Saturday, September 28, 2024
HomeతెలంగాణKarimnagar: పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమా?

Karimnagar: పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమా?

ఆల్ఫోర్స్ కూడా ఇలా చేస్తుందంటే నమ్మలేనివారెందరో!

విద్యార్థులను తీసుకెళ్లాల్సిన అల్ఫోర్స్ పాఠశాల బస్సులో పరిమితికి మించి ఉపాధ్యాయులను తీసుకెళ్తుండడంతో బస్సు గురువారం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం విధితమే… విద్యార్థులను పాఠశాలకు తరలించేందుకు నియమించిన బస్సులో పరిమితికి మించి ప్రయాణిస్తుండడంతో ప్రమాదం చోటు చేసుకున్న విషయాన్ని పలు పత్రికల్లో ప్రచురించినప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం విష్మయాన్ని కలిగిస్తుంది‌.

- Advertisement -

చేతులు దులుపుకున్న ఆర్టీఏ..

ప్రమాదం జరిగిన స్థలానికి తక్షణమే చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవలసిన పోలీస్ శాఖ అధికారులు ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. దీనికి తోడు ఆర్టీఏ అధికారులు సైతం ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేయకుండానే చేతులు దులుపుకోవడం చూస్తుంటే పాఠశాల యాజమాన్యం ఏ మేరకు పలుకుబడిని ఉపయోగిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. త్రుటిలో ప్రమాదం తప్పింది కానీ ప్రమాద తీవ్రత గనుక పెరిగి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని అప్పుడైతే అధికారులు హడావుడి చేసే వారా అంటూ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నవారికి ఒక న్యాయం లేని వారికి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల యాజమాన్య ఒత్తిళ్లకు తలొగ్గి సదరు సంఘటనపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడం ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు.

విషయమే తెలియనట్టు వ్యవహరించటం ఏంటి?

ప్రమాదం జరిగినప్పుడు ఫిర్యాదు చేసేవారు లేకపోతే కనీసం సుమోటో గనైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిన అధికారులు సైతం ఆ విషయంపై ఏమి తెలియనట్టు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పాఠశాల బస్సులను సురక్షితమైన డ్రైవర్లతో పాటు పరిమితికి మించి బస్సులలో ప్రయాణించకుండా ఆర్టిఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆల్ఫోర్స్ అంటేనే ఓ స్పెషల్ అలాంటిది..

ఆల్ఫోర్స్ పాఠశాల అంటే ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ యాజమాన్యం అందుకు విరుద్ధంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడటం చూస్తుంటే వారికి డబ్బు సంపాదన పై ధ్యాసే తప్ప విద్యార్థులు, ఉపాధ్యాయుల సురక్షిత ప్రయాణంపై లేకపోవడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆల్ఫోర్స్ పాఠశాల యాజమాన్యం డబ్బే ధ్యేయంగా కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం ఏ మేరకు దృష్టిసారిస్తుందో అతి త్వరలో వెల్లడికానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News