తెలంగాణ ప్రభుత్వం అడవుల పరిరక్షణ కోసం తీసుకొన్న చర్యల ఫలితంగా వన్య మృగాల సంఖ్య గణనీయంగా పెరిగిందని..అటవీ, పర్యావరణ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య 26కు చేరగా, చిరుత పులుల సంఖ్య 341 అయ్యిందన్నారు ఇంద్రకరణ్. రాష్ట్ర వ్యాప్తంగా (H.M.D.A తో సహా) 75,740 ఎకరాల విస్తీర్ణంలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 77 అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల అభివృద్ధి పనులు పూర్తై, 60 పార్క్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటి కోసం ఇప్పటి వరకు రూ. 360 కోట్లు ఖర్చు చేసినట్టు అసెంబ్లీలో ఆయన వివరించారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కు సంబంధించి అర్బర్ డే ఫౌండేషన్ హైదరాబాద్ ను ‘ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్’ గా గుర్తించడం మన హైదరాబాద్ నగరానికి దక్కిన గౌరవమని ఆయన సభకు తెలిపారు. దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ నగరానికి ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు -2022’ ప్రకటించిందని.. దేశంలో ఈ అవార్డులకు ఎంపికైన ఏకైక నగరంగా హైదరాబాద్ అని ఆయన వెల్లడించారు.