ఎన్నికల సందర్భంగానూ, ఇతర వ్యవహారాల్లోనూ బీజేపీ వ్యవహరించిన తీరు వల్లే కేంద్ర ప్రభుత్వం భంగపాటుకు గురయిందంటూ గత వారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) సమావేశంలో ఆ సంస్థ అధినాయకుడు మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీగా తీసుకోవాల్సినవి కావు. నిజానికి ఆ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలోని రాజకీయ పార్టీలన్నిటికీ, నాయకులందరికీ వర్తిస్తాయి. కానీ, ఆయన మాత్రం బీజేపీని దృష్టిలో పెట్టుకునే ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమకు, రాజకీయాలకు సంబంధం లేదని, తాము రాజకీయాలకు వీలైనంత దూరంగానే ఉంటున్నామని ఆరెస్సెస్ చెప్పుకుంటున్నప్పటికీ, బీజేపీ ఆ సంస్థకు చెందిన పార్టీయేననడంలో సందేహం లేదు. ఆ పార్టీకి సైద్ధాంతిక పునాదులు కల్పించింది, అనేక విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నది ఆరెస్సెస్నేనని కూడా అందరికీ తెలిసిన విషయమే. భాగవత్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఒక రకంగా బీజేపీ పనితీరు, వ్యవహార శైలికి సంబంధించిన అంతర్గత విశ్లేషణ అని చెప్పవచ్చు. ఆరెస్సెస్ మీద తామిక ఆధారపడడం లేదంటూ బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య తలెత్తిన విభేదాలకు అద్దం పడు తున్నాయి.
అసలు సిసలు ప్రజా సేవకులకు అహంకారం ఉండకూడదని, ఇతరులను బాధపెట్టకుండా తన పని తాను చేసుకుపోవడమే ప్రజా సేవకులైనా, కార్యకర్తలైనా ప్రధాన కర్తవ్యమని ఆయన ఆరెస్సెస్ సమావేశంలో స్పష్టం చేశారు. “సేవకుడనే వాడు హుందాతనంతో వ్యవహరించాలి. హుందాతనంతో వ్యవహరిస్తూనే, తామరాకు మీద నీటి బొట్టులా, వినయ విధేయలతో తన పని తాను చేసుకుపోయేవాడే అసలైన సేవకుడు” అని ఆయన వివరించారు. ఆయన ఈ విషయంలో కొన్ని భగవద్గీత శ్లోకాలను కూడా ఉటంకించారు. నాయకులకు కర్తవ్య నిష్ఠ తప్ప అహంకారం పనికి రాదని ఆయన అన్నారు. కేవలం ప్రధానమంత్రిని కేంద్ర బిందువుగా చేసుకుని ఎన్నికల ప్రచారం జరగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతా తానే అయి ప్రచారం చేయడం పార్టీలో పెరుగుతున్న అహంకారానికి, వ్యక్తి ఆరాధనకు నిదర్శనమని, ఇటువంటి లక్షణాలను కొనసాగనివ్వకపోవడం పార్టీకి శ్రేయస్కరమని ఆయన హెచ్చరించారు.
దేశానికి ప్రధాన సేవకుడినని చెప్పుకునే నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో ప్రధాన ప్రచార సారథిగా వ్యవహరిస్తూ, ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని ఆరెస్సెస్ ఒక అహంకార పూరిత వ్యవహారంగా పరిగణిస్తోంది. అన్ని పార్టీలను, అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకుని, ఏకాభిప్రాయంతో వ్యవహరించాల్సిన వ్యక్తి కాంగ్రెస్ లేని భారతదేశమంటూ నినాదాన్ని చేపట్టడం తీవ్రస్థాయి విమర్శలకు గురైంది. బీజేపీ మొదటి నుంచి ప్రతిపక్షాలతో ఘర్షణ వైఖరినే అవలంబిస్తున్నట్టు కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు బీజేపీ నాయకులు ఇతర వర్గాలకు సంబంధించి విద్వేష పూరిత ప్రసంగాలు, ప్రకటనలు చేయడం కూడా విమర్శలకు గురైంది. ఏడాదయినా మణిపూర్‌లో శాంతి భద్రతలు నెలకొల్పలేకపోవడాన్ని కూడా భాగవత్ తూర్పారబట్టారు.
నిజానికి ఇతర పార్టీలు కూడా ఒకే వ్యక్తి మీద ఆధారపడి ప్రచారం సాగించడం జరిగింది. దాదాపు ప్రతి పార్టీలోనూ ప్రధాన నాయకుడు మాత్రమే పర్యటనలు, ప్రకటనలు చేస్తూ వచ్చారు. ప్రతి పార్టీ నాయకుడూ విద్వేషపూరిత ప్రసంగాలే చేశారు. ఏ పార్టీకీ అందరినీ కలుపుకునిపోవాలన్న దృష్టి లేదు. అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. అందువల్ల భాగ వత్ చేసిన విమర్శలు దాదాపు అన్ని పార్టీలకూ వర్తిస్తాయి. ఆయన ఎక్కడా బీజేపీ పేరును గానీ, మోదీ పేరును గానీ ప్రస్తావించలేదు. అయితే, ఆయన బీజేపీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశా రంటూ పత్రికలన్నిటిలో కథనాలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మితిమీరిన ఆత్మ విశ్వాసంతో వ్యవహరించారనడంలో సందేహం లేదు. పైగా, ఆరెస్సెస్ ను ఎక్కడా ప్రచారానికి ఉపయోగించుకోకపోగా, దాన్ని బాగా దూరం పెట్టడం జరిగింది. గతంలో కూడా బీజేపీ నాయకులు కొందరు ఆరెస్సెస్ పై ఘాటు విమర్శలు చేసిన విషయం పత్రికల్లో వచ్చింది. పార్టీల్లో ఏ నాయకుడు పార్టీ కంటే ఉన్నతంగా భావించడం మంచిది కాదని ఆరెస్సెస్ మూల సిద్దాంతం. బీజేపీ అందుకు తగ్గట్టుగా వ్యవహరించి దశాబ్ద కాలం దాటింది. భాగవత్ మాదిరిగానే మరి కొందరు ప్రముఖులు కూడా ఇటువంటి హితోక్తులు పలికారు కానీ, ఆరెస్సెస్ అధినేతగా భాగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇవి మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Why BJP numbers fall?: అహంభావం వల్లే బీజేపీకి పరాభవం
భాగవత్ వ్యాఖ్యలు అంతర్గత విశ్లేషణ..