ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి, కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంక్ లను ఆదేశించాలని సిపిఐ రాష్ట సమితి సభ్యుడు మండల వైస్ ఎంపీపీ కట్టే బోయిన శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గార్ల మండల కేంద్రంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎదుట సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. త్వరితగతిన రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు వడ్డీలతో కలిపి రుణభారం పెరిగిందని అన్నారు. బ్యాంకుల్లో కొత్త రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేస్తున్నారని అన్నారు. వడ్డీతో సహా రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకు అధికారులను ఆదేశించాలని కోరారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ కు వినతిపత్రం సమర్పించారు.
కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, రాగం రమేష్, ధారావత్ వీరన్న, గుగులోత్ బీమ్లా, రాగం కృష్ణయ్య, భుక్య నగేష్, ఉపేందర్ రెడ్డి, దార్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.