కేంద్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావుకి భారత రత్న పురస్కారం అందించాలని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. జనార్థన్ డిమాండ్ చేస్తూ ఆమేరకు తమ కమిటీ తీర్మానం చేస్తోందని తెలిపారు.
ఎన్టీఆర్ 101 వ జయంతి పురస్కరించుకొని ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్ఎన్ సి సి) లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవించి ఉండగా ఆయనకు వ్యక్తిగతంగా సేవలు అందించిన ఎన్టీఆర్ వ్యక్తిగత వైద్యులు డా సోమరాజు, డా బి. ఎన్. ప్రసాద్, డా డి ఎన్ కుమార్ లతో పాటు వ్యక్తిగత సహాయకులు పి. ఏ గా పని చేసిన శివరామ్, వంటమనిషి బీరయ్య, సహాయ మేకప్ మెన్ అంజయ్య, డ్రైవర్ రమేష్, ఆఫీస్ అటెండెంట్ చంద్రశేఖర్ యాదవ్, ఎన్టీఆర్ అభిమానులు మన్నే సోమేశ్వర రావు, బొప్పన ప్రవీణ్, ఎన్టీఆర్ నఫీజ్, కొడాలి ప్రసాద్, ఈదర చంద్ర వాసులకు కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. జనార్థన్ సారధ్యం లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, తెలుగు దేశం నాయకులు కనుమూరి రామకృష్ణం రాజు (ఆర్ ఆర్ ఆర్), మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ప్రముఖ నిర్మాత కె. ఎస్ రామారావు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, పుండరీ కాంక్షయ్య తనయులు అట్లూరి నాగేశ్వర రావు పాల్గొని ఎన్. టి. రామారావుతో తమకున్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని, ఆయనలోని విశిష్ట లక్షణాలను గుర్తు చేశారు.
టీడీపీ నేత టి.డి. జనార్థన్ మాట్లాడుతూ – ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్న అతిథులందరికీ ఆహ్వానం, కృతజ్ఞతలు. నందమూరి తారక రామారావు గారి వ్యక్తిత్వాన్ని, సినీ, సామాజిక , రాజకీయ రంగాలలో ఆయన అందించిన విశిష్ట సేవలను భావి తరాలవారికి తెలియజెప్పాలనే ఆలోచనతో మేము ఈ కమిటీ ని ఏర్పాటు చేసాము. క్రిందటేడాది ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్ని ఘనంగా విజయవాడ, హైదరాబాద్ లలో నిర్వహించి ఆ సందర్భంగా 3 అపూర్వ గ్రంథాలుగా.. ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, శక పురుషుడు సావనీర్ లను వెలువరించాం. ఈ విజయవాడ కార్యక్రమానికి రజినికాంత్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన మరికొన్ని గ్రంథాలను వెలువరించబోతున్నాం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సేవలు అందించిన వారిని పిలిచి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉంది. రామారావు సినిమాల్లో చేసిన కృష్ణుడి క్యారెక్టర్ ను నాటకరంగం మీద పద్యాలతో పాడి నటించి అలరించిన నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఈ వేదిక మీద ఘనంగా సన్మానించుకుంటున్నాం. అలాగే అమెరికాలో ఉండి ఇక్కడ తెలుగు దేశం పార్టీ విజయాన్నికాంక్షిస్తూ మన కమిటీ మెంబర్ అట్లూరి అశ్విన్ ఒక వీడియోను రూపొందించారు. ఆ వీడియోను మనందరి ముందు ప్రదర్శిస్తున్నాం. రేపు మన పార్టీ సాధించబోయో విజయానికి ఈ వీడియో గుర్తుగా ఉంటుంది. మనం ఆ వీడియోను మన కార్యక్రమాల్లో ఉపయోగించుకోవచ్చు. రాబోయో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కి భారతరత్న పురస్కారం ఇచ్చి ఆయనను సముచితంగా గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ – నాన్నగారి 101వ జయంతి కార్యక్రమానికి వచ్చిన సోదర సోదరీమణులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. నాన్నగారు సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించి అశేష ప్రేక్షకాభిమానం పొందారు. రాముడు, కృష్ణుడు అయనే అనేంత పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. రైతులకు అండగా నిలబడ్డారు. కార్మిక, యువత, బీసీ వర్గాలకు చేయూతనిచ్చారు. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యుగ పురుషుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1982 డిసెంబర్ 9, 10 తేదీలలో తన అన్న బాలకృష్ణ, తన వివాహాలు తిరుపతిలో జరిగినప్పుడు.. నాన్న రాలేక పోయారు. ఫోన్ లో మాతో మాట్లాడుతూ… ‘ఐయాం సారీ.. మేము మీ పెళ్ళికి రాలేక పోయాం. ఇప్పుడు మీరే కాదు.. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే’అని చెప్పారంటూ ఆయన ఒకింత భావోద్వేగంతో ఆ సంఘటన మననం చేసుకొన్నారు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ – ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆయన యుగపురుషుడు. ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి. ఎన్టీఆర్ కు భారతరత్న అవసరం లేదు. కానీ భారతరత్నకు ఎన్టీఆర్ అవసరం ఏర్పడుతోంది. ఇటీవల భారతరత్న ఇస్తున్నవాళ్లను చూస్తే ఇదే అర్థమవుతోంది. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జనార్థన్ గారికి అభినందనలు తెలుపుతున్నా అన్నారు.
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ – భారతదేశమే కాదు ప్రపంచమంతా గర్వించదగిన వ్యక్తి రామారావు గారు. ఆయనతో సహాయ దర్శకుడిగా నా కెరీర్ మొదలైంది. నా మిత్రుడు అశ్వనీదత్ రామారావు గారితో సినిమాలు నిర్మిస్తున్నప్పుడు నాకూ నిర్మాతగా అలాంటి అవకాశం వస్తుందేమోనని ఆశించాను. ఆయన అగ్నిపర్వతం సినిమా చేస్తున్నప్పుడే సడెన్ గా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. మా అందరినీ హైదరాబాద్ రమ్మన్నాడు. ఆయనతో పాటు వచ్చాం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఎన్టీఆర్. ఈ ఫిలింనగర్ క్లబ్ కూడా ఆయన మంజూరు చేసిందే. ఆ తర్వాత చంద్రబాబు గారు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు రామారావు గారు. ఇప్పుడూ ఏపీలో అదే పరిస్థితి నెలకొని ఉంది. మన ఆత్మగౌరవం మళ్లీ రామారావు గారి స్ఫూర్తితో కాపాడుకోవాలి అన్నారు.
ఎన్టీఆర్ వ్యక్తిగత వైద్యులు డా సోమరాజు,డా బి. ఎన్. ప్రసాద్, డా డి ఎన్ కుమార్ లు ఎన్టీఆర్ తో తమ అనుబంధాన్ని వివరించారు. తమ మధ్య ఆరోగ్య అంశాలతో పాటు హాస్య స్ఫోరక సంభాషణలు చోటుచేసుకునేవని, తాము కొన్ని సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు ఎంతో స్పోర్టివ్ గా తీసుకునేవారని చెప్పారు. అటువంటి వ్యక్తిని మళ్ళీ చూడలేమని, ఆయనతో గడిపిన క్షణాలన్నీ ఎంతో మధురమైనవిగా, ఎప్పటికీ గుర్తుండిపోతాయని మననం చేసుకొన్నారు. మాజీ ఎంపీ శ్రీ యలమంచిలి శివాజీ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితుల్ని వివరించారు.
కాగా, వందలాది మంది ఎన్టీఆర్ అభిమానులు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఉభయ రాష్ట్రాల నలుమూలల నుంచి తరలి వచ్చారు. అభిమానులు కోలాహలం మధ్య నందమూరి రామకృష్ణ, టి.డి. జనార్థన్ తదితరులు ఎన్టీఆర్ బర్తడే కేక్ కు కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆద్యంతం కమిటీ కన్వీనర్ అట్లూరి నారాయణ రావు హృద్యంగా నడిపించారు. కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.