Saturday, October 5, 2024
HomeNewsNani Muthyalu: తెరిపిలేని కవితా ధార.. నానీ ముత్యాలు

Nani Muthyalu: తెరిపిలేని కవితా ధార.. నానీ ముత్యాలు

  ఈ భూమ్మీద మనిషి రెండు పాదాలతో నడవడం సర్వసాధారణం.  కానీ కొంతమంది కవులు నాలుగు పాదాలతో నడుస్తున్నారు. ఆ నాలుగు పాదాల సమూహమే నానీలు. ధర్మం నాలుగు పాదాలతో నడిచినట్లే  నేటి మినీ కవిత నాలుగు పాదాలతో నడవడం ఒక కవితా ధర్మం. తెలుగు కవితా వ్యాసాంగంలో  ఒక సృజన కార్యక్రమముగా  నానీల ప్రక్రియ కొనసాగుతుంది. అసలు నానీల ప్రక్రియను సృష్టించిన వారు డాక్టర్ ఆచార్య ఎన్. గోపి గారు. దాదాపు 28 సంవత్సరాల క్రితం కవితా ప్రక్రియలో సృష్టించిన లఘు రూపమే ఈ నానీల ఆవిర్భావం. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అనేకమంది కవులు అనేక నానీల సంపుటాలు ఇప్పటికే వెలువరించారు.   తెలుగు సాహిత్యంలో నాలుగు పాదాలు కలిగి ఉండి, కనీసం 20 అక్షరాలకు  తక్కువ కాకుండా 25 అక్షరాలకు మించకుండా అక్షరాలలో సాగే సూక్ష్మ కవితా ప్రక్రియను 'నానీలు' అంటారు. మొట్టమొదటిసారిగా నానీలను 2002 సంవత్సరంలో డాక్టర్ ఎన్. గోపి గారు తన  పుస్తకం ద్వారా పరిచయం చేశారు.  నాని అనేది తెలుగు సమాజంలో తమ పిల్లలను ప్రేమగా పిలవడానికి ఉపయోగించే పదం.' నానీలు 'అంటే అర్థం ఇందులోని మొదటి అక్షరం 'నా ' అంటే  " 'నా'కు" చెందినవని, 'నీ'అంటే  " 'నీ'కు "కు చెందినవని అర్థం. అనగా ఈ ప్రక్రియలోని భావాలు   "నాకు, నీకు "అనగా అటు రచయితకు,ఇటు పాఠకునికి  చెందినవిగా భావించాలి . ఈ నానీలు అనేవి మినీ కవితల కంటే క్లుప్తమైనవి, శక్తివంతమైనవి. అతి సూక్ష్మమైన,సున్నితమైన భావాన్ని  అతి తక్కువ పదాలతో వెల్లడించడమే నానీల ప్రధాన ప్రయోజనం. ఇవి ఒక రకంగా చెప్పాలంటే వెనుకటి వేమన ఆటవెలది పద్యాల వలె  ఔషధ గుళికలు గానూ , రసగుళికలు గానూ సాహిత్య సమాజానికి ఉపయోగపడుతున్నాయి . ఇందులో చెప్పబడిన దానికంటే ఊహించవలసింది ఎక్కువ. ఇది ఒక చైతన్యవంతమైన ప్రక్రియగా భావించవచ్చు.  ఏ క్షణాన  ఆచార్య గోపి గారు నానీలకు శ్రీకారం చుట్టాడో అప్పటినుండి  నేటి వరకు ఎంతోమంది  నానీల ప్రక్రియను ఎంచుకొని సమాజాన్ని నిత్య చైతన్యంగావించే విధంగా నిరంతర కృషి  చేస్తున్నారు. అట్లా చేస్తున్న వారిలో  రఘువీర్ ప్రతాప్ అతి ముఖ్య మైన వ్యక్తి.

     రఘువీర్ ప్రతాప్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ కు చెందిన వ్యక్తి. ఆయన వృత్తి రీత్యా  నల్లగొండ జిల్లాలో  అటవీ శాఖలో   ఉద్యోగం చేస్తూ ప్రవృత్తి పరంగా  అక్షర వ్యాసాంగం కొనసాగిస్తున్నాడు. వర్తమాన సాహిత్యంలోని  ఎత్తుగడలను గమనిస్తూ  నానీల పరంపరను వెలువరిస్తున్నాడు. అందులో భాగంగానే 2011లోనే మొట్టమొదటిసారిగా ' అంతర్వాహిని ' అనే మొదటి  నానీల సంపుటిని తీసుకువచ్చారు. ఆరేళ్ల తర్వాత   రెండో నానీల సంపుటిగా  ఎన్వి.రఘువీర్  ప్రతాప్  కలం నుండి జాలువారిందే   ఈ  "నానీ ముత్యాలు ".  ఈ కవి హృదయంలో  చక్కని కవిత్వ చెలిమి అంతర్వహినిగా ప్రవహిస్తున్నారడానికి నిదర్శనమే ఈ పుస్తకం అని చెప్పవచ్చు. 83 పేజీలలో  250 అంశాలతో చక్కని ఆణిముత్యాల రూపంలో మనకు అందించడం జరిగింది. ఈ పుస్తక ముఖచిత్రమే బహు ఆకర్షణీయంగా ఉంది.  దీన్ని చూస్తే కవి యొక్క అంతరంగం ఇట్లే తెలుస్తది. ఇందులోని ప్రతి నానీలో ఏదో ఒక సామాజిక అంశాన్ని స్పృశించాడు. ప్రతి నానిలో చరువు (పంచ్) కుదిరింది.  ముఖ్యంగా ధారాళమైన  నడక సాగింది . ప్రతీది  నాణ్యతతో కూడి పరిణతవైపు కొనసాగాయి ఈ నానీ ముత్యాలు . నిజానికి మంచి నానీలు రాయడం అంత సులభమేమి  కాదు. ఎద లోపల ఎంతో తండ్లాట ఉంటే తప్ప సాంద్రమైన నానీ రాదు. చక్కని భావమే కాక కవితాత్మక వ్యక్తిగా నున్నప్పుడే  నానీలు పుట్టుకొస్తాయి. రాస్తునంతసేపు కవిని , రాసినంక పాఠకున్ని నిద్రపోకుండా చేయడమే  మంచి పుస్తకం లక్ష్యం అన్నట్లు  ఒక నానీ చదివి ముగించగానే ఇంకా ఇంకా చదవాలనే  జిజ్ఞాస  ఇందులోని  నానీలు చదువుతుంటే పాఠకునికి కలుగుతది. మిత్రుడు రఘువీర్ ప్రతాప్ గారి కలానికున్న బలమేమిటో  కానీ,  చదవగానే సులుభరీతిలో అర్థమవుతుంది. ప్రతి నానీలో గాఢత కల్పించడానికి  ప్రతాప్ ప్రయత్నం చేశాడు. సాంద్రత, శైలి,శిల్పం వంటి అంశాలు ఉండే విధంగా కడుజాగ్రత్త వహించాడు. ఇందులో బోలెడు చమక్కులు, పంచులు కనిపిస్తాయి . ఇవన్నీ ఎడతెరిపి లేకుండా  కవితా ధార కురిపిస్తాయి . మచ్చుకు కొన్నిటిని పరిశీలిద్దాం.
 "చీకటి కుచ్చిళ్లను/
కాళ్ళదాకా కప్పుకుంది /
చిలిపి /

చంద్రుడొస్తాడని” …. ఈ నానీని చూడండి. ఇదో కవిత్వం ముద్ద. చదివితే మనషులో కరిగిపోయే వెన్నపూస. పై నానీలో కప్పుకున్నది రాత్రి. ఉత్తమైన రాత్రులు వర్ణించిన తీరు. రాత్రికి చంద్రుడే ప్రియుడు. చంద్రుడు రాక మునుపు అంతా చీకటి. అతడొస్తే కాళ్ళే కాదు కళ్ళూ కనబడతాయి. వ్యాఖ్యా సాపేక్షకతమైన నానీ ఇది.

- Advertisement -
   "శిల శిల్పమైంది/
   ఉలి దెబ్బలతో /
  మరి సుత్తి దెబ్బలు తిన్న/
  ఉలితలో! "  అనే మరో నానీలో....

ఇంతవరకు ఇటువంటిది ఎవరికీ తోచలేదు. శిలకు దెబ్బలు తగిలాయన్నారే కానీ ఉలిని అందరూ మర్చిపోయారు. శిల గాయపడ్డది నిజమే మరి ఉలి సంగతి ఏమిటి? అని కవి అడుగుతున్నారు. వస్తువును విలక్షణంగా చూడడం అంటే ఇదే.
“పాపం చెర్వు /
బలవంతులకు బందీ/
చేతులు/
కట్టుకు నిల్చుంది ” ఈ నానీ ని చూడండి . నేటి సమాజంలో అనేకమంది భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. పొలాలు, కొండలే కాదు చెరువులు కూడా మాయమవుతున్నాయి. ప్రాణధార అందించే చెరువుల్ని కూడా భూ బకాసురులు వదిలిపెట్టడం లేదు. కేవలం చిన్నచిన్న పాదాలతో కొండను అద్దంలో చూపినట్లుగా పెద్ద సమస్యను చూపించాడు.

అలాగే…. “మాట విసిరితే/ గుండె గాయం/ మనసు మురిసితే / ప్రేమ ఖాయం ” నానీలో మాటకున్న విలువ తెలుస్తది. మాటే మంత్రమన్నారు. మంచి మాటలతో మనుషులనే కాదు లోకాన్నే జయించవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అందుకే మాట్లాడటం ఒక కళ. మంచిగా మాట్లాడడం చేతకాకపోతే మౌనం మరింత ఉత్తమం. అది మనసును ఆకట్టుకుంటే ప్రేమ పెరుగుతుందని కవి భావన. రఘువీర్ ప్రతాప్ గారి నానీలలో ప్రాపంచిక,తాత్విక జీవన సత్యాలు చాలా కనిపిస్తాయి.

  " మొబైల్ మాయలాడి/
   వచ్చింది/
   లేఖల తల్లికి/
  నూకలు చెల్లాయి " ఈ నానీలో మొబైల్ ఫోన్ ను ప్రియురాలుతో పోల్చడం జరిగింది. అలాగే లేఖను తల్లితో పోలుస్తూ తల్లి లాంటి ఉత్తరమే ప్రేమను, మమకారాన్ని అందిస్తుందని తెలపడం సరదా ఆలోచన కలిగిస్తది. మళ్లీ ఉత్తరాల కాలం చూడాలనిపిస్తది.

  " చెట్టుకొమ్మలు/ చేతులూపుతున్నాయి / వద్దొద్దు మమ్ము / నర కొద్దంటూ " అనే ఇంకొక  నాని లో గాలికి సహజంగా కదిలే చెట్టు కొమ్మలు చెట్ల వేదనను కవి సున్నిత స్పందనను  కట్టిపడేస్తాయి.  రోజురోజుకీ దెబ్బతింటున్న పర్యావరణము దెబ్బ తినకుండా ఉండేందుకు చెట్ల కొమ్ములు తమను నరకొద్దంటూ సమాజాన్ని హెచ్చరించినట్లుగా తెలుపుతున్నది. ఇట్లా అనేక నానీలలో తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడమే  కాకుండా, తాను పనిచేసే చోట జరుగుతున్న అవినీతిని కూడా ప్రశ్నించ గల ధైర్యవంతుడు రఘువీర్ ప్రతాప్.

“సినారే పాటంటే / శిలయై పోతాను/ శ్రీ శ్రీ కవితంటే/ ఉలినై లేస్తాను ” అనే ఈ నాని లో కవి అంతరంగం బయటపడుతుంది. ఆయన చైతన్యం విషదమవుతుంది. కవి ఎవరి పక్షమో ద్యోతకమవుతుంది. పాలకవర్గ ప్రజా వ్యతిరేక విధానాలపై కవి సిగమూగుతాడు.

  రఘువీర్ ప్రతాప్ ది మాతృ హృదయం.  తల్లి వలె చాలా సున్నితంగా కఠిన భావాలను సుతిమెత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆయనలో ఉత్తమ భావకులు ఉన్నారు. తన నానీలలో చైతన్యం తొణికిసలాడుతుంది. ఏ పాదాన్ని ముట్టుకున్న  కవిత్వం తెరిపి లేని  ధారగా కురుస్తుంది. సామాజిక పరిణామాలను కవితాత్మకంగా వ్యక్తీకరించ గలిగే నైపుణ్యం రఘువీర్ ప్రతాప్        నానీలలో కనిపిస్తుంది. ఈ కవి కలం మునుముందు మరింత సాంద్రతను   సంతరించుకోవాలని  ఆశిస్తూ అభినందిస్తూ ఈ నానీ ముత్యాలను ప్రతి పాఠకుడు ఆదరించాలని కోరుకుంటున్నాను.

   --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
    సెల్ : 94415 61655
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News