Telangana BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ప్రజాల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటికే నాలుగు విడతల్లో సంజయ్ పాదయాత్ర చేపట్టారు. తాజా ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సంజయ్ సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం పాదయాత్ర డేట్ ఫిక్స్ చేసింది. ఈనెల 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు పాదయాత్ర సాగుతుందని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ వీరేందర్‌గౌండ్ మంగళవారం తెలిపారు.
బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి బండి సంజయ్ ఐదవ విడత యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్‌లో ముగింపు సభ ఉంటుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ద్వారా ఇప్పటికే నాలుగు దఫాలుగా ఆయా జిల్లాల్లో ప్రజల్లోకి వెళ్లారు. నాలుగు విడతల్లో 21 జిల్లాల పరిధిలో 1,178 కి.మీ ల మేర సంజయ్ నడిచారు. బీజేపీ శ్రేణుల్లో సంజయ్ పాదయాత్ర నూతనఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. నాలుగు దఫాలుగా జరిగిన పాదయాత్రలో తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని, బీజేపీ అధికారంలోకి వస్తే పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని సంజయ్ ప్రజలకు వివరించడంలో విజయవంతం అయ్యారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న బీజేపీ.. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్రను చేపట్టనుంది. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర డిసెంబర్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒకట్రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ సూర్యపేట, తుంగతుర్తి, పరకాల, వర్థన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 బైక్ లతో ర్యాలీ నిర్వహించనున్నారు. 10 నుంచి 15 రోజులపాటు ఇవి కొనసాగనున్నాయి. నిత్యం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించి స్థానిక సమస్యల గురించి నేతలు తెలుసుకోనున్నారు.