Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Juveniles: మైనర్‌ అయినా నేరం నేరమే?

Juveniles: మైనర్‌ అయినా నేరం నేరమే?

నిందితులు, వారి సపోర్టర్స్ లో పశ్తాత్తాపమనేదే లేదు

గత వారం పుణేలో ఒక టీనేజర్‌ వేగంగా కారు నడిపి ఇద్దరి మరణానికి కారణం కావడం వెనుక అతని తప్పిదమే కాక, అతని తల్లితండ్రుల బాధ్యతారాహిత్యం కూడా ఉంది. అంతేకాదు, దీని మీద కాస్తో కూస్తో సామాజిక ప్రభావం కూడా ఉంది. ఒక 17 ఏళ్ల యువకుడు పబ్‌ కు వెళ్లి తాగుతాడని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనప్పటికీ, తన పోర్ష్‌ కారు ఎక్కి వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి ఇద్దరి మరణానికి కారకుడవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. అతనిలో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించ లేదు సరికదా, పొరపాటంతా తన కారుకు అడ్డం వచ్చిన వారిదేనన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మహా అయితే పోలీసులు తనను రెండు దెబ్బలు కొట్టి వదిలేస్తారని, తాను మేజర్‌ ను కాను కనుక తనను వదిలేస్తారని కూడా అతను భావించాడు.
పోలీసులు కూడా ఈ కేసును మొదట్లో ఒక ట్రాఫిక్‌ నేరంగా పరిగణించి తక్కువ శిక్షతో సరిపెడ దామనుకున్నారు. అతనితో ట్రాఫిక్‌ జాగ్రత్తలపై 300 పదాలకు మించని వ్యాసం రాయించి పంపేద్దామని కూడా ఆలోచించారు. అయితే, స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం, పోలీసుల తీరుకు ప్రతిఘటన రావడంతో పోలీసులు దీన్ని తీవ్ర నేరంగా పరిగణించి అతన్ని కస్టడీ లోకి తీసుకోవడం జరిగింది. కేసును ఏదో విధంగా మాఫీ చేద్దామని ప్రయత్నించిన తల్లితండ్రుల మీద కూడా ఇప్పుడు చర్య తీసుకోవడం ప్రారంభమైంది. అతను అన్నెం పున్నెం ఎరుగని పిల్లవాడని, అతనికి ఏమీ తెలియదని భావించడం కుదరదు. అతన్ని సాధారణ శిక్షలతో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అతను తీవ్రస్థాయి నేరానికి పాల్పడినందువల్ల, జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద అతన్ని ఒక పెద్దవాడిగానే పరిగణించడం జరుగుతుంది. ప్రస్తుతం అతని మీద పోలీసులు ఇండియన్‌ పీనల్‌ యాక్ట్‌ కింద, మోటార్‌ వాహనాల చట్టం కింద అరెస్టు చేశారు.
బాగా సంపన్నుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన అతని తండ్రి మీద కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. తన కుమారుడికి లైసెన్స్‌ లేదని, అతను విందుకు వెడుతున్నాడని తెలిసి కూడా అతని తండ్రి అతనికి కారు తాళం చెవులు ఇవ్వడం జరిగిందని పోలీసులు చెప్పారు. వాహన ప్రమాదం జరిగిన సమయంలో ఆ కుటుంబానికి చెందిన డ్రైవర్‌ కారును డ్రైవ్‌ చేస్తున్నాడని, ఆ టీనేజర్‌ కారును నడపడం లేదని ఒక కొత్త కథ అల్లడానికి కూడా ప్రయత్నం జరిగింది. తానప్పుడు కారులో లేనని డ్రైవర్‌ పోలీసులకు చెప్పేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. వాహన ప్రమాదం జరిగిన మరు క్షణం నుంచి ఈ కేసును నీరు కార్చడానికి, ఆ టీనేజర్‌ను గట్టెక్కించడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. తాగి కారు నడుపుతున్నాడనే ఆరోపణ నుంచి అతన్ని బయటపడేయాలనే ఉద్దేశంతో ఎనిమిది గంటల తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అప్పటికి అతని రక్తం నుంచి ఆల్కాహాల్‌ మాయం అవుతుందని తల్లితండ్రులు, పోలీసులు భావించారు.
ప్రమాదానికి కారకుడైన టీనేజర్‌ తండ్రి అర్ధరాత్రి వేళ స్థానిక శాసనసభ్యుడికి ఫోన్‌ చేయడంతో ఆ శాసనసభ్యుడు 2.30 గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లారు. టీనేజర్‌ కేసు విషయంలో చాలా మందిని బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని వీటన్నిటిని బట్టి అర్థమవు తోంది. శాసన సభ్యుడు అర్ధరాత్రి వేళ పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి వెళ్లిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక టీనేజర్‌కు మద్యం అమ్మినందుకు రెస్టారెంట్ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో ఎక్కడా మానవత్వమనేది కనిపించడం లేదు. అమానుష వ్యవహారమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కేసును మాఫీ చేయించడానికి తల్లితండ్రులు విశ్వప్రయత్నం చేశారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు కనీసం క్షమాపణ చెప్పిన దాఖలాలు కూడా లేవు. తల్లితండ్రుల్లో కూడా లేశమాత్రంగానైనా పశ్చాత్తాపం కనిపించలేదు. న్యాయాన్ని దారి మళ్లించడానికి డబ్బు, అధికారం, పోలీసులు చేతులు కలపడం జరిగింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, తాగి, నిర్లక్ష్యంగా కారు నడిపిన టీనేజర్‌ గానీ, అతన్ని కాపాడడానికి శత విధాలా ప్రయత్నించిన అతని తండ్రి కానీ న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News