లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 240 స్థానాలు సంపాదించిన ఇండీ కూటమి ఒక మంచి పని చేసి నట్టు కనిపిస్తోంది. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తమకే అందుకు అవసరమైన బలం ఉందని ప్రకటించక పోవడం ఒక విధంగా ఆ కూటమికి అదృష్టమేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, ఆ తర్వాత అందుకు అవసరమైన సంఖ్యాబలం కోసం అన్వేషించడం సరైన వ్యవహారం కాదని ఆ కూటమికి తోచడం ఏ విధంగా చూసినా హర్షణీయమైన విషయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కాదని, తాము రంగంలోకి దిగాలని కొందరు ప్రతిపక్ష నాయకులు ఆలోచిస్తున్నట్టు మొదట్లో వార్తలు వెలువడ్డాయి. ఇది తమ సంఖ్యాబలాన్ని సరిగ్గా బేరీజు వేసుకోకపోవడమే అవుతుంది. పైగా ప్రజల తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినట్టవుతుంది. ప్రజలు ఇండీ కూటమిని బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించమని కోరా రు తప్ప ప్రభుత్వ బాధ్యతలను దానికి అప్పగించలేదు.
రాష్ట్రపతి ఆహ్వానించినప్పటికీ బీజేపీ దాన్ని నిరాకరించినప్పుడు లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దానికి సంఖ్యాబలం లేనప్పుడు, మిత్రపక్షాలు మద్దతునివ్వనందువల్ల ఆ ప్రభుత్వం కుప్పకూలినప్పుడు, రాష్ట్రపతి ఆహ్వానించినప్పుడు మాత్రమే ఇండీ కూటమి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలే తప్ప, దీని కోసం త్వరపడి ఉపయోగం ఉండదు. పైగా అభాసుపాలవుతుంది.
ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించినందువల్ల, ఏ విధంగా చూసినా ప్రతిపక్ష ఇండీ కూటమికి తమ కంటే తక్కువ స్థానాలు లభించినందువల్ల బీజేపీ మాత్రమే ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హురాలనడంలో సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇండీ కూటమి సాహసించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఇండీ కూటమి తన పరిమితుల్ని అర్థం చేసుకుని వ్యవహరించడం మంచిది.
పెరిగిన బాధ్యతలు
పార్లమెంట్ లోపలా, బయటా ఒక బాధ్యతాయుతమైన, విశ్వసనీయమైన, పటిష్ఠమైన ప్రతిపక్షంగా వ్యవహ రించాల్సిన బాధ్యత ఇండీ కూటమి మీద ఉంది. కొత్త ప్రభుత్వం తమ విధానాలకు, నిర్ణయాలకు, చర్యలకు పూర్తి బాధ్యత వహించేలా ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంటుంది. లోక్ సభలో ప్రస్తుతం ఇండీ కూటమికి బాగానే బలం ఉన్నందువల్ల పాలక పక్షం దాన్ని నిర్లక్ష్యం చేయడానికి, ఖాతరు చేయకపోవడానికి అవకాశం లేదు. లోక్ సభ, రాజ్యసభల్లో ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన చర్చలు జరగడానికి ఇండీ కూటమి కూడా వీలైనంత సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదివరకటి లోక్ సభలో మాదిరిగా అది వ్యవహరించడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రతిపక్షాలు తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పాలక పక్షాన్ని కూడా బాధ్యతగా వ్యవహరించేలా చేయాల్సి ఉంటుంది. విధానాలు, చట్టాలు, నిర్ణయాలు వగైరాల మీద ప్రతిపక్ష ఇండీ కూటమి అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. గత లోక్ సభకు, ప్రస్తుత లోక్ సభకు మధ్య తేడా ఉండేటట్టు ఇండీ కూటమి ఆదర్శవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
పాలక, ప్రతిపక్షాలు గత పదేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రహసనంగా మార్చడం కూడా జరిగింది. ప్రజా స్వామ్యానికి మూల స్తంభంగా ఉన్న పార్లమెంటును అన్ని విధాలుగానూ బలహీనపరచి, క్షీణింపజేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంటుకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చే బాధ్యత ఇండీ కూటమి మీద కూడా ఉంది. తాము పార్లమెంటుకు అతీతులమని భావించిన నాయకులను తిరిగి పార్లమెంటుకు బాధ్యులుగా చేయడం అవసరం. ఇండీ కూటమిలోని పార్టీలే పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు సృష్టించడం, చర్చలను ముందుకు సాగనివ్వకపోవడం, పార్ల మెంటరీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పాలక ఎన్.డి.ఏ కూటమి కూడా వ్యవహరించింది. పాలక పక్షంతో సమానంగా ప్రతిపక్షాలకు కూడా బాధ్యత ఉంటుందనే విషయం విస్మ రించలేనిది.
పూర్వ వైభవం వస్తుందా?
లోక్ సభ ఎన్నికలకు ముందే ఇండీ కూటమి బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఏకాభిప్రాయానికి వచ్చి, సీట్ల పంపకంలోనూ, మేనిఫెస్టో తయారీలోనూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరించి ఉంటే, ఇండీ కూటమికి విజయా వకాశాలు ఎక్కువగా ఉండేవి. పరస్పర కలహాలు, విభేదాలతో దాదాపు కకావికలైపోయిన ఇండీ కూటమి పార్లమెంటులోనూ, బయటా బాధ్యతగా వ్యవహరించ గలదన్న నమ్మకం లేనందువల్లే ప్రజలు ఈ కూటమికి అధికారం కట్టబెట్ట లేదన్న సంగతిని మరచిపోకూడదు. భవిష్యత్తులో ఈ ఇండీ కూటమి వ్యవహరించబోయే తీరు మీదే దీని భవి ష్యత్తు ఆధారపడి ఉంది. ఇండీ కూటమి ఇప్పటికీ కలహాల కాపురంగానే కొనసాగుతున్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఎన్.డి.ఎ కూటమి మాదిరిగా ఒకే తాటి మీద నడవడం అన్నది ఇండీ కూటమి విషయంలో ఎండమావిగానే కనిపిస్తోంది.
నిజానికి ఇండీ కూటమి మీద ప్రస్తుతం బృహత్తర బాధ్యత ఉంది. అది అన్ని పార్టీల నాయకులను, కార్య కర్తలను కలుపుకునిపోతే తప్ప పాలక పక్షాన్ని ఏ విషయం లోనైనా నిలదీసే అవకాశం ఉండదు. పార్లమెంటు లోపల కన్నా బయటే దీని బాధ్యత మరింత ఎక్కువగా ప్రదర్శితం కావాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఇండీ కూటమి స్పష్టమైన విధానాలు, కార్యాచరణతో ఒక సమగ్రమైన, పటిష్టమైన కూటమిగా అవతరించాల్సిన అవసరం ఉంది. ఇండీ కూట మిలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో గత ఎన్నికల్లో గట్టి కృషి చేశాయి. వాటి మీద అవన్నీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి మరింతగా కృషి చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందే తప్ప, ఇండీ కూటమి పట్ల అనుకూలత ఏమీ కనిపించలేదు. వీటి మధ్య ఐక్యత అసాధ్యమనే భావనే ఎక్కువగా కనిపించింది. ఇప్పటికీ బీజేపీ విధానాల పట్ల ప్రజల్లో ఎంతో కొంత విశ్వసనీయత, ఆదరణ, అభిమానమే కనిపిస్తున్నాయి. ఇండీ కూటమికి మోదీ ప్రభుత్వాన్ని దించేయడం తప్ప మరో లక్ష్యం లేదనే భావన ప్రజల్లో ఏర్పడడం వల్లే ఇండీ కూటమికి అధికారం దక్కలేదన్న విషయాన్ని గ్రహించాలి.
కక్షలు, కార్పణ్యాలు
ఇండీ కూటమి తన దృక్పథాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. బుజ్జగింపు ధోరణులు, బూటకపు లౌకికవాదం, అత్యధిక సంఖ్యాక వర్గం పట్ల ద్వేషభావం వంటివి ఇండీ కూటమికి ఏ విధంగానూ మేలు చేయవని, ఆ లక్షణాలు, అటువంటి సిద్ధాంతాలు కలిగిన పార్టీలను దూరంగానే ఉంచుతారన్న నగ్న సత్యాన్ని గ్రహించడం మంచిది. అత్యధిక సంఖ్యాక వర్గ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇతర అల్ప సంఖ్యాక వర్గాలను చేరదీయడమన్నది లౌకికవాదం కాదని భావిస్తున్నప్పుడు ఇండీ కూటమి నాయకులు ఇటువంటి మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఇండీ కూటమి ఇటువంటి సంకుచిత భావాలు, సిద్ధాంతాల నుంచి బయటపడి ఒక విజన్‌తో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భావి భారత లక్ష్యాలను సాధించడం మీద దృష్టి పెట్టడం మంచిది. ఈ సంకుచిత భావనలు దేశాన్ని ఏ విధంగానూ ముందుకు నడిపించవు. దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఇటువంటి భావనలు, సిద్ధాంతాలు ఏ విధంగానూ సహకరించవు. ఇండీ కూటమి సరికొత్త సిద్ధాంతాలతో, ఆధునిక భావనలు, కార్యక్రమాలతో ముందుకు రావడం మంచిది.
ఇది జరగాలన్న పక్షంలో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో ఒకే తాటి మీద నడవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండీ కూటమిలో కాంగ్రెస్ పార్టీకే సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నందువల్ల కాంగ్రెస్ నాయకత్వాన్నే అంగీకరించడం మంచిది. అయితే, గతంలో ఇండీ కూటమి సమావేశాల్లో సైతం పాల్గొనని అనేక పార్టీలు ఇప్పుడు కూటమికి కలిసి వస్తాయా, కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరిస్తాయా అన్నది ఆలోచించాల్సిన విషయం. అనేక అంశాల మీద తాము మోదీ విధానాల కంటే విభిన్న విధానాలను అనుసరించ గలమనే విషయాన్ని ప్రజల్లోకి ఇది తీసుకు వెళ్లలేకపోతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా మోదీకి మద్దతునిస్తున్న ప్రజలను తమ వైపు తిప్పుకోవడా నికి గట్టి ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
ప్రతిపక్షాలు ఎక్కువగా మోదీ గ్యారంటీలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలను ప్రచారంలోకి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి పక్షాలు తమ అంతఃకలహాల కంటే ప్రజల మనసులను చూరగొనడాన్నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాల కంటే బీజేపీ ఒక అడుగు ముందున్న విషయాన్ని విస్మరించకూడదు. బీజేపీ తాను బలోపేతం అవుతూనే ప్రతిపక్షాలను బలహీన పరచడం జరుగుతోంది. ప్రతిపక్షాల బలహీనతలను సాధ్య మైనంతగా సద్వినియోగం చేసుకుంటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇండీ కూటమి, ఇతర ప్రతిపక్షాలు ఒక వ్యూహం ప్రకారం పని చేయడం మంచిది.
- జి. రాజశుక