువచ్చి ఓటు వేయాలని సూచించారు.

జిల్లా ప్రజలు ఐక్యమత్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగిందని, వారికి ఎన్నికలకు కావాల్సినటువంటి ఈవీఎంలు, మెటీరియల్స్ అన్ని అందించి పోలింగ్ కేంద్రాలకు పంపించారు. అనంతపురం, సింగనమల, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నగరంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉండగా, మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 2,236 పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రతి కేంద్రంలోనూ 100 శాతం వెబ్ క్యాస్టింగ్ చేయడం జరుగుతోందన్నారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట వీడియో కెమెరాలు ఉంటాయన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే పూర్తిగా వెబ్ క్యాస్టింగ్ లో నమోదవుతాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కఠినమైన చర్యలు తీసుకుంటే వారి జీవితమే పాడైనట్లు అవుతుందని, ఎక్కడ ఉద్యోగం దొరకదని, పోలీస్ వెరిఫికేషన్ లో కూడా క్లియర్ కాదన్నారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి సెక్షన్ 144 కూడా అమలులో ఉందని, గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల కోసం కేంద్ర బలగాలు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగిందన్నారు.

మైక్రో అబ్జర్వర్లను, వీడియోగ్రాఫర్లను సూక్ష్మ కేంద్రాలు ఎక్కువ ఉండటం వల్ల ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1,031 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పూర్తిగా వెబ్ క్యాస్టింగ్ ఉందని, ప్రతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లు వెళతారని, వారు అబ్జర్వర్లకు రిపోర్ట్ అందించడం జరుగుతుందన్నారు. పూర్తిగా వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను కవర్ చేశామని, 300 దాకా వీడియోగ్రఫీ చేస్తున్నామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో నెలరోజుల నుంచే కసరత్తు జరిగిందని, సమస్యలను సృష్టించే వారి జాబితా తమ దగ్గర ఉందని, వారిని నిత్యం పరిశీలన చేస్తున్నామన్నారు. ఎన్నికలను చాలా గట్టి బందోబస్తుతో పకడ్బందీగా చేస్తున్నామని, ఎవరూ కూడా ఎలాంటి గొడవలు సృష్టించే ఆలోచనలు పెట్టుకోవద్దని, ఎక్కడైనా ఎలాంటి సంఘటనలు జరిగినా అత్యంత వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో పోలింగ్ అంటే పండగతో సమానమని, అందరూ కూడా శాంతియుతంగా భాగం కావాలన్నారు.

ఎన్నికల కోసం 22,000 మంది పోలీసు సిబ్బందిని నియమించడం జరిగిందని, 11 కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇచ్చిన ప్రత్యేకమైన గ్రామాలు, పోలింగ్ కేంద్రాల జాబితా కూడా వివరంగా తాను, ఎస్పి, డిఐజి, రిటర్నింగ్ అధికారులతో వివరణ తీసుకుని అన్ని రకాల సమస్యాత్మక ప్రాంతాలను కవర్ చేసి, గట్టి బందోబస్తు చర్యలుతీసుకున్నామన్నారు.

ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారులతో ఆరా తీశారు. ఏర్పాట్లు బాగున్నాయా, మెటీరియల్ పంపిణీలో ఏమైనా గందరగోళం ఉందా అంటూ జిల్లా కలెక్టర్ ఆరా తీయగా అన్ని ఏర్పాట్లు బాగున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నంలోపు ఎవరెవరికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వారు చేరుకునేలా వేగంగా మెటీరియల్ పంపిణీ జరగాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు వసంత బాబు, జి.వెంకటేష్, వెన్నెల శ్రీను, తహసీల్దార్ శివరామిరెడ్డి, ఎన్నికల అధికారులు, పీఓ, ఏపీఓ, ఓపిఓలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News