Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan says he cant do anything: నేను చేయగలిగిందేమీ లేదు: జగన్

Jagan says he cant do anything: నేను చేయగలిగిందేమీ లేదు: జగన్

ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు

ఎన్నికల ఫలితాల అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్‌.జగన్‌.

- Advertisement -

వైయస్‌.జగన్ ఏమన్నారంటే…:

ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కివస్తున్నాయి. జరిగిన పరిస్థితులు చూస్తే ఫలితాలు నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ.. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. వారికి మంచి జరుగుతుందని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మంది చేసాం. వాళ్ల కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్ధం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్ధను సైతం తీసుకొస్తూ… గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తున్న చాలీచాలని పెన్షన్‌ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా అవ్వాతాతల చూపిన ఆప్యాయత ఏమయ్యిందో కూడా తెలియడం లేదు.

దాదాపుగా 1 కోటి 5 లక్షల మంది పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటూ… ఆసరా,చేయూతతో తోడుగా ఉన్నాం. సున్నావడ్డీతో అండగా ఉన్నాం. మరి ఆ కోటి 5 లక్షల మంది అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్కచెల్లెమ్మల ఆప్యాయత ఏమయిందో తెలియదు. పిల్లల చదువులు కోసం ఏ తల్లీ, ఏ తండ్రీ ఇబ్బంది పడకూడదని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులుఇస్తూ అండగా నిల్చి, చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి చేశాం. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమయిందో తెలియదు.

దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం అందించే కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతుభరోసా ఇవ్వడం కానీ… ఎప్పుడూ జరగని విధంగా సమయానికే సీజన్ ముగిసే లోగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్‌, పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ చేశాం. మరి ఆ అరకోటి మంది రైతుల ప్రేమ ఏమయ్యిందో తెలియదు.

మరి ఇన్ని కోట్ల మంది పేదవాళ్లకు తోడుగా ఉంటూ.. ఆటోలు, టాక్సీలు నడుపుకుంటున్నవాళ్లు ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్ననేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకారభరోసా, పుట్ పాత్‌ల మీద చిన్న చిన్న ఇడ్లీ దుకాణాలు, వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్లకు ఒక తోడు, నా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు అండగా ఉంటూ వారికి ఒక చేదోడు ఇన్ని కోట్ల మందికి మంచి జరిగించి.. ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ… ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేసి… అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను అక్కచెల్లెమ్మల ఇళ్లకి తీసుకెళ్లి చూపించి.. మీరే టిక్ పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేశాం.

ఎప్పుడూ జరగని విధంగా పేదరికం పోవాలంటే.. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లతో యుద్ధం సైతం చేసి, పిల్లలకు ఇంగ్లిషు మీడియం తీసుకుని రావడమే కాకుండా, ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రను కూడా మార్చాలని టోఫెల్‌, ఐబీ లాంటి కలలు కూడా కన్నాం.

ఎప్పుడూ చూడని విధంగా గ్రామస్ధాయిలోనే సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చి వివక్ష, కరప్షన్ లేకుండా ప్రతి ఇంటికీ సేవలందించాం. దాదాపుగా రూ.2.70 లక్షల కోట్లు ఇంటి వద్దకే అందించగలిగాం.

ఎప్పుడూ చూడని మార్పులు తీసుకుని రావడమే కాకుండా… ఒక విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని, ఎప్పుడూ ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం.
మహిళా సాధికారత అంటే ఇది అని ప్రపంచానికి సాటి చెప్పగలిగాం. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి చేసిన తర్వాత ఆ అభిమానం ఏమయిందో, ఆ ఆప్యాయత ఏమయిందో తెలియదు.

ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు.

ప్రజలు తీర్పు.. తీసుకుంటాం. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా కచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్‌ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పేదవాడికి అండగా నిలుస్తుంది.

పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీకి, చంద్రబాబుగారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ల గొప్ప విజయానికి అభినందనలు.

ఓడిపోయినా నా ప్రతికష్టంలో కూడా తోడుగా, అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికీ, ప్రతి కార్యకర్తకూ, ప్రతి వాలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్‌గా నాకు తోడుగా నిలబడిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఏం జరిగిందో తెలియదు కానీ.. ఏం చేసినా,ఎంత చేసినా ఇంకా 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. కచ్చితంగా మళ్లీ ఇక్కడ నుంచి లేస్తాం. ఇక్కడ నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్లీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్తకాదు. పోరాటాలు చేయడం అంతకన్నా కొత్తకాదు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప నా రాజకీయజీవితం అంతా ప్రతిపక్షంలోనే గడిపాను. పోరాటాలే చేసాను. రాజకీయ జీవితంలో ఎవ్వడూ చూడని కష్టాలు అనుభవించాను. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదన్నా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఎదుర్కొంటాం.

ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్‌ ది వెరీ బెస్ట్. ధాంక్యూ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News