ఇక తమ ప్రాంతానికి పర్యాటకులు రావద్దంటూ ఈ మధ్య ఉదకమండలం (ఊటీ) అధికారులు బోర్డులు పెట్టేస్తున్నారు. దేశంలో వేసవి తీవ్రత పెరిగిపోవడంతో ఈ శీతల ప్రాంతానికి లేదా హిల్ స్టేషన్ కి వస్తున్న పర్యాటకుల సంఖ్య సుమారు 200 శాతం పెరిగి పోయిందని అంచనా. ఇప్పటికే 40 లక్షలకు పైగా ఉన్న ఊటీ జనాభా ఈ వేసవిలో దాదాపు కోటి మంది జనం తో కిటకిటలాడి పోతోంది. రెండు రోజులు సేదదీరు దామని వెడుతున్న పర్యాటకులు రెండు గంటల్లోనే తిరిగి వస్తున్న ఉదంతాలు ఇప్పటికే అనేకం చోటు చేసుకున్నాయి. ఊటీ ఒక శీతల ప్రదేశమనడంలో సందేహం లేదు. పైగా భారీగా వర్షాలు కురవడం కూడా జరుగుతోంది. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయి, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ పర్యాటకుల జీవితాలే కాక, స్థానికుల జీవితాలు కూడా దుర్భరంగా తయారవుతున్నాయి. ఎక్కడ చూసినా జన ప్రభంజనం. ప్రతివారూ హడావిడిగా కనిపిస్తారు కానీ, ట్రాఫిక్ జామ్ ల కారణంగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి!
ఈ ఏడాది ఎండ వేడిమి మరింతగా పెరిగే సరికి ఊటీలో రద్దీ మరింత ఎక్కువైంది. ప్రస్తుతం అక్కడికి వెళ్లే పర్యాటకులు సేదదీరే అవకాశమే లేదు. దేశం నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకులు స్థానిక పర్యాటక కేంద్రాలైన బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్ వగైరాలను సందర్శించడానికి కొండవీటి చాంతాడంతో క్యూలలో నిలబడాల్సి వస్తోంది. పిల్లలతో వచ్చే పర్యాటకులకు ప్రస్తుతం ఇక్కడ సంక్షోభం, గందరగోళ పరిస్థితి, ట్రాఫిక్ సమస్యలు వగైరాలు స్వాగతం చెబుతున్నాయి. కొద్దో గొప్పో సేదదీరగలుగుతున్నది సంపన్నులే తప్ప మధ్య తరగతి, సాధారణ ప్రజానీకం మాత్రం కాదు. విచిత్ర మేమిటంటే, పర్యాటకులే కాకుండా స్థానికులు కూడా నానా అవస్థలూ పడడం జరుగుతోంది. వారి రోజువారీ కార్యక్రమాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ వేసవి కాలం ఎలా గడవబోతోందోనన్న బెంగ వారిని ఆవహిస్తోంది. ఒక్క ఊటీ అనే కాదు. దేశంలో ఏ హిల్ స్టేషన్‌ను చూసినా ఇదే పరిస్థితి. కొడైకెనాల్, సిమ్లా, ఏర్కాడ, నైనితాల్ తదితర ప్రాంతాలన్నీ ఊటీ మాదిరి గానే తయారయ్యాయి.
సమస్యల వెల్లువ సాధారణంగా హిల్ స్టేషన్లలో రెండు రకాల జనాభా కనిపిస్తారు. వృత్తి, ఉద్యోగాల కారణంగానో, ఇతర కారణాల వల్లనో అక్కడే స్థిరపడిన జనాభా ఒక రకం కాగా, ఇక్కడికి వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడానికి, కొద్ది పాటి ఆదాయం గడించడానికి వచ్చే జనాభా మరొక రకం. మొదటి రకం జనాభా ఈ కొత్త రద్దీని భరించ లేకపోతున్నారు. ఎప్పుడు ఏం జరగబోతోందోనన్న ఆందోళనతో బితుకు బితుకుమంటూ జీవితాలు గడుపుతున్నారు. నిజానికి ఇటువంటి జనాభాలో సగానికి సగం మంది వేసవి వస్తోందంటే, ఇళ్లకు తాళం పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రెండో రకం జనాభా కిందకు వచ్చే వ్యాపారుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాబులు, టూరిస్టు గైడ్లు వగైరాలున్నారు. సంక్షోభంలో ఉన్నా లేకపోయినా డబ్బు సంపాదించుకోవడానికి వారికి ఇదే సమయం.
దేశంలోని అనేక పర్యాటక కేంద్రాలు పర్యాటకులతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ జనాభాను అజమాయిషీ చేయడం కష్టసాధ్యమైపోతోంది. పర్యాటకుల సంఖ్య మితిమీరిపోవడంతో వీరికి సౌకర్యాలు కల్పించడం, వీరికి అనుకూలంగా పర్యాటక ప్రాంతాలు మార్పు చెందడం కష్టమైపోతోంది. ప్రభుత్వాలు గానీ, ప్రైవేట్ సంస్థలు గానీ, హోటళ్లు గానీ అదనపు పర్యాటక జనాభా గురించి ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడానికి అవకాశం ఉందని ముందుగానే తెలిసినా అధికారులు చేతులెత్తేయడం తప్ప చేయగలిగిందేమీ కనిపించడం లేదు. ఈ ఏడాది దేశంలోని ప్రతి పర్యాటక కేంద్రం పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రతి ప్రదేశమూ మితిమీరిన పర్యాటకులతో అవస్థలు పడుతోంది. పర్యాటక రంగం ద్వారా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్న ప్రభుత్వాలు తగిన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. మితిమీరిన పర్యాటకుల సంఖ్య వల్ల ఎక్కువగా కష్టనష్టాలు పడుతున్నది మాత్రం స్థానికులే. వ్యాపారులకు మాత్రం పర్యాటక జనాభా ఎంత పెరిగితే అంత లాభం, అంత సంతోషం.
పెరుగుతున్న భారం
విచిత్రమేమిటంటే, పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, వాయు కాలు ష్యం, జల కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరుగుతోందని, వీటిని ప్రభుత్వం లేదా స్థానిక అధికారులు తక్షణం నివారించాలని కోరుతూ న్యాయస్థానాలకు పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ఒక పిటిషన్‌కు సమాధానంగా మద్రాస్ హైకోర్టు మే 7 నుంచి జూన్ 30 వరకూ ఊటీలో ప్రవేశించే వాహనాలు తప్పనిసరిగా ముందస్తు పాస్ లు తీసుకోవాలని ఆదేశించింది. దీన్ని బట్టి చూస్తే మున్ముందు నియంత్రిత పర్యాటకం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోవచ్చు. పర్యాటకం మీద నియంత్రణతో పాటు పర్యవేక్షణ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి ఇష్టం వచ్చినట్టు, ఎప్పుడు పడితే అప్పుడు ఊటీ వంటి హిల్ స్టేషన్లకు, శీతల ప్రాంతాలకు పర్యాటకులు రావడానికి అవకాశముండదు.
ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ జపాన్ వంటి దేశాల్లో ఇప్పటికే పర్యాటకుల సంఖ్య మీద నియంత్రణ విధించడం జరిగింది. పర్యాటకుల వల్ల స్థానికుల సమస్యలు క్రమంగా పేట్రేగిపోతున్నాయి. వీరిని దృష్టిలో పెట్టుకుని అనేక దేశాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. పర్యావరణ వ్యవస్థ దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఐక్యరాజ్య సమితి సూచనల ప్రకారం పర్యాటకం మీదే కాకుండా పర్యావరణం మీద కూడా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కలుగు తోంది. మితిమీరిన పర్యాటకం అనేది ప్రపంచ దేశాలకు ఒక సమస్యగా మారుతోంది. పర్యాటక ప్రాంతాలను సందర్శించడం వల్ల పర్యాటకులు ఆనందం పొందుతున్నారు. వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తున్నారు. కానీ, పర్యాటక ప్రాంతం మాత్రం ఏ విధంగానూ అభివృద్ధి చెందడం లేదు. ఏ విధంగానూ లబ్ధి పొందడం లేదు. పర్యాటక ప్రాంతాన్ని అనేక విధాలుగా దోచుకుని ఎక్కడివాళ్లు అక్కడ వెళ్లిపోవడం జరుగుతోంది. స్పెయిన్, ఇటలీ, క్రోషియా వంటి దేశాలు ఈ మితిమీరిన పర్యాటకం కారణంగానే దెబ్బతిన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరి దీనికి పరిష్కారమేమిటి?
పర్యాటక పన్ను విధించడం వల్ల ఉపయోగముంటుంది. ఇది పర్యాటకుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు, పన్ను సొమ్ముతో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, సౌకర్యాలు పెంచడానికి అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువగా పన్ను విధించడం వల్ల సంపన్నులు మాత్రమే ఇక్కడకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిని సృష్టించడం ఏ విధంగానూ భావ్యం కాదు. అందువల్ల పర్యాటకులే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. దేశంలో ఊటీ లాంటి ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఊటీకి ప్రత్యామ్నాయంగా పర్యాటకులు అటువంటి ప్రదేశాలను ఎంచుకోవడం వల్ల కొత్త ప్రాంతాల అభివృద్ధికి అవకాశముంటుంది. పర్యాటక సొమ్ము కొన్ని ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇప్పటికే రద్దీగా ఉన్న పర్యాటక ప్రాంతాల మీద రద్దీ తగ్గడానికి కూడా అవకాశముంటుంది. ఇక వచ్చే ఏడాది నుంచి ఊటీ కంటే ఎలగిరి వంటి ప్రాంతాలకు వెళ్లి రావడం ఉత్తమం.
- డాక్టర్ ఎ. కనకదుర్గ