Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Sahithi vanam: కథా సాహిత్యానికి మార్గదర్శి శ్రీపాద

Sahithi vanam: కథా సాహిత్యానికి మార్గదర్శి శ్రీపాద

వ్యావహారిక భాషలో కథలు చెప్పిన..

తెలుగు కథలు, కథానికల రచనలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కథా రచనను ఒక కళగా తీర్చిదిద్దారు. ఏ కథ రాసినా, ఏ ఇతివృత్తాన్ని ఎంచుకున్నా అందులో అంతర్లీనంగా ఒక విజన్‌ కనిపిస్తుంది. ఒక విశిష్టత ఉంటుంది. బహుశా ఆ కారణంగానే కావచ్చు వర్ధమాన రచయితలు ఆయన కథలను అధ్యయనం చేయకుండా కథా రచనకు శ్రీకారం చుట్టేవారే కాదు. ఇంగ్లీషు సాహిత్యాన్నో, ఇంగ్లీషు కథా రచననో లేదా మరే భాషకు చెందిన కథలనో అనుసరించకుండా ఆయన కేవలం సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులనే పరిగణనలోకి తీసుకుని కథా రచన చేయడం జరిగేది. అంతేకాక, ఆయన తన కథలు, కథానికల ద్వారా మూఢ నమ్మకాల మీదా, ఆధిపత్య ధోరణి కలిగిన ఆచార సంప్రదాయాల మీదా తీవ్రస్థాయిలో పోరాటం సాగించారు. వందేళ్ల క్రితమే గ్రాంథిక భాషకు తిలోదకాలిచ్చి పూర్తి వ్యావహారిక భాషలో ఆయన తెలుగు కథలను వండి వార్చారు.
సమాజంలోని ప్రతి దురాచారం మీదా ఆయన కథా ముఖంగా పోరాటం సాగించారు. తాను తెలుసుకున్న విషయాలను, అర్థం చేసుకున్న అంశాలను ఆయన తన కథల ద్వారానే పాఠకులకు పంచి పెట్టారు. తనకు అన్వయించుకుంటూ, తాను ఆకళింపు చేసుకుంటూ సామాజిక స్పృహతో కథలు రాయడమనేది అప్పట్లో ఆయనకే చెల్లింది. చదరంగం ఆటను ఆధారంగా చేసుకుని ఆయన రాసిన ‘వడ్ల గింజలు’ కథ తెలుగు పాఠక లోకాన్ని ఎంతగా ఆకట్టుకుందో వర్ణించలేం. ఆ కథ యావత్తూ ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది. ఒక థ్రిల్లర్‌ లా సాగిపోతుంది. అటువంటి కథ తెలుగు సాహిత్యంలో మళ్లీ రాలేదంటే అందులో అతి శయోక్తేమీ లేదు. మనతో మాట్లాడుతున్నట్టుగా సాగిపోయే ఈ కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిని తెలుగు సాహిత్యంలో ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఆ తర్వాత ఆయన రాసిన ‘అరికాళ్ల కింద మంటలు’ స్ఫూర్తి దాయకంగా కూడా ఉంటుంది. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువ వితంతువు తన పిల్లలను పైకి తీసుకు రావడానికి పడ్డ కష్టాలను ఆయన ఈ కథలో కళ్లకు కట్టించారు. వితంతు పునర్వివాహం ఒక్కటే ఇందుకు పరిష్కారమన్నట్టుగా ఆయన ఈ కథను ముగించారు.
ఆయన ఈ విధంగా వందకు పైగా కథలు రాశారు. సరళమైన, మృదు మధురమైన తెలుగు భాషలో ఆయన రాసిన ఈ కథలన్నీ పాఠక లోకం మనసుల్లో హత్తుకుపోవడమే కాదు, ఇతర భాషల్లోకి కూడా అనువాదమై, ఇతర భాషల వారిని కూడా రంజింపజేశాయి. ఆయనకు దేశం నలుమూలల నుంచి వచ్చిన అభినందన లేఖలే ఇందుకు నిదర్శనం. ఆయన రాసిన కథలకు గాను ఆయనకు ‘కథా చక్రవర్తి’ బిరుదు కూడా లభించింది. ఆయన రక్షాబంధనం, స్మశాన వాటిక, ఆత్మబలి అనే నవలలు కూడా రాశారు. అయితే, తెలుగు సమాజం మీద ఆయన కథలు, కథానికలు చూపినంత ప్రభావాన్ని ఆయన నవలలు చూపించలేదు. ‘రాజరాజు’ శీర్షికతో ఆయన రాసిన నాటిక తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆయన రాసిన నాటిక జనరంజకం కావడంతో మరిన్ని నాటకాలు రాయాలంటూ ఆయన మీద తీవ్రంగా ఒత్తిడి వచ్చింది. అయితే, ఆయన ఇందుకు సిద్ధపడే లోపే ఆయన 70వ ఏట కన్నుమూయడం జరిగింది.
ఆయన రాసిన కథలను 12 సంపుటాలుగా ప్రచురించడం జరిగింది.

- Advertisement -

ఆయన ఆత్మకథ ‘అనుభవాలు-జ్ఞాపకాలు’ ఇతరుల ఆత్మకథలన్నిటి కంటే భిన్నంగా, వినూత్నంగా ఉంటుంది. అది ఎన్ని వేల ప్రతులు అమ్ముడుపోయిందో లెక్క లేదు. ఆయన మీద కందుకూరి వీరేశలింగం పంతులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి సంస్కరణవాద రచయితల ప్రభావం ఎంతగానో ఉంది. తెలుగు భాషతో పాటు, సంస్కృతంలో కూడా అ ద్వితీయమైన పాండిత్యం ఉన్న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఎక్కువగా వచన సాహిత్యానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తొమ్మిదేళ్ల పాటు ‘ప్రబుద్ధాంధ్ర’ అనే సంచికను నడిపారు. ఆయన తన జీవిత కాలాన్నంతా ఎక్కువగా సాహితీ సేవకే వినియోగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News