FIFA World Cup 2022 : ఖతర్ వేదికగా జరుగుతున్నఫిఫా ప్రపంచకప్‌లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. బలమైన అర్జెంటీనా జట్టుకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇచ్చింది. 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది. మూడో ర్యాంక్‌లో ఉన్న అర్జెంటీనాను 51వ ర్యాంక్‌లో ఉన్న సౌదీ అరేబియా జట్టు ఓడించడంతో అర్జెంటీనా అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.
అర్జెంటీనా తరుపున మెస్సీ మాత్రమే గోల్ కొట్టాడు. ఆట ప్రారంభమైన పదవ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ దాన్ని గోల్‌గా మలిచాడు. తొలి హాఫ్ మొత్తం అర్జెంటీనా ఆధిక్యంలో కొనసాగింది. అయితే.. రెండో అర్థభాగంలో సౌదీ అరేబియా ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో 48వ నిమిషంలో సౌదీ అరేబియా ఫార్వర్డ్ ప్లేయర్ సలేహ్ అల్ షెహ్రీ తొలి గోల్‌ను అందించి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. మరికొద్దిసేపటికే మిడ్‌ఫీల్డర్ సలీం అల్ దవ్సారీ 53వ నిమిషంలో గోల్ చేయడంతో సౌదీ అరేబియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట చివరి వరకు తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది సౌదీ అరేబియా . దీంతో అర్జెంటీనా అభిమానులు షాక్‌లో ఉండిపోయారు.
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అర్జెంటీనా వరుసగా 36 మ్యాచుల్లో ఓటమి ఎరుగని జట్టుగా ఉంది.