మహానంది క్షేత్రంలో వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా వార్షిక పుష్కరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, సుధా కుమారి దంపతులు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు, అర్చకులు రాజగోపురం వద్ద గంగాదేవి ఉత్సవ మూర్తిని ఆస్థానం గావించి, ఉపచారములన్నీ సమర్పించారు. తదుపరి నంది తీర్థము (రుధ్రగుండం) లోనికి తీసుకొని వెళ్ళి, ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించారు.
గంగమ్మకు అలంకార హారతులిచ్చి, సంకల్ప స్నానం నిర్వహించారు. పుష్కర స్నానానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా వైభవంగా పుష్కర మహోత్సవం నిర్వహించామన్నారు.
గంగాదేవి స్వయంభుగా వైశాఖ శుద్ధ సప్తమి నాడు నంది తీర్థంలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకున్నదని తెలిపారు. ఈరోజు గంగా ఉద్భవించిన రోజు అని, గంగాదేవి జన్మదినంగా కూడా పేర్కొంటారని అన్నారు. ఈరోజున ఆచరించే స్నానము విశేష ఫలితాన్ని ఇస్తుందని, 12 సంవత్సరాలకు వచ్చే పుష్కర స్నాన ఫలితాన్ని ఇస్తుందన్నారు.
నంది తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరించిన సర్వ పాపాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడిందన్నారు. అనేక ఔషధ గుణాలు కలిగిన కోనేరులో స్నానమాచరించిన అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతలవుతారని తెలిపారు. ఉత్తరాదిన గంగా సప్తమిగా ఈరోజును ఘనంగా నిర్వహిస్తారు. మన ప్రాంతాల్లో భగీరథ జయంతి పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.