ఆ ముగ్గురు మహిళలదే తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర అంటూ రేవంత్ తన ప్రసంగంలో పేర్కొన్న విషయాలు ఆయన మాటల్లోనే..
ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే అందులో మొట్ట మొదటి త్యాగం.. సాహసం శ్రీమతి సోనియాగాంధీ గారిది. ఆనాడు యూపీఏ చైర్ పర్సన్ గా ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు.
బాబు జగ్జీవన్ రామ్ కూతురు శ్రీమతి మీరా కుమారి గారు. అప్పుడు లోక్ సభ స్పీకర్. ఒక మహిళగా.. కన్న తల్లిగా పిలల్లను కోల్పోతే ఒక ఆవేదన ఎట్లుందో తెలిసిన అమ్మగా.. మీరా కుమారి గారు ఆరోజు సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. తెలంగాణ బిల్లును లోక్ సభలో ఆమోదించడంలో అత్యంత కీలకమైన బాధ్యతను పోషించారు.
ఆ నాడు భారతీయ జనతాపార్టీ నాయకురాలు శ్రీమతి సుష్మాస్వరాజ్ గారు. ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సంపూర్ణ సహకారం అందించారు. తెలంగాణ బిల్లు ఆమోదించటంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తన సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈ ముగ్గురు మహిళా నేతలు చేసిన త్యాగాలు, అందించిన సహకారం తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.
తెలంగాణ నలుమూలల నుండి తరలివచ్చిన వేలాదిమంది అడబిడ్డల సాక్షిగా శ్రీమతి సోనియాగాంధీ గారికి, మీరా కుమారి గారికి, సుష్మాస్వరాజ్ గారికి, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్న. తెలంగాణ చరిత్ర పుటల్లో మీ త్యాగానికి.. మీరు తీసుకున్న గొప్ప నిర్ణయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.