విజయవాడలో 1935లో పుట్టి పెరిగిన కొమ్మూరి వేణుగోపాల రావు గురించి తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు సాహిత్యంలో తెలియనివారుండరు. సుమారు 15 ఏళ్ల వయసులోనే మొదటి నవల ‘పెంకుటిల్లు’ రాసిన వేణుగోపాల రావు నవలల కోసం, ఇతర వ్యాసాలు, విమర్శల కోసం పాఠకులు ఎంతో ముందుగానే వెయ్యి కళ్లతో ఎదురు చూసేవారంటే అందులో అతిశయోక్తేమీ లేదు. మొత్తం మీద ఆయన రాసింది 30 నవలలే అయినప్పటికీ, ప్రతి నవలా దాదాపు హాట్ కేక్ లా అమ్ముడుపోయేది. ప్రతి నవలా వేలాది ప్రతులు అమ్ముడుపోయిందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన తదుపరి రాయబోయే నవల కోసం అటు ప్రచురణ కర్తలు, ఇటు పాఠకులు ఆయన ఇంటి చుట్టూ తిరిగేవారని ప్రతీతి. ఆయన ఎన్నుకున్న ఇతివృత్తాలు, ఆయన రచనా శైలి, ఆయన కథన శిల్పం తెలుగు నవలా సాహిత్యంలో చెరగని ముద్ర వేశాయి. ఏ ఇతివృత్తమైనా సమకాలీన జీవితానికి దగ్గరగా, సామాజిక స్పృహతో ఉండేది కానీ, పుస్తకం పట్టుకుంటే ఆసాంతం చదివే దాకా వదిలిపెట్టకపోవడం దీని ప్రత్యేక లక్షణంగా ఉండేది.
ఆయన తన జీవిత కాలంలో రాసిన 30 నవలల్లో పెంకుటిల్లు, హౌస్ సర్జన్ అనే నవలలు అప్పట్లో యువ పాఠక లోకాన్ని ఉర్రూతలూగించాయి. కొత్త రచయితలు పుట్టుకు రావడానికి, వర్ధమాన రచయితల్లో స్ఫూర్తిని నింపడానికి, ఉత్తేజం కలిగించడానికి ఇవి చాలావరకు కారణమయ్యాయి. ముక్కు సూటిగా వ్యవహరించే డాక్టర్‌కు సంబంధించిన ఇతివృత్తంతో హౌస్ సర్జన్ ను రాయడం జరిగింది. ఆస్పత్రుల్లో డాక్టర్ల తీరుతెన్నులు, ఆస్పత్రి నిర్వహణ, రోగుల కథలు గాథలు, బంధువులు, కుటుంబ సభ్యుల అనుభవాలను వేణుగోపాల రావు అతి రమ్యంగా ఇందులో కళ్లకు కట్టించారు. ఇది చదివిన వారికి ఆస్పత్రి జీవితం గురించి ఇంత కంటే బాగా రాయగలవారు ఇక ఉండరేమోననిపిస్తుంది. సుమారు 15 ఏళ్ల ప్రాయంలోనే ఆయన రాసిన పెంకుటిల్లు నవల కూడా మనసులకు హత్తుకుపోతుంది. ఈ మొదటి నవల 1957లో అచ్చయింది. ఒక మధ్య తరగతి జీవితం గురించి ఆయన ఇందులో చక్కగా కథనాన్ని నడిపించారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతన కుదరని మధ్య తరగతి కుటుంబ సాఫల్య వైఫల్యాలను ఆయన ఇందులో పాఠకుల కళ్ల ముందుంచారు.
ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ప్రభావం ఆయన మీద ఎక్కువగా కనిపించేదని సమకాలీన సాహితీవేత్తలు చెప్పేవారు. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న ఇతివృత్తాల మీద శరత్ బాబు ప్రభావం బాగా ఉండేదని చెబుతారు. శరత్ బాబు శైలిని ఆయన అనుకరించడం, అనుసరించడం జరగలేదు కానీ, ఇతివృత్తాలను ఎంచుకోవడంలో మాత్రం శరత్ బాబు మాదిరిగానే విభిన్నత్వాన్ని, విలక్షణతను అనుసరించేవారని చెప్పవచ్చు. ఆయన రాసిన ఇతర నవలలు ‘ఈ దేశంలో ఒక భాగం’, ‘ఆత్మజ్యోతి’, ‘గోరింటాకు’, ‘ప్రేమ నక్షత్రం’, ‘నివేదిత’, ‘సూర్యుడు దిగిపోయాడు’ వగైరాలు తెలుగు నవలా సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. ఆయన ఈ నవలలు రాసి విజయాలు సాధించిన తర్వాత ఆయన బాణీలో దాదాపు ఇదే పంథా నవలలు రాయడం మొదలైంది. ఆయన నవలలను ఆధారం చేసుకుని చలన చిత్రాలు కూడా నిర్మాణం అయ్యాయి. ఆయన అనేక కథలను కూడా రాయడం జరిగింది. సాహిత్యానికి సంబంధించి విమర్శనాత్మక వ్యాసాలు రాయడంలో కూడా ఆయన సిద్ధహస్తుడు.
Sahithi Vanam: విలక్షణ నవలా రచయిత కొమ్మూరి
ఈయన రచనల కోసం వేచి చూసేవారు