Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Modi 3.0 is not a cake walk: కేంద్రానికి ఇక కత్తి మీద...

Modi 3.0 is not a cake walk: కేంద్రానికి ఇక కత్తి మీద సామే!

లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించినంత వరకూ బీజేపీకి జయంలో అపజయం, ఇండీ కూటమికి అపజయంలో జయం. ఈ పరిస్థితి మరో అయిదేళ్ల పాటు భరించక తప్పదు. ఈ పార్టీ విషయంలో నైనా ఓటర్లకు రెండు లక్షణాలు నచ్చవు. ఒకటి మితి మీరిన ఆత్మవిశ్వాసం. రెండవది అహంకారం. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం విషయంలో అదే జరిగింది. అబ్‌ కీ బార్‌, 400 పార్‌ అనే నినాదం ఆయనలోని మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అనే నినాదం ఆయనలోని అహంకారానికి అద్దం పడుతోంది. భిన్న మతాలు, భిన్న సాంస్కృతిక సమ్మేళనాల భారతదేశంలో కేంద్రంలోని ఏ ప్రభుత్వమైనా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని వర్గాలకూ భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. బుజ్జగింపు ధోరణే పరమావధిగా గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఇతర మతాలను అతిగా చేరదీశాయి. ఫలితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా వెనుకటి ప్రాధాన్యం కోల్పోయాయి. అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఇతర మతాల ప్రయోజనాలను పక్కన పెట్టి హిందువులను ఆకట్టుకోవడానికి కృషి చేసింది. ఫలితంగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మీద మొదటి దెబ్బ పడింది. ఇక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అన్ని వర్గాలనూ కలుపుకుని వెళ్లడం మంచిది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్ర బిందువులు. ఈ 18వ లోక్‌ సభ ఎన్నికలు కూడా అదే విష యాన్ని గుర్తు చేసింది. ఈసారి ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు సంపాదించగలమని ధీమాతో ఉన్న బీజేపీకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యా బలం లభించలేదు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ కూటమికి 290కి పైగా స్థానాలతో మెజారిటీ లభించింది కానీ, 2019 ఎన్నికల్లో సాధించిన 303 స్థానాల కంటే 63 స్థానాలు తగ్గి ఈసారి 240తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీహార్‌ కు చెందిన జనతాదళ్‌ (యు), ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన తెలుగుదేశం పార్టీల మీద ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. ఇందులో జనతాదళ్‌ (యు) కి 12 స్థానాలు లభించగా, తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు లభించాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో పాటు ఈ రెండు పార్టీలకు ఎన్‌.డి.ఎలో ప్రాధాన్యం పెరిగింది. ఎన్‌.డి.ఎలోని మిగిలిన పార్టీలనన్నిటికీ వదిలిపెట్టి బీజేపీకి మాత్రమే సీట్లు తగ్గడాన్ని బట్టి ఓటర్లు బీజేపీకి మాత్రమే హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తోంది. ఎవరితోనూ ఘర్షణ వాతావరణం పెట్టుకోవద్దని, అందరినీ కలుపుకునిపోవాలని ప్రజలు తేల్చి చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. మరింత జవాబుదారీతనంతో, మరింత నిర్మాణాత్మక వైఖరితో వ్యవహరించాలన్న సందేశం కూడా ఇందులో ఇమిడి ఉంది.
వాస్తవానికి కూడా ఇవే హెచ్చరికలు, ఇవే సంకేతాలు కాంగ్రెస్‌ పార్టీకి కూడా వర్తిస్తాయి. 2019 నాటి ఎన్నికల కంటే కాంగ్రెస్‌ బలం ఈసారి రెట్టింపయి 97కు చేరుకుంది. ఓటర్లు ఆ పార్టీని కూడా ఏమంత ఎక్కువగా నమ్మలేదనే విషయం అర్థమవుతూనే ఉంది. ఇండీ కూటమికి 230కి పైగా స్థానాలు లభించినప్పటికీ, ఈ కూటమిలో ఏ పార్టీకీ కాంగ్రెస్‌ తో చేతులు కలపడం ఇష్టం లేదనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికలకు ముందు ఇండీ కూటమి లోని భాగస్వామ్య పార్టీల విషయంలో ఒంటెద్దు పోకడనే అనుసరించింది. భవిష్యత్తులో ఏ పార్టీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండీ కూటమిలో ఉంటుందన్నది ఎవరికీ తెలియని విషయం. ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి కూడా అధికారం అప్పగించే ఉద్దేశంలో లేరు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ కూటమి మెజారిటీ సాధించగలిగింది కానీ, కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్న ఇండీ కూటమికి మెజారిటీ లభించలేదు. ఇండీ కూటమిలో అనేక వైరుధ్యాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో అనేక అంతర్గత కలహాలు, కుమ్ములాటలు యథాతథంగా కొనసాగుతున్నాయి. నిజానికి మొదట్లో ఉన్న ఇండీ కూటమి వేరు. ఇప్పుడున్న కూటమి వేరు. భవిష్యత్తులో ఇందులో మార్పు వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.
ఇప్పటికీ రాహుల్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కంటే నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ పటిష్ఠంగానే ఉందనడంలో సందేహం లేదు. బీజేపీ వ్యూహాల ముందు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు ఏవిధంగానూ ఫలించే అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తన బలాన్ని పెంచుకోగలిగిందంటే అందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు కారణం కాకపోవచ్చు. బీజేపీ పట్ల, అందు లోనూ నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో వ్యక్తమైన కొద్దిపాటి వ్యతిరేకతే ఇందుకు కారణం. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకోవడాన్ని ఎవరూ కాదనలేరు. సిద్ధాంతపరంగా తమకు పూర్తి వ్యతిరేకత ఉన్న కేరళలో సైతం బీజేపీ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం విస్మరించలేనిది. విచిత్రంగా ఒడిశాలోనూ బీజేపీ తన బలాన్ని పెంచుకోవడం గమనించాల్సిన విషయం. ఉత్తర భారతంలో బీజేపీకి ఎదురు దెబ్బలు తగలడాన్ని చూసి సంతోషించనక్కర లేదు. అక్కడి పరిస్థితులను, అక్కడి ఏకీకరణలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అది తాత్కాలికమే కావచ్చు. కాంగ్రెస్‌ పార్టీయే ఇక్కడితో తృప్తిపడక తమ సిద్ధాంతాన్ని, దృక్పథాన్ని మార్చుకోవడం మంచిది. అందుకు ఇదే సమయం. మరో అయిదేళ్లలో కాంగ్రెస్‌ మానసికంగా, శారీరకంగా ఎంతైనా ఎదగవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News