Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్PoK: అడకత్తెరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్

PoK: అడకత్తెరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్

వాస్తవాధీన రేఖకు అటూ ఇటూ అన్నీ సమస్యలే

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఆందోళనలు, ఉద్యమాలు, ధరల పెరుగుదల, వస్తువులకు కొరత, హింసా విధ్వంసకాండలు ఒక పక్క, పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత చర్యలు మరొకపక్క ఈ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పి.ఒ.కె)లో అశాంతి, అల్లర్లు చెలరేగడం హఠాత్ పరిణామమేమీ కాదు. ఇది స్వయం పాలిత ప్రాంతంగా పైకి కనిపిస్తున్నప్పటికీ, నిజానికి ఇది పూర్తిగా పాకిస్థాన్ సైన్యం, పాకిస్థాన్ ప్రభుత్వం చేతుల్లో ఉంది. గత ఆగస్టులోనే ఇక్కడ నిరసనలు, అల్లర్లు ప్రారంభం అయ్యాయి. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరగడం, గోధుమ పిండి ఎక్కడా లభ్యం కాక పోవడం వంటి సమస్యలపై ఇక్కడ అశాంతి ప్రారంభం అయింది. గత ఏడాది నుంచి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ నానాటికి దిగజారుతుండడంతో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నిత్యావసర వస్తువులన్నిటికీ కొరత ఏర్పడింది. ఇక్కడి ప్రజలు తమ ప్రభుత్వానికి,
పాకిస్థాన్ ప్రభుత్వానికి ఎన్ని పర్యాయాలు తమ సమస్యలను తెలియజేసినా ఆశించిన సమాధానం గానీ, పరిష్కారం గానీ రాకపోయే సరికి వారిలో అసహనం పెరిగిపోయింది. మొదట్లో శాంతియుతంగానే ప్రారంభమైన నిరసనలు ఈ ఏడాది నుంచి హింసాత్మకంగా మారిపోయాయి.

- Advertisement -

నిరసనకారుల మీద పాకిస్థాన్ భద్రతా దళాలు కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వందలాది మంది గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. నిరసనకారుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, మానవ హక్కుల ఉద్యమకారాలు, యువజనులు, వ్యాపారులు, ఉద్యోగులు. వీరంతా జాయింట్, అవామీ యాక్షన్ కమిటీ పేరుతో ఒక్కటయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అత్యధిక సంఖ్యలో జల విద్యుత్కేంద్రాలుండగా, తమకు విద్యుత్ సరఫరా సక్రమంగా, సజావుగా ఎందుకు జరగడం లేదని వీరు ప్రశ్నిస్తున్నారు. స్థానిక అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన విద్యుత్తును పాకిస్థాన్ కు, జాతీయ గ్రిడ్ కు మళ్లించాలని ఈ కమిటీ డిమాండ్ చేస్తోంది. నిత్యావసర వస్తువుల సరఫరా విషయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతోందని కూడా ఈ కమిటీ ఆరోపించింది. ఇవన్నీ చాలవన్నట్టు ప్రజలు ఎన్నుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధానమంత్రిని మార్చేయడాన్ని కూడా నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రధానమంత్రి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పి.టి.ఐ)పార్టీ నాయకుడు. ఆయన స్థానంలో నియమించిన వ్యక్తి కూడా పి.టి.ఐ పార్టీ నాయకుడే కానీ, ఆయన పాకిస్థాన్ ప్రభుత్వానికి విధేయుడు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసా విధ్వంస కాండలు చెలరేగుతుండడంతో అక్కడి ప్రజలను శాంతపరచడానికి పాకిస్థాన్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇటువంటి ప్యాకేజీని ప్రకటించడం వల్ల పెద్దగా ఉపయోగమేమీ కనిపించడం లేదు. కాగా, అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారతదేశ సహాయాన్ని కోరుతుండడం, భారత్ మంత్రులు, ఇతర నాయకులు కూడా ఆ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తుండడం ఈ సమస్యను ఒక కొత్త మలుపు తిప్పుతోంది. కేంద్ర హోమ్ మంత్రి, రక్షణ మంత్రి, మరి కొందరు మంత్రులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేయడం గురించి కూడా మాట్లాడుతుండడం జరుగుతోంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని వీరు వాగ్దానాలు చేయడం జరిగింది.

అయితే, వాస్తవాధీన రేఖకు అటూ ఇటూ కూడా ఇటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. భారత ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా తమకు విద్యుత్ సరఫరా కొరత ఉందంటూ చాలా కాలంగా ఫిర్యాదులు చేయడం జరుగుతోంది. తమ రాష్ట్రంలో అనేక జల విద్యుత్కేంద్రాలు ఉన్నప్పటికీ, తమకు విద్యుత్ సరఫరా సవ్యంగా జరగకపోవడం పట్ల వారు కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. శీతాకాలంలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయాలు కలుగుతున్నందువల్ల తాము అవస్థలు పడుతున్నామని వారు ఫిర్యాదులు చేయడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు వీలైనంతగా సహాయ సహకారాలు అందజేయడంతో పాటు, జమ్మూ కాశ్మీర్ ప్రజల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సాధ్యమైనంత త్వరలో శాసనసభ ఎన్నికలు నిర్వ హించడం వల్ల స్థానిక ప్రభుత్వం ఏర్పడి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాశ్మీర్ ప్రజల రోజువారీ సమస్యల పరిష్కారం మీద ఇప్పటికైనా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్టికల్ 370 రద్దుతో సమస్యలు పరిష్కారం కావని, ఆ తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడి నాయకులు కూడా కోరడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News