దేశంలోని అధిక సంఖ్యాక ఓటర్లలో అనాసక్తి, నిర్లిప్తత పెరిగిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ చిట్టచివర దశలో ఉన్న సమ యంలో ఎన్నికల తీరుతెన్నులను పరిశీలించినప్పుడు ఓటర్లలో 2014, 2019 ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల పట్ల అనాసక్తి బాగా పెరిగిపోయిన సూచనలు కళ్లకు కట్టాయి. రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా తేడాలుంటే ఉండవచ్చు. తూర్పు, ఈశాన్యం, దక్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం కాస్తంత నిలకడగా సాగింది కానీ, ఉత్తరం, పశ్చిమ రాష్ట్రాల్లో ఓటర్లలో ఆసక్తి బాగా తగ్గి పోయినట్టు దాఖలాలు కనిపిస్తున్నాయి. నిజానికి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మినహాయిస్తే ఈ 2024 ఎన్నికల్లో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఓటింగ్ శాతంలో పెరుగుదల మాత్రం ఎక్కడా నమోదు కాలేదు. తెలంగాణలో 62.8 శాతం నుంచి 65.7 శాతానికి ఓటింగ్ పెరిగింది. కర్ణాటకలో 68.8 శాతం నుంచి 70.6 శాతానికి ఓటింగ్ పెరిగింది.
ఓటింగ్ శాతంలో బాగా తగ్గుదల కనిపించడం అటుంచి, మొదటి ఆరు దశల్లో ఎన్నికలు జరిగిన 485 నియోజకవర్గాల్లో 132 నియోజకవర్గాలో ఓటర్ల అనాసక్తి మరీ హద్దులు దాటినట్టు కనిపి స్తోంది. ఇంత పెద్ద స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గడం 2009లో నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఇదే మొదటిసారి. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల శాతం తగ్గిన నియోజకవర్గాల సంఖ్య ఈసారి బాగా పెరిగింది. ఓటర్ల సంఖ్య ఇలా తగ్గిపోవడానికి అనేక ఇతర కారణాలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఓటర్ల శాతం 2019తో పోలిస్తే 4.4 శాతం తగ్గింది. అదే విధంగా వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో కూడా ఓటింగ్ శాతం ఏకంగా 6.6 శాతం తగ్గి పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఉన్న ఇండీ కూటమి జాతీయ స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా దాదాపు అన్ని పార్టీలకు ఓట్ల శాతం తగ్గడం గమనించాల్సిన విషయం.
ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, మధ్య భారతంలోనూ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోవడానికి వలసలు కూడా కొంత వరకూ కారణమా అన్న సందేహం కలుగుతోంది. బీహార్ రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఓటింగులో పాల్గొనడం జరిగింది. అయినప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం బాగా తక్కువగానే ఉంది. దేశంలో అనేక చోట్ల వడగాడ్పులు వీస్తుండడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించే ముందు ఎన్నికల కమిషన్ ఇటువంటి ప్రశ్నలకన్నిటికీ ఇప్పుడే సమాధానాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే ఓటింగ్ శాతం బాగా ఎక్కువగా ఉంటూ వస్తోంది. అందువల్ల, ఓటింగ్ శాతం తగ్గడమనేది ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఎక్కువ దశలుగా పోలింగ్ జరపడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. కారణం ఏదైనా ఓటింగ్ శాతం తగ్గడమనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరం కాదు. ఓటర్లలో ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల ఆసక్తి తగ్గడమంటే రాజకీయ పార్టీల పట్ల నమ్మకం కోల్పోవడమనే అర్థం చేసుకోవాలి. ప్రజలు ఓటు చేశారంటే తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారని, ప్రజలు ఓటు వేయలేదంటే తమకు ఇష్టం లేని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారని అర్థం.
Indians not interested in voting: ఓటు వేయలేదంటే ఇష్టం లేని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టు
నిర్లిప్త స్థితిలో భారతీయ ఓటర్లు