పిల్లలకు నేడు అనేక రకాల కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పంచతంత్ర కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, అక్బర్ బీర్బల్ కథలు, ముల్లా నస్రుద్దీన్ కథలు ముదలగున్నవి. ఈ కథల చివరలో ఒక నీతినో, ఉపదేశమో, చమత్కారమో ఉంటుంది. కానీ వీటన్నిటికంటే భిన్నమైనవి టేతాళ కథలు. ఈ కథలు ఎక్కువగా జానపద కథల ఇతివృత్తం కలిగి ఉండడమే కాకుండా, కథ చివరిలో ‘ లాజిక్ ‘ అయిన ఒక ప్రశ్న సందించ బడుతుంది. ఆ ప్రశ్నను బేతాళుడు విక్రమార్కునికి వేసి, సమాదానం రాబడతాడు. చదువరి కూడా ఆ పశ్నకు తనదైన సమాధానం ఆలోచించుకోవచ్చు. ఈ ప్రశ్న పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది.బేతాళ కథలు రాయాలంటే సాధారణ బాలల కథలు రాయడం కంటే కాస్త ఎక్కువ పట్టుదల కావాలి. ఈ కథలు రాయడంలో చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, వసుంధర, మాచిరాజు కామేశ్వర రావు. బూర్లే నాగేశ్వర రావు, పుప్పాల కృష్ణమూర్తి, ఎన్. శివనాగేశ్వరరావు, జొన్నలగడ్డ మార్కండేయులు మొదలగువారు ప్రసిద్ధులు. వీరందరూ నాటి చందమామలో టేతాళ కథలు ఎక్కువగా రాసినవారే. ఇటీవల అచ్చంగా బేతాళ కదలతోనే ‘ రాజహంస’ అనే కథా సంపుటిని పుప్పాల కృష్ణమూర్తి
విడుదల చేశారు. అసలీ బేతాళ కథలు ఎక్కడివి? ప్రాచుర్యంలోకి ఎలా వచ్చాయి. వాటి గురించి చూద్దాం.
క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన గుణాడ్యుడు వైశాచీ ప్రాకృతంలో రాసిన ‘బృహతీ కథ’ లో మొదటి సారిగా బేతాళ కథలను చెప్పాడు. ఇది ఆ తర్వాతి కాలంలో పంచవింశతి కథలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ తరువాత 11వ శతాబ్దికి చెందిన సోమదేవసూరి తన ‘కథా సరిత్సాగరం’ లో ఈ కథలకు చోటు కల్పించాడు. ఆ తరువాత తెలుగులోనూ, సంస్కృతంలోనూ అనేకమంది వీనిని గద్య కథలుగా రాశారు. ఈ కథలు మొత్తం 24, విక్రమార్కుడు సమాధానం చెప్పని చివరి కథతో కలుపుకొని 25. ఈ కథలను త్రివిక్రమ సేనుడనే రాజుకు, శివ రూపంలో ఉన్న టేతాళుడు చెప్పినట్లుగా రాయబడింది. 2500సం.ల క్రితం సోమ దేవి భట్ట సంస్కృతంలో రాసిన విక్రమ్ బేతాల్ కథల్లో ఉజ్జయిని రాజయిన విక్రమార్కునికి బేతాళుడు ఈ కథలను చెప్పబడినట్లుగా రాయబడింది. ఒక యాచక సన్యాసి శుద్ర శక్తులకు అధిపతి అయిన బేతాళుడిని వశం చేసుకోవడానికి పథకం వేసుకొని, శ్మశానంలో చెట్టుకు వేలాడే దయ్యాల అధిపతిని తీసుకొని రావలసినదిగా విక్రమార్కుడిని కోరతాడు. రాజు చెట్టుమీది శవాన్ని భుజం మీద వేసుకొని మౌనంగా సన్యాసి వద్దకు వెళుతుండగా, శవం లోని బేతాళుడు రాజు మౌనాన్ని భంగ పరచడానికి ఒక కథ చెప్పి, కొన్ని ప్రశ్నలు వేస్తాడు. వాటికి సమాధానం తెలిసీ చెప్పక పోతే తల పగిలి చస్తావంటాడు. విక్రమార్కుడు 24 కథల్లోని ప్రశ్నలకు సరైన సమాధానం చెబుతాడు. కానీ, 25వ కథకు సమాధానం చెప్పలేడు. బేతాళుడు మెచ్చుకొని, సన్యాసిని చంపి తనను వశం చేసుకొమ్మని చెబుతాడు. సరే.. అదంతా వేరే కద.
1947 లో నాగిరెడ్డి, చక్రపాణిల అధ్వర్యంలో వెలువడిన ‘ చందమామ’ పిల్లలని, పెద్దలని ఎంతగా ఆకట్టుకున్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పత్రిక కోసం బుక్ స్టాల్స్, పాన్ డబ్బాల వద్ద చదువరులు రోజుల కొద్దీ నిరీక్షించే వారు. 1952 లో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టిన కొడవటిగంటి కుటుంబ రావు “మహా మంత్రి మనోవ్యాధి” కథతో – 1955 సెప్టెంబర్ సంచిక నుండి బేతాళ కథలు చందమామలో వేయడం ప్రారంభించారు. ప్రతి మాసం చందమామలో ఒక బేతాళ కథ తప్పక ఉండేది. దానిని పైన చూపిన రచయితలతో పాటు అనేకమంది
రచయితలు రాసే వారు. రచయిత రాసిన కథను సంపాదక వర్గం తిరగ రాసి ముద్రించే వారు. ఈ కథలు పత్రిక మూతబడిన జులై 2013 వరకూ సుమారు 600 పై చిలుకు ముద్రింప బడ్డాయి. ఈ కథల్లోని టెంపో, తార్కికత, ఆశ్చర్య పంచ సన్నివేశాలు, రాజులు, రాణులు, మంత్రి పరివారం, మాంత్రికులు, సైనికులు, రైతులు, సామాన్యులు ఇలా విభిన్నమైన పాత్రలతో ఎంతగానో పాఠకులను అలరించి, ఆకట్టుకొని, ఆనంద డోలికల్లో ఓలలాడించేవి. అందువల్లనే చందమామలోని మిగతా కథల కంటె, భిన్నమైన ప్రత్యేకతను ఈ కదలు సంతరించుకున్నాయి. చదివేప్పుడు బేతాళుడు వేసిన ప్రశ్నలకు విక్రమార్కుడు ఏమి సమాధానం చెబుతాడో, అట్టి సమాధానం పాఠకుడు కూడా ఊహించుకొని, తాను అనుకున్న సమాధానం, రచయిత రాసిన జవాబుతో పోల్చుకునేవాడు. ఇరువువిరిది ఒకే ఆలోచన అయినప్పుడు చదువరి ఎంతో సంతోష పడేవాడు. సరిపోలకుంటి, రచయిత ఇచ్చిన జవాబు గురించి ఆలోచించేవాడు. ఈ విధంగా టేతాళ కథలన్నీ చదివి, వెంటనే పక్కకు పడేయకుండా, ఆ కథ గురించి, ముగింపు గురించి ఎక్కువ సేపు ఆలోచించేలా మెదడుకు పదును పెట్టేవి. పండిత, సామరుల తేడా లేకుండా చదివిన పాఠ కులందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. కనుకనే నాటి తరానికే కాదు నేటి తరానికి, రాబోయే తరాల పాఠకుల మెదడుకు మేతపెట్టి, నూతన ఆలోచనలను రేకెత్తించగల గొప్ప కథలు ఈ బేతాళ కథలు.
రాజహంస (బేతాళ కథల సంకలనం)
బేతాళ కథల్ని, అనేక మంది రచయితలు రాసినా, పుప్పాల కృష్ణమూర్తి మాత్రం తాను రాసిన బేతాళ కథల్ని గుడిగుచ్చి, ‘రాజ హంస’ పేరుతో కథా సంకలనం తీసుక వచ్చారు. ఈ కథలు పిల్లలకే కాకుండా , పెద్దలకూ చక్కటి ఆలోచనా పద్దతిని, తార్కిక జ్ఞానాన్ని ఇస్తాయి. కథ చివరిలో సందేహాలను బేతాళుడు ప్రశ్నల రూపంలో వ్యక్త పరచడం, వాటికి తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు విక్రమార్కుడు చెప్పడం – కథలు పాఠ కులని మంత్ర ముగ్ధులను చేసి, ఏకబిగిన చదివించడం అనే గొప్ప టెక్నిక్ వీటిల్లో ఉంటుంది. ఈ పుస్తకంలోని కథలో, రాజులు, రాణులు, సైన్యాధిపతులు, నర్తకీ మణులు, గూఢా చారులు, కళాకారులు, వర్తకులు, దొంగలు, వేటగాళ్ళు, రైతులు, వైధ్యులు, గాయకులు, పూజారులు మొదలైన సమాజంలో కనిపించే పాత్రలే కథల నిండా ఉంటాయి.
పూర్వం తాను దొంగ కాకున్నా, వట్టి పుణ్యానికి అనుమానించ బడిన వేటగాడు , నిజం నిరూపించడంతో రాజు వాస్తవం తెలుసుకొని నేరస్తుని శిక్షించడం నిజమైన వేటగాడు కథ ద్వారా రచయిత చెప్పాడు. కథ చివరిలో బేతాలుని ప్రశ్నలు, విక్రమార్కుని సమాధానాలు చాలా ఆసక్తిగా ఉంటాయి.
కొంత మంది వ్యక్తులు తమ స్వంత సుఖం వదులుకొని, పదిమంది కోసం పాటుపడటం ‘రంగస్థలము’ అనే కథ ద్వారా రచయిత తెలుపుతాడు. ఇలాంటి త్యాగ మూర్తుల వల్లనే సంస్థలు మనుగడ సాగిస్తాయనే సందేశాన్ని వినిపిస్తాడు . బేతాలుని ప్రశ్నలు, విక్రమార్కుని సమాధానాలు నేటి సమాజ వాస్తవికతకు దర్పణం పడతాయి.
మరో కథ ‘జీవ వైధ్యుడు’. రాజులైనవారు వైధ్యులను, కళాకారులను ఆదరంతో చూడాలే కానీ , వారిని నొప్పించ కూడదు అనే సందేశంతో రాసిన మంచి కథ. ‘ వైధ్యుడి పట్ల నిర్లక్షం చూపించిన రాజు, చివరకు తన రాజ్యాన్నే కోల్పోతాడు’ కథలో . ఈ కథ ద్వారా రచయిత , రాజ్యంలోని విశిష్ట వ్యక్తుల పట్ల అనుసరించవలసిన వైఖరిని తెలుపుతూ, పాలకులకు హెచ్చరిక చేస్తాడు. వైధ్యం గురించిన బేతాలుని ప్రశ్నలు, విక్రమార్కుని సమాధానాలు ఎంతో తర్కంతో, విజ్ఞాన దాయకంగా ఉంటాయి. అందువల్లనే గుణాడ్యూడి కాలం నుండి నేటివరకూ, ఈ కథలు పాఠకులను అలరిస్తూనే ఉన్నాయి.
-పైడిమర్రి రామకృష్ణ
కోశాధికారి – బాలసాహిత్య పరిషత్
92475 64699.