Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Cancer-tobacco: చాప కింద నీరులా విస్తరిస్తున్న కేన్సర్‌

Cancer-tobacco: చాప కింద నీరులా విస్తరిస్తున్న కేన్సర్‌

గొంతు కేన్సర్‌, మెడ కేన్సర్‌ ..

దేశంలో కేన్సర్‌ మహమ్మారి దారుణంగా పెరిగిపోతోందంటూ ఇటీవల కొన్ని అధ్యయనాల్లో వెల్లడి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఇప్పటికీ అధ్వాన స్థితిలో ఉన్నాయనడానికి, ముఖ్యంగా కేన్సర్‌ నిరోధక వ్యూహాలకు బాగా కొరత ఉందనడానికి ఈ అధ్యయనాలు అద్దం పడుతున్నాయి. ఏమాత్రం లాభాపేక్ష లేకుండా కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా కేన్సర్‌ వ్యాప్తిని అధ్యయనం చేస్తున్న కేన్సర్‌ ముక్త్‌ ఫౌండేషన్‌ (సి.ఎం.ఎఫ్‌) అందజేసిన వివరాల ప్రకారం దేశంలో యువతీ యువకుల్లో కేన్సర్‌ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వారిలో దాదాపు 20 శాతం మంది వరకూ కేన్సర్‌ రోగులు ఉన్నారని అది తెలిపింది. వీరిలో ఎక్కువ మంది సెక్‌ండ ఒపీనియన్‌ కోసం తమను సంప్రదించడం జరుగుతోందని కూడా ఈ ఫౌండేషన్‌ తెలిపింది. అంతేకాక, దేశంలో ప్రతి అయిదు మందిలో ఒకరిలో కేన్సర్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని, 40 ఏళ్ల లోపు వారిపై ఈ సంస్థ అధ్యయనం జరిపినప్పుడు మహిళల కంటే పురుషులే ఎక్కువగా దీని వాత పడుతున్నట్టు వెల్లడైంది. వందమంది కేన్సర్‌ రోగుల్లో అరవై మంది పురుషులు కాగా నలభై మంది మహిళలు ఉంటున్నట్టు కూడా తెలిసింది.
కాగా, ఇందులో ఎక్కువ మందికి గొంతు కేన్సర్‌, మెడ కేన్సర్‌ వస్తోందని, మొత్తం కేన్సర్‌ బాధితుల్లో 27 శాతం వరకూ ఈ రకం కేన్సర్‌ రోగులేఉంటున్నారని ఫౌండేషన్‌ తెలిపింది. ఆ తర్వాత 17 శాతం మందికి ఉదరకోశానికి సంబంధించిన కేన్సర్‌ వస్తుండగా, 16 శాతం మందికి స్థనాల కేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌ వస్తున్నట్టు వెల్లడైంది. కేన్సర్‌ సోకుతున్నవారిలో ఎక్కువ మంది తమను హైదరాబాద్‌ నుంచే సంప్రదిస్తున్నారని, ఆ తర్వాత స్థానంలో మీరట్‌, ముంబై ఉన్నాయని కూడా ఫౌండేషన్‌ కు చెందిన నిపుణులు తెలియజేశారు. ప్రస్తుతం భారతదేశాన్ని ప్రపంచానికి కేన్సర్‌ రాజధానిగా పరిగణించడం జరుగుతోంది. ఎక్కువ మందికి కేన్సర్‌ సోకుతున్నది, కేన్సర్‌ కారణంగా ఎక్కువ మంది మరణిస్తున్నది భారతదేశంలోనే. ఏటా పది లక్షల మందికి పైగా కేన్సర్‌ బారినపడుతున్నట్టు ఈ ఫౌండేషన్‌ తెలియజేసింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు అధ్వా నంగా ఉన్నందువల్ల ఈ కేన్సర్‌ గురించి అవగాహన లేనివారు, కేన్సర్‌ ఉన్నదని తెలిసినా బయటకు చెప్పని వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది.
ఇటీవలి వరకు వయసు మీరిన వారికే కేన్సర్‌ రావడం జరిగేది. ఇప్పటికీ వారి సంఖ్య ఎక్కువగానే ఉంది కానీ, వీరి జాబితాలో క్రమంగా యువతీ యువకులు కూడా చేరిపోతుండడం మాత్రం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. సమాజం మీద దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. యువతలో కేన్సర్‌ లక్షణాలు పేట్రేగడానికి ప్రధాన కారణాలు ఊబకాయం, నిశ్చలంగా ఒకే చోట కూర్చుని పనిచేయడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినడం, జీవనశైలి మారిపోవడం అని నిపుణులు చెబుతున్నారు. మద్యపానం, ధూమపానం, పొగాకు సంబంధిత పదార్థాలు తినడం కూడా ఇందుకు ప్రధాన కారణాలనే చెప్పవచ్చు. ఇతర వ్యాధులన్నిటి మాదిరిగానే కేన్సర్‌ కూడా మొదట్లోనే గుర్తించడాన్ని బట్టి దాని చికిత్స ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మూడు వంతుల కేసుల్లో కేన్సర్‌ ను గుర్తించడం జరగడం లేదు. మొదట్లోనే గుర్తించిన కేసులు సుమారు 27 శాతం మాత్రమే కాగా, చివరి దశలో గుర్తించిన కేసులు 63 శాతం వరకూ ఉంటున్నాయి.
కేన్సర్‌ సోకే వయసు క్రమంగా తగ్గుతుండడం దేశ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వ్యక్తిగత, కుటుంబ ఆదాయ వ్యయాలు అతలాకుతలం అయిపోతాయి. సమాజం మీదే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా దీని దుష్ప్రభావం పడుతుంది. నలభయ్యేళ్ల లోపు యువతీ యువకులంటే వారిలో ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉంటుంది. శ్రామిక వర్గంలో అతి ముఖ్యమైన వయసుకు చెందినవారు ఈ విధంగా కేన్సర్‌ బారిన పడడం వల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతుందనడంలో సందేహం లేదు. పైగా ఆ వయసుకు చెందినవారికి కుటుంబాలుంటాయి. పిల్లలుంటారు. చూసుకో వాల్సిన తల్లితండ్రులు కూడా ఉంటారు. దేశ ప్రజారోగ్య విధానాలు వీటిని దృష్టిలో పెట్టుకుని కేన్సర్‌ నిరోధక వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుంది. జీవనశైలిలో మార్పులకు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉంటుంది. కేన్సర్‌ ను ముందుగానే గుర్తించే వ్యవస్థలను సృష్టించాల్సి ఉంటుంది. చికిత్సా పద్ధతులను మెరుగుపరచాల్సి ఉంటుంది. కేన్సర్‌ వ్యాధి మీద వైద్యపరంగానే కాకుండా, వైద్యేతరపరంగా కూడా అధ్యయనాలు, పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. కేన్సర్‌ మీద పోరాడాలన్న పక్షంలో వీటినన్నిటినీ చేయక తప్పదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News