రాజధాని వివాదం తేలిపోయే రోజు దగ్గరపడింది. దీని మీద న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ, ప్రజలు మాత్రం తమ అభిప్రాయాన్ని తేల్చిచెప్పబోతున్నారు. జూన్ 4 తర్వాత రాజధాని మీద తీర్పు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకే అత్యంత ప్రాధాన్యం ఉంటుందనడంలో సందేహం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతా, విశాఖపట్నమా అన్నది జూన్ 4 తర్వాత తేలిపోతుంది. ఒక విధంగా చూస్తే, రాష్ట్ర రాజధాని మీదే రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనిపిస్తుంది. పాలక వై.ఎస్.ఆర్.సి.పి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు తమ మేనిఫెస్టోల్లోనే కాకుండా ప్రసంగాలు, ప్రకటనలు, తీర్మానాల్లో కూడా వివాదాస్పద రాజధాని అంశానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. వై.ఎస్.ఆర్.సి.పి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో కూడా జూన్ 4 తర్వాత రాష్ట్ర రాజధాని విశాఖపట్నమో కాబోతోందని, తాను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని పునరుద్ఘాటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్. చంద్రబాబు నాయుడు కూడా జూన్ 4 తర్వాత అమరావతే రాజధాని అన్నది ఖాయం కాబోతోందని, తాను అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో రాజధాని అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయిందన డంలో సందేహం లేదు. ఇదే అంశం మీద రాష్ట్రంలో ఎన్నికలు హోరాహోరీగా సాగిపోయాయి. ఈ అంశం చుట్టూనే మిగిలిన అన్ని అంశాలూ తిరుగుతున్నాయి. ఈ నెల 13న ఇక్కడ శాసనసభ, లోక్ సభ ఎన్నికలు ముగిసినందువల్ల ఓటర్లు దేనిని రాజధానిగా కోరుకుంటున్నారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
రాష్ట్ర ఓటర్లు ఎవరికి ఓటు వేశారన్నదాన్ని బట్టి విశాఖపట్నం, అమరావతిల మధ్య రాజధానిగా ఎంపిక చేసుకున్నారన్నది తేలిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి, విడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినప్పటికీ, రాష్ట్ర రాజధాని ఏమిటన్నది ఇంత వరకూ తేలలేదు. రాష్ట్రానికి ఇదమిత్థంగా ఒక రాజధాని అంటూ ఏదీ లేకుండానే పదేళ్లు గడిచిపోవడం నిజంగా ఒక పెద్ద రికార్డే. సుమారు రూ. 50,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిని నిర్మించాలని ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు కలలు కన్నారు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా ఆయన ఆశలు నెరవేరలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా సహాయమేదీ లభించలేదు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, వివాదాలు తేలకముందే చంద్రబాబు రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని తలపెట్టడం, అందుకు గాను ప్రజల నుంచి భూములు సేకరించడం వగైరాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు హడావిడిగా రాజధానిని అమరావతికి తరలించడాన్ని కూడా అంతా తప్పుపట్టడం జరిగింది. మొత్తానికి రాజధాని అంశం చంద్రబాబు విషయంలో ఒక కలగానే మిగిలిపోయింది.
ప్రజల్లో ఉత్కంఠ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులన్నీ ఎక్కడి వక్కడ ఆగిపోయాయి. అసంపూర్తిగా ఆగిపోయిన నిర్మాణాలతో అమరావతి ఇప్పుడొక పాడు బడిన ఇల్లులా దర్శనమిస్తోంది. విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కూడా
విశాఖపట్నంలో ఒకటి రెండు భవనాలను నిర్మించడం తప్ప ఇతరత్రా అభివృద్ధి చేసిందేమీ లేదు. అక్కడ కొత్తగా కార్పొరేట్ సంస్థలు రావడం గానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావడం గానీ జరగలేదు. రాజధాని నిర్మాణమనేది రెంటికీ చెడిన రేవడలా తయారైంది. జూన్ 2వ తేదీతో రాష్ట్ర
రా జధానిగా హైదరాబాద్ కొనసాగడమన్నది నిలిచిపోతుంది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం 2014 నుంచి పదేళ్ల పాటు, ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ఏర్పడే వరకూ, హైదరాబాద్ నగరమే రాజధానిగా కొనసాగడానికి అవకాశం ఉంది. ఈ ఒప్పందం గడువు జూన్ 2తో ముగుస్తుండడంతో ఇక తప్పనిసరిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్ణయం కావలసి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో రెండు మూడు భవనాలు ఉండడం తప్ప మొదటి నుంచీ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగానే కొనసాగుతోంది. నిజానికి, 2015లోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాజధానిని అమరావతికి తరలించేశారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన వ్యవహారాల రాజధానిగా అమరావతి, న్యాయ వ్యవహారాల రాజధానిగా కర్నూలు కొనసాగుతాయని ఆయన శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది. అధి కార వికేంద్రీకరణ, పాలనా వ్యవహారాల సౌలభ్యం కోసం తాను మూడు రాజధానులు ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ మాదిరిగా ఆంధ్ర ప్రదేశ్ లో బాగా అభివృద్ధి చెందిన నగరమేదీ లేదు. అభివృద్ధి చెందడానికి విశాఖకు మాత్రమే కొద్దో గొప్పో అవకాశాలు న్నాయి. అయితే, ఈ మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఎటూ తేలకుండా ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆశలు నెరవేరడమన్నది
కష్టభూయిష్టంగా మారింది. తాను తన నిర్ణ యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి విశాఖలో ఇల్లు నిర్మించుకున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘బాహబలి’ సినిమా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో రాజధాని రూపాన్ని తయారు చేయించారు. సింగపూర్ కంపెనీల సహాయంతో రాజధానిని నిర్మించాలని భావించారు. దానికి ప్రజా రాజధాని అని పేరు కూడా పెడదామనుకున్నారు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని విధంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఇదే తుది నిర్ణయం
చంద్రబాబు కలల సౌధం సవ్యంగా సాగేలా కనిపించ లేదు. ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. పచ్చని పంట పొలాలను స్వాధీనం చేసుకుని అక్కడ కాంక్రీట్ జంగిల్ ను నిర్మించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందంటూ హరిత ఉద్యమ నాయకులు గగ్గోలు పెట్టారు. ఏడాదికి మూడు పంటలు పండే ఈ పంట పొలాల్లో భవనాలు నిర్మించడం వల్ల భావి తరాలు అనేక విధాలుగా నష్టపోతారంటూ వారు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం రాజధాని అభివృద్ధి
సంస్థకు భూములిచ్చిన రైతులు, ఇతర వర్గాలు అయిదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్.సి. ఎస్.టి, బీసీల దగ్గర నుంచి రూ. 4,400 కోట్ల విలువైన 1,100 ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారంటూ కొందరు చంద్రబాబు ప్రభుత్వంపై పిటిషన్ వేయడం మరో సమస్యను సృష్టించింది. ఇప్పుడు వీటన్నిటి మీదా ప్రజలే తీర్పు చెప్పాల్సి ఉంది. దీని కోసం రాష్ట్ర ప్రజలంతా జూన్ 4 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-జి. రాజశుక