అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా నృసింహ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పూలతో స్వామివారిని అందంగా అలంకరించారు. మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహ వాహనంపై విహరించారు.
దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం సింహ వాహనం, జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. సింహ బలమంత భక్తి భావం ఉన్నవారికి స్వామి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా నిలిచే సింహాన్ని తన వాహనంగా మలచుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో స్వామివారు విహరించారు. సింహ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్ కుమార్, అర్చకులు ద్వారాకనాథ్, మయూరం బాలాజీ, గుండురావు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంలో విహరించనున్నారు.