ప్రధాని నరేంద్ర మోడీ హెక్టిక్ షెడ్యూల్స్ మధ్య ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఆయన విస్తృతంగా 10,800 కిలోమీటర్లు ప్రయాణించి..10 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రధాని సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అగర్తలా నుంచి ముంబై వరకు అక్కడి నుంచి లక్నో, అటునుంచి బెంగళూరు ఇలా దేశం నలుమూలలా కాళ్లకు చక్రాలు కట్టుకుని అక్కడి అధికారిక, పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటున్నారు.
ఫిబ్రవరి 10వ తేదీని ఉదాహరణగా తీసుకుంటే.. ఆరోజు ప్రధాని ఢిల్లీ నుంచి లక్నో వెళ్లి..యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును ఆవిష్కరించారు. ఆతరువాత ముంబై వెళ్లి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించారు. సిటీలోని సైపియా క్యాంపస్ ప్రారంభించి.. ఢిల్లీ వచ్చారు. మొత్తంగా 2,700 కిలోమీటర్లు ప్రయాణించారు అది కూడా ఒక్కరోజులో. ఆమరుసటి రోజు త్రిపుర వెళ్లి రెండు మీటింగుల్లో పాల్గొని ఢిల్లీ తిరిగి రావటానికి 3,000 కిలోమీటర్లు ఒక్కరోజులో ప్రయాణించాల్సి వచ్చింది. ఆదివారం కూడా ఉదయం లేచినదగ్గరి నుంచీ ఇలాంటి షెడ్యూల్ కొనసాగుతోంది.