ఒక రచయిత రచనలోని సాహిత్యాంశాలను విలువకట్టే విధానం సాహిత్య విమర్శ. రచనలోని కీలకమైన విషయాంశాలను విశ్లేషించి చూపేవి విమర్శనాత్మక సమీక్షలు. అలాగే పుస్తకానికి తిలకం బొట్టు లాంటిది పీఠిక. ఆమూలాగ్రంగా రచనను ముందు పేజీల్లోనే ఆవిష్కరించి ఆలోచింపజేసేది పీఠిక. ఆసక్తిని రేకెత్తించి లోపలి పేజీల్లోకి పాఠకుడిని నడిపించే మహత్తర, బృహత్తర ప్రయత్నమిది. రచనను చక్కగా విచారించి విశ్లేషించడం ద్వారా సమీక్ష, పీఠిక రెండూ వెలుగొందుతాయి. సూర్యరాయాంధ్ర నిఘంటువులో విమర్శనము అన్న మాటకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్టుగా పర్యాలోచనము, సమీక్షణము, పరిశీలనము, యుక్తాయుక్త వాదనము అన్న మాటలు సమీక్ష, పీఠికలకు సంబంధించి అన్వయిస్తాయి. పరిశీలించి, ఆలోచించి, చర్చించి, పరిశోధించి, పరామర్శించి, పరికించి పాటించవలసిన వాటిని వివరించడమే సమీక్ష. పీఠికలలో జరిగే పని ఆలోచనలను సంధించి సారాన్ని నిగ్గుతేల్చి రచనలోని కవికి సంబంధించి నిబిడీకృతమైన సాహిత్య తత్వాన్ని సమీక్షించడం జరుగుతుంది. విభిన్న కోణాల నుండి నిర్దిష్ట సాహిత్య గ్రంథాన్ని ఎలా అధ్యయనం చేయవచ్చునో తెలపడమే కాక, సాహిత్య రంగంలో ఈ నిర్దిష్ట గ్రంథానికి ఉన్న విలువను పీఠిక చక్కగా నిర్ధారించి చూపుతుంది. రచనకు ఒక వస్తువు, ఒక రచనారీతి తప్పక ఉంటాయి. రచనలోని వస్తువునూ, రూపాన్ని ఆశ్రయించే విశ్లేషణ కొసాగుతుంది. రచనలోని వస్తువుకూ జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో తెలపడమే కాక సాహిత్య గ్రంథాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి, ఇతివృత్త జ్ఞాన విజ్ఞానాలను, నిర్మాణ విషయాలను, శిల్ప శక్తులను అర్థం చేసుకోవడానికి సమీక్షలు, పీఠికలు ఎంతగానో తోడ్పడతాయి. ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య వెలుదండ నిత్యానందరావు షష్టిపూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకొని వెలువరించిన సమగ్ర సాహిత్యంలో భాగంగా వెలువడిన గ్రంథం అనుభూతి – అన్వేషణ. ఇందులో పలు సందర్భాలలో ఆయన రాసిన సమీక్షలు, పీఠికలు ఉన్నాయి. నిశితమైన పరిశీలనా దృష్టి, ఆకట్టుకునే భాషా శైలితో విచక్షణా శక్తినీ, వివేకాన్ని పెంచేందుకు దోహదపడే విధంగా తన సమీక్షలు, పీఠికలను మలిచే కృషి చేశారు.
మోపిదేవి కృష్ణస్వామికి రాసిన మొదటి గ్రంథ సమీక్ష అన్వేషణ – అనుభూతి. పలు సందర్భాలలో వివిధ కవులు, రచయితల గ్రంథాలకు తాను రాసిన సమీక్షలు, పీఠికలను ఒకచోట సంపుటంగా ముద్రించే క్రమంలో మనసులో ఎంతగానో ముద్రపడిపోయిన తన మొదటి సమీక్ష శీర్షికనే పేరుగా నిర్ణయించారు. పుస్తకం చదివి అనుభూతి పొందినాకే అందులోని అంతరంగాన్వేషణ మొదలవుతుందని భావించి ఈ సంపుటికి ఆ పేరును ఖరారు చేశారు. ఇది ఆచార్య నిత్యానందరావు సమగ్ర సాహిత్యంలో మొదటి సంపుటి. ప్రధానంగా ఇందులో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో సమీక్షలను, రెండవ భాగంలో పీఠికలను చేర్చారు. 547 పేజీలలో 229 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలలో భాగంగా 147 సమీక్షలు, 82 పీఠికలను చేర్చారు. విమర్శలో సమీక్ష, పీఠికలు భాగమేనని భావించి రాసినట్టు ఇందులోని రచనాంశాలు చదివితే అర్థమవుతుంది. సమీక్ష, పీఠిక అన్నవి రెండూ మూల గ్రంథాన్ని చదవాలన్న ఆసక్తిని పెంచే విధంగా ఉండాలన్న సూత్రాన్ని పాటిస్తూ రచయిత ఆలోచించినట్టు ఇందులోని పలు పీఠికలు, సమీక్షలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి. గ్రంథకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వడమే కాక గుణదోష విచారణ కూడా ఈ సమీక్షలు, పీఠికలలో జరిగింది. ఉద్విగ్నమైన ఆవేశంతో సాగిన కొన్ని సమీక్షలు, పీఠికలలో గ్రంథకర్తలకు సుతిమెత్తని చురకలంటిస్తూనే దిశానిర్దేశాన్ని కూడా చూపారు. ఎలాంటి భేషజం లేకుండా ముక్కుసూటిగా తను అనుభూతి చెంది, అన్వేషించి చివరకు గుర్తించింది నేరుగా చెప్పుకుంటూ పోయారు. తనదైన ధోరణి, శైలిని సమీక్షలు, పీఠికల్లో అనుసరించే ముందుకెళ్లారు. రచనలలోని రచయిత శ్రమను, వస్తు రచనను, విశేషాంశాలను వెల్లడించడంలో మిత్ర సమ్మితమైన నిర్మల హృదయాన్ని ప్రదర్శించారు. సమీక్షలు, పీఠికలలో సాధ్యమైనంత కొత్త సమాచారాన్ని ఇవ్వడానికే ప్రయత్నించారు. అధ్యయనం, అనుశీలన, మమేకమైన స్థితితో సమీక్షలు, పీఠికలను రూపకల్పన చేశారు.
సమీక్షలు మొత్తం ఇందులో 147 ఉన్నాయి. అనుభూతి – అన్వేషణతో ప్రారంభమై గేయ హృదయ మర్మజ్ఞుడు ( గేయం – ఛందస్సు – డా. జి. చెన్నకేశవరెడ్డి)తో ముగిశాయి. పఠనాసక్తిని పెంచే రీతిలో ఈ సమీక్షలు జాగ్రత్తగా సాగాయి. ఒక్కొక్క రచనలోని విషయం, శైలి, ప్రత్యేకతలను వెల్లడిస్తూ సమీక్షను కొనసాగించారు. పుస్తకపు ఉద్దేశ్యంపై దృష్టిపెట్టి అందులోని సారాంశాన్ని అవలోకించి సోదాహరణ విశ్లేషణకు పూనుకున్న తీరు ఈ సమీక్షల్లో కనిపించింది. విమర్శారంగాన్ని విస్తృతం చెయ్యాలన్న సమీక్షకుని సాలోచన దాదాపు అన్ని సమీక్షల్లో తలెత్తి చూసింది. నిపుణత్వంతో విషయ స్పష్టతను సారంగా సమీక్షల్లో అందించే ప్రయత్నం జరిగింది. సందర్భోచితంగా సలహాలను, సూచనలను కూడా అందించారు. కొన్ని సమీక్షల్లో తులనాత్మక విశ్లేషణ కూడా కనిపించింది. సమీక్షలో సమీక్షకుడి వ్యాఖ్యలు కూడా మార్గదర్శనమనిపిస్తాయి. వందేమాతరం ( డా. ప్రసాదరాయ కులపతి), తిక్కన చేసిన మార్పులు – ఔచిత్యపు తీర్పులు ( డా. సుమతీ నరేంద్ర), గోపి గారి 9 వ్యాసాలు ( వ్యాస నవమి – డా.ఎన్. గోపి), రామాయణ మలయ పవనం ( ఆంధ్ర జానపద సాహిత్యం – రామాయణము – డా. కె. మలయవాసిని), కవితా కన్యకమోళి (మౌళి – శీలా సుభద్రాదేవి), విద్వద్గద్వాల సాహిత్య సేవ (గద్వాల సంస్థానం – సాహిత్యసేవ – డా. హరి శివకుమార్) ధన్యజీవి కాళోజి( కాళోజి నారాయణరావు జీవితం – రచనలు.. డా. తూర్పు మల్లారెడ్డి ) తెలుగు సినిమా పాట (డాక్టర్ పైడిపాల సత్యనారాయణ), మాలపల్లి సమగ్ర పరిశీలన ( డాక్టర్ సముద్రాల కృష్ణమాచార్య), విశ్వనాథ కృష్ణ కథాకావ్యాలు (డాక్టర్ టి శ్రీరంగస్వామి), పాలమూరు ప్రజల భాష (డాక్టర్ ఏ పాండయ్య), వ్యక్తిత్వం ( డా.సి నారాయణరెడ్డి), విశ్వనాథ నవలలు – మానవ సంబంధాలు ( డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు), పాలమూరు కవితారావం ( పాలమూరు కవిత – సం. భీంపల్లి శ్రీకాంత్), తొలి నవలపై పరిశోధన ( తెలుగులో తొలి నవల, శ్రీరంగరాజు చరిత్ర – ఆచార్య కొలకలూరి ఇనాక్), దాశరథికి ఘన నీరాజనం ( రుద్రవీణపై కోటిరాగాలు – సం. డా. ఘంటా జలంధర్ రెడ్డి), సమాజ శాస్త్ర కోణంలో మహాభారతం (భారతంలో బంధాలు – డా. కడియాల జగన్నాధశర్మ), భారతావలోకనంలో సహస్ర ప్రభలు (మహభారత ప్రమదావలోకనం – డా. ప్రభల ( నముడూరి), జానకి. వంటి సమీక్షల్లో లోతైన అధ్యయనం, సంయమన దృష్టి, అభివ్యక్తీరణలో విశిష్టత, విభిన్నతలను కనబరిచారు.
పీఠికలు మొత్తం ఇందులో 82 ఉన్నాయి. భిన్న భావాల దీపికలుగా రూపొందిన పీఠికలలో ఆనంద రేఖ (నవయుగ రత్నాలు, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం) తో ప్రారంభమై స్పందన (కరోనా కాపురం – ఆచార్య జి చెన్నకేశవరెడ్డి)తో ముగిశాయి. ఇందులో చేర్చిన పీఠికలు బహుముఖీనత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. విస్తృత అధ్యయనం, నిశిత పరిశీలన, స్పష్టమైన అవగాహన కలిగి రచనల పట్ల సహృదయతతో పీఠికలు ఉన్నాయి. అభినందించడమే కాకుండా సదరు కవి, రచయితలకు మార్గదర్శకంగా ఉండే సలహాలను, సూచనలను అందించడం కూడా కనిపిస్తుంది. పీఠికల్లో కాలయాపన కబుర్లు, అనవసర చర్చలు వంటివి కనిపించకుండా లోతుల్లోకి వెళ్లి విశ్లేషించడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. సరికొత్త విషయం, అందుకు తగిన సమన్వయం, తదనుగుణంగా ఆలోచనలకు తెరలు తీసే విశ్లేషణతో పీఠికలు ప్రత్యేకంగా ఉన్నాయి. విస్తృతమైన విషయ పరిజ్ఞానం పీఠికల్లో తొణకిసలాడుతుంది. సమాచారం అందించడమే కాకుండా విజ్ఞానదాయకంగా కూడా ఈ పీఠికలు ఉన్నాయి. రచనల పట్ల సమతూకం పాటిస్తూ నిబద్ధతతో సాహిత్య పురోగతిని కాంక్షిస్తూ సహృదయ స్పర్శతో పీఠికలు ఆకట్టుకుంటాయి. వస్తు, ప్రక్రియ, వైవిధ్యాలు సామాజికాంశాల రీతుల్లో కనిపించి ఆలోచనాత్మకంగా ఉంటాయి. పీఠికలు రచయితకే కాకుండా పాఠకుడికి విషయ, సమాచార మార్గదర్శనాన్ని అందించే తోవలుగా తోడ్పడతాయి. శిఖరం (నోరి సమీక్షలు – నోరి నర్సింహశాస్త్రి), స్నేహ ఫలం (వ్యాసచంద్రిక – డా. చింతల యాదయ్య), శ్రీవెంకటేశం తవసుప్రభాతం (వ్యాస వివేచన – డా. ఎన్.ఆర్. వెంకటేశం), పరిష్కృత విలాసం ( వేముల రామాభట్టు గౌరీవిలాసం – డా. కె. బాలస్వామి), ప్రమోద వీచి ( ద్వానా శతకం – పరిమి రామనరసింహ), నిర్మల సూక్తులు ( ఆత్మీయ సూక్తులు – ఆత్మీయ లక్కరాజు నిర్మల), సార్థక పరిశోధన ( తెలంగాణ వేగు చుక్కలు ఒద్దిరాజు సోదరులు – జీవితం సాహిత్యం – డా. కొండపల్లి నీహారిణి ), విద్య, సాహిత్య, వ్యాస కేదారరతులు (వ్యాసకేదారము – డా. రాపాక ఏకాంబరాచార్యులు), భావుక పరీమళం (అంబటిపూడి వెంకటరత్నం), చారిత్రక అవసర ( హరిదాసి – రంగరాజు పద్మజ), చమత్కారికలు (పన్ నీటి జల్లు – ఎలనాగ) వంటి పీఠికలు ఎన్నో అనుభూతులను పాఠకులకు అందిస్తాయి. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంకు పీఠిక రాయడంతో ఆరంభమై అనేక పీఠికల్ని అందించారు. విపుల అధ్యయనం, సూక్ష్మ పరిశీలనం, సమగ్ర అవగాహన, ఆలోచింపజేసే అభివ్యక్తితో ఈ సమీక్షలు, పీఠికలు అలరారాయి.
( ఈ నెల 21న ఆచార్య వెలుదండ నిత్యానందరావు అనుభూతి – అన్వేషణ పుస్తకానికి గాను సాహిత్య విమర్శ విభాగంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 2022 సాహితీ పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా ఈ వ్యాసం…)
- డా. తిరునగరి శ్రీనివాస్
9441464764