ముస్లింల పవిత్ర పండగ రంజాన్ తర్వాత మరో ముఖ్యమైన పండగ బక్రీద్. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. బక్రీద్‌ను ఈద్ ఉల్ జుహా అని కూడా అంటారు. రంజాన్ లాగే ఈ పండుగ రోజున ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అల్లాకు మేకను బలిగా ఇస్తారు. నెమరు వేసే జంతువులను మాత్రమే బలి ఇస్తారు. దీన్ని ఖుర్బానీ అంటారు. అల్లాకు జంతువులను బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు.
ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇబ్రహీం అనే ప్రవక్తకు ఎన్నో ఏళ్ల తర్వాత సంతానం కలుగుతుంది. వాళ్లకు మగబిడ్డ జన్మించగా ఇస్మాయిల్ అనే పేరు పెట్టుకుంటారు. తనకెంతో ఇష్టమైన జీవిని బలి ఇవ్వాలని అల్లా ఓ రోజు ఇబ్రహీం ప్రవక్తను కోరుతారు. దీంతో ఆయన తనవద్ద ఉన్న… గొర్రెల్ని, మేకల్ని బలి ఇస్తారు. దాంతో అల్లా తృప్తి పడకపోవడంతో… తన కొడుకు ఇస్మాయిల్‌ను బలి ఇచ్చేందుకు ఇబ్రహీం ప్రవక్త సిద్ధమవుతారు. కొడుకు మెడ వంచి అతడ్ని బలి ఇచ్చేందుకు ఇబ్రహీం ప్రవక్త ప్రయత్నిస్తారు. ఆ సమయంలో అల్లా వద్దని చెప్పి.. ఇస్మాయిల్‌ను తప్పించి ఆ చోట మేకను పెడతారు. ఈ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లిం సోదరులంతా పండగను జరుపుకుంటారు. అందుకే బక్రీద్‌ను త్యాగానికి ప్రతీకగా చెబుతారు.
రంజాన్ పండగ ముగిసిన 70 రోజుల తర్వాతే… ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన జిల్ హేజ్ 10వ రోజున బక్రీద్ పండగను నిర్వహిస్తారు.. ఇక ఇదే నెలలో ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర చేపడతారు. ఈ పవిత్ర యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్తారు. అక్కడున్న మసీదు అల్ హరామ్ లోని కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కాబా ఉన్న చుట్టూ ప్రదేశంలోనే ఈ మసీదు కూడా ఉంటుంది. ఇలా ఏడు సార్లు మసీదు చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఇలా బక్రీద్ మాసంలోనే… హజ్ యాత్రకు వెళ్లిన వారంతా మక్కా నుంచి మదీనాకు కూడా వెళ్తారు. అల్లాకు అత్యంత ప్రియమైన మహ్మద్ ప్రవక్త నివసించిన స్థలమే మదీనా. అందుకే హజ్ యాత్రకు వెళ్లినవారంతా.. మక్కా సందర్శన అనంతరం మదీనాను కూడా తప్పక వెళ్లి వస్తారు..