Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Election commission changes mind: మనసు మార్చుకున్న ఎన్నికల కమిషన్‌

Election commission changes mind: మనసు మార్చుకున్న ఎన్నికల కమిషన్‌

అందుకే పిటిషన్స్ తిరస్కరిస్తున్న సుప్రీం

నియోజకవర్గాల వారీగా ఓట్ల వివరాలను వెల్లడించడానికి ప్రధాన ఎన్నికల కమిషన్‌ ఎట్టకేలకు ముందుకు వచ్చింది. ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికల్లో అయిదవ దశ కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ వివరాలతో సమగ్ర నివేదికను బయటపెట్టడానికి కమిషన్‌ సిద్ధపడడం ప్రశంసనీయ విషయంగా కనిపిస్తోంది. ఈ వివరాలను వెల్లడించడానికి మొదట్లో ఎన్నికల కమిషన్‌ నిరాకరించిన విషయం విదితమే. ఫారమ్‌ 17సి రూపంలో వెల్లడించే ఈ వివరాలను కమిషన్‌ గత శనివారం బయటపెట్టింది. ఈ వివరాలను వెల్లడించే విషయంలో కమిషన్‌ కు ఆదేశాలు జారీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించినప్పటికీ కమిషన్‌ వీటిని వెల్లడించడం హర్షణీయంగా కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే పోలింగ్‌ కేంద్రం స్థాయిలో ఓటర్ల వివరాలు వెల్లడించవలసి ఉంటుంది. ఈ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని, ఇందుకు సంబంధించిన చట్టమేమీ లేదని, మొదటి దశలోనే ఈ వివరాలను వెల్లడించే పక్షంలో ఇవి దుర్వినియోగం, దురుపయోగం అయ్యే అవకాశం ఉందని కమిషన్‌ మొదట్లో వాదించింది.
ఇదివరకటి ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్‌ కేంద్రం స్థాయిలో పూర్తి వివరాలు వెల్లడించడానికి, 17సి ఫారమ్‌ ను బయటపెట్టడానికి కమిషన్‌ మొదట్లో విముఖత చూపించింది. న్యాయస్థానం కూడా కమిషన్‌ కు ఈ విషయంలో ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ కమిషన్‌ ఎందుకు మనసు మార్చుకుందనేది అంతుబట్టడం లేదు. న్యాయస్థానం ప్రస్తుత వేసవి కాల సెలవుల తర్వాత ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నందువల్ల కమిషన్‌ ముందుగానే ఈనిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఓటింగ్‌ వివరాలను అడ్డం పెట్టుకుని, తప్పుడు ప్రచారాలకు పాల్పడే అవకాశం ఉందని, దుర్వినియోగం చేసే సూచనలు కూడా ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియ మీద దీని ప్రభావం పడే అవకాశం ఉందని కమిషన్‌ అప్పట్లో వాదించడం జరిగింది. అయితే, ఏ పోలింగ్‌ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే విషయంలో పారదర్శకంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్‌ ఇటువంటి కుంటి సాకులు చెప్పడం సమంజసంగా లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
ఎన్నికల కమిషన్‌ కు నేరుగానూ, న్యాయస్థానం ద్వారానూ అభ్యర్థనలు పంపించిన పార్టీలు, వ్యక్తులు, సంస్థలు మనసులో ఏదో పెట్టుకుని లేదా కుట్రపూరిత ఉద్దేశాలతో ఈ అభ్యర్థనలు పంపడం జరిగిందన్న అభిప్రాయం కమిషన్‌ వాదనలో స్ఫురిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు మాత్రమే మనసులో ఏదో పెట్టుకుని ఇటువంటి వాదనలు చేయడం జరుగుతుంటుంది. నిజానికి ఇటువంటి అభ్యర్థనలు న్యాయబద్ధమైనవే. వీటిపై కమిషన్‌ సానుకూలంగానే స్పందించాల్సి ఉంటుంది. మొదటి దశ ఎన్నికల తర్వాత ఓటింగ్‌ వివరాలను వెల్లడించకపోవడం వల్లే కమిషన్‌ మీద ఒత్తిడి తీసుకు రావడం జరిగింది. ఎన్నికల కమిషన్‌ తప్పనిసరిగా పారదర్శకంగా, తటస్థంగా, విశ్వసనీయంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇవే అంశాల్లో కమిషన్‌ చర్యలను ప్రశ్నించడం జరుగుతుంటుంది. ఎన్నికల కమిషన్‌ తీరుతెన్నులను ప్రశ్నించడం ప్రారంభం అయిందంటే అందుకు కమిషన్‌ వ్యవహారమే కారణం. ఇందులో కుట్ర కోణం ఉందనడం సమంజసంగా కనిపించడం లేదు.
ఎన్నికల మధ్యలో ఎన్నికల కమిషన్‌ దృష్టిని మళ్లించడం ఇష్టం లేనందువల్లే తాము ఇందుకు సంబంధించిన పిటిషన్లను తిరస్కరించడం జరుగుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో మాత్రమే ఓటింగ్‌ వివరాలు అవసరమవుతాయే తప్ప ఎన్నికల తర్వాత ఆ వివరాలను బయటపెట్టి ప్రయోజనం ఉండదని కూడా కోర్టు స్పష్టం చేసింది. 2019 ఎన్నికల సమయంలో ప్రస్తావించిన అంశాలనే ఇప్పటి పిటిషన్లలో కూడా ప్రస్తావించడం జరిగిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అప్పటి పిటిషన్లకు కోర్టు సమాధానం ఇవ్వకపోవడం వల్ల ఈసారి కూడా పిటిషన్లు దాఖలు చేయవలసి వచ్చింది. న్యాయస్థానం అప్పుడే స్పందించి ఉంటే ఈసారి ఈ సమస్య తలెత్తేదే కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News