ఆదోని పీఠంపై బిజెపి జెండా రెపరెపలాడింది. హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడిన వైసిపికి కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థ సారథి కళ్లెం వేశారు. కౌంటింగ్ ఫలితాలు ఉత్కంఠకు తెరతీసాయి. ప్రజలు ఊహించినట్లుగానే ఫలితం బిజెపి పక్షాన నిలిచింది.
ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ మొదలు నుండి బిజెపి ఆధిక్యత సాధిస్తూ వచ్చింది .మొత్తం 256 బూత్ లకు గాను 14 టేబుల్ లలో 19 రౌండ్లు ఏర్పాటు చేసారు. మొత్తం ఓట్లు 263058 ఓట్లకు గాను 174582 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో బిజెపి అభ్యర్థి పార్థ సారథి కి 88943 ఓట్లు,వైసిపి అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి కు 71297 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ కు 7567 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఆసియా భాను ఆమ్లివలెకు 2143 ఓట్లు,జై భీం అభ్యర్థి రంగన్నకు 468 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అయిన వడ్డే ఊరుకుందుకు 139, జయన్నకు 273, దస్తగిరి నాయుడు కు 726, నాగరాజ్ కు 267, యువరాజ్ కు 162 ఓట్లు లభించగా నోటాకు 1597 ఓట్లు పడ్డాయి.
ప్రధానంగా బిజెపి, వైసిపి మధ్యనే పోరు నడవగా ఇతర అభ్యర్థులు డిపాజిట్ గల్లంతు అయ్యారు. బిజెపి అభ్యర్థి డాక్టర్ పార్థ సారథి మొదటి 9రౌండ్లు వరకు 262 తో మెజారిటీ ప్రారంభమై 11888 వరకు స్వస్తమైన మెజారిటీ సాధించారు. 10 వ రౌండ్ లో వైసీపీకి 533 స్వల్ప మెజారిటీ రాగా, 11 వ రౌండ్ లో బిజెపికి 552 మెజారిటీ సాధించి మొత్తంగా 11907 ఆధిక్యత లభించింది. 12 వ రౌండ్ లో వైసిపి కి 1619 మెజారిటీ సాధించి బిజెపి ఆధిక్యాన్ని 10288 కు తగ్గించింది. 13 వ రౌండ్ లో 557 ఆధిక్యత బిజెపి సాధించి తన మెజారిటీని 10845 కు పెంచుకున్నారు. 14,15 రౌండ్ లో కూడా వైసిపి 1411మెజారిటీ సాధించి బిజెపి ఆధిక్యాన్ని 9434 కు తగ్గించారు. చివరి 16 నుండి 19 వరకు బిజెపి అందనంత దూరంలో దూసుకుపోయింది. 16 వ రౌండ్ లో 12622, 17 వ రౌండ్ లో 14602,18 వ రౌండ్ లో 16939,19 వ రౌండ్ లో 17646 మెజారిటీ లభించింది.
దీంతో పోస్టల్ బ్యాలెట్ లభించిన మెజారిటీ 518 తో కలిపి 18164 ఓట్లతో విజయధుందుబి మ్రోగించారు. మొదట గ్రామాల ఓట్లు లెక్కించగా, గ్రామాల్లో కంచుకోటగా ఉన్న వైసిపికి బిజెపి బీటలు వేసి మెజారిటీ సాధించడం విశేషం.