Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: బాలసాహిత్య రచన- శైలి, శిల్పం

Telugu Literature: బాలసాహిత్య రచన- శైలి, శిల్పం

మనం గత మూడు నెలలుగా ‘తెలుగు ప్రభ’ వేదికగా బాలల కథలు ఎలా రాయాలో, ప్రముఖ బాలసాహితీవేత్తలు ఎలా రాశారో తెలుసుకున్నాం. కథల్లో ఎన్ని రకాలున్నాయో, ఏవయసు వారికి ఎలాంటి కథ రాయాలో నేర్చుకున్నాం. మొదట్లో వార్తకు, కథకు వ్యత్యాసం ఇంకా శైలి,శిల్పం అనే పదాలు చెప్పుకున్నాం. ఐతే కొత్తగా రాసే వారికి మొదట్లోనే శైలి,శిల్పం అనే పెద్ద విషయాలు చెపితే అర్థం కాకపోగా, కథ రాయాలన్న ఆసక్తిని కూడా కోల్పోతారు. కథలు ఎలా రాయాలో నేర్చుకున్నాం కాబట్టి ఇక కథా రచనలో చివరి అంకంగా కథను అందంగా, ఆసక్తిగా ఎలా రాయాలో శైలి, శిల్పం ద్వారా ఈవారం తెలుసుకుందాం.
ఏ రచనకైనా శైలి, శిల్పం అనేవి రెండు కండ్లు.మనం ఒక సంఘటనను ఉన్నది ఉన్నట్టు రాస్తే అది వార్త అవుతుంది . సమాచారానికి ముందు, వెనకాల జోడించి చెబితే వార్తా కథనం అవుతుంది.
కానీ చాలామంది దీనినినే కథ అనుకుంటారు. అందుకే కథ రాయటం చాలా సులువని చెపుతారు.కొత్తగా నేర్చుకునే బాలలు దీనినే కథ అనుకుంటారు. కానీ అది కథ అనిపించుకోదు. నేడు చాలామంది ఇటువంటివి రాసి కథలనే భ్రమపడి వాటిని కుప్పలు తెప్పలుగా ముద్రించి విడుదల చేయటం విచారకరం. రాయాలంటే మొదలు చదవాలి.టెక్నిక్ నేర్చుకోవాలి.కథకు ఉండాల్సిన లక్షణాలు ఆ సంఘటనకు అపాదించినప్పుడే అది కథ అనిపించుకుంటుంది.కథకు శీర్షిక నుంచి, ఎత్తుగడ, మలుపు, కొసమెరుపు, ముగింపు వంటి లక్షణాలు ఉండాలి.
‘ టెక్నిక్ ‘ అన్న ఆంగ్లపదాన్ని మనం శిల్పం అని చెప్పవచ్చు. కథను నడిపించే తీరు లేదా చెప్పిన విధానాన్ని శిల్పం అంటారు. కథావస్తువు ‘శిల’ అయితే దాన్ని అందంగా మలచడాన్ని (చెక్కడాన్ని) ‘శిల్పం’ అంటారు. ఇక్కడ కథకు శిల్పి రచయితే కదా కథలో జరిగిన సంఘటనలు జరిగిన క్రమం లోనే చెప్పడం లీనియర్ టెక్నిక్. ముందువెనుకలు మార్చి ఫ్లాష్ బాక్స్ ఉపయోగించి ఉత్కంఠని పోషిస్తూ చెప్పడం ఆధునిక పద్ధతి. ఉదాహరణకు బాషా, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సాగరసంగమం వంటి సినిమాల కథలు గమనించవచ్చు.
కథకు ముడిసరుకు వస్తువు

- Advertisement -

మనం దేనిగురించి చెప్పాలనుకుంటున్నామో అది వస్తువు. వస్తువును అందంగా తయారుచేసి పాఠకునికి అందించటానికి సృజనకారుడికి నైపుణ్యం అవసరం.
రచయిత ఎక్కడ, ఎలా ప్రారంభిస్తే బాగుంటుందో నిర్ణయించుకోవాలి. కథకుడికి రాస్తున్న జీవితం సుపరిచితమై ఉండాలి. ఎందుకు రాస్తున్నాడో స్పష్టత ఉండాలి. ముఖ్యంగా ఏ వయసు బాలలకోసం రాస్తున్నారో, ఆకథ ఎవరికి చేరాలో నిర్ణయించుకోవాలి. అందుకు సమకాలీన అంశాల పట్ల శాస్త్రీయ వైఖరి, అవగాహన ఉండాలి. సంఘటనలు అభూత కల్పనలుగా ఉండకూడదు.
రచయిత చెప్పదలచుకొన్న విషయానికి సంబంధించిన సన్నివేశాలను ఎంచుకోవాలి. కథలో వర్ణనలు విషయానికి లోబడి ఉండాలి. కథారంభం ముగింపుల్లో వర్ణనలు ఉపయోగించవచ్చు. వీటితో కథకు బలం చేకూరుతుంది. పాత్రలు, సన్నివేశాల వర్ణన తగినట్లుగా ఉండాలి.
పాఠకుడితో రచయిత చేసే సంభాషణే కథనం. పాత్రల మధ్య సంభాషణలు కథను నడిపిస్తాయి. అనవసర సం భాషణలు కథకు హాని చేస్తాయి. సంభాషణల వల్ల కథకు నాటకీయత చేకూరుతుంది. కథలో సంభాషణలు చిన్నగా శకిమంతంగా ఉండాలి. మాటకు భాష ప్రాణం. భాషను తెలిసి వాడాలి. మాటను ఓ శక్తిగా ప్రయోగించాలి. ముగింపు కథ నుంచి పుట్టుకురావాలి. కృతకంగా ఉండకూడదు. కొన్ని కథలు కొసమెరుపుతో ముగుస్తాయి. మెరుపు కథకు అనుసంధానమై ఉంటేనే కథ రాణిస్తుంది. మంచి ముగింపులు మరొక కథకు ప్రారంభాన్నిస్తాయి.
చెప్పాలనుకున్న విషయాన్ని (వస్తువును) కథగా మలి చే క్రమంలో రచయిత కనబరిచే పనితనమే శిల్పం. పాత్రలకు, సంఘటనలకు, సన్నివేశాలకు క్రమప్రాధాన్యం ఇవ్వడమే శిల్ప రహస్యం. ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు అనే మూడింటిని సమర్థంగా నిర్వహించడం ద్వారా శిల్పం సిద్ధిస్తుంది. విల్లు నుంచి వదిలిన బాణం లక్ష్యాన్ని తాకినట్లు, శిల్పం ద్వారా కథ పాఠకుణ్ణి చేరుతుంది.
జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం, ఇతరుల అనుభవాలు మనల్ని ఆలోచనల్లో పడవేస్తయి.
శైలి అనేది సంతకం లాంటిది.ఎవరి శైలి వారిదే ! ఒకరి సంతకంలా మరొకరు ఎలా చేయలేరో, ఒకరిలా మరొకరు రాయలేరు.ఒక రచయిత శైలి పట్టుకుని ఆ రచయిత పేరు చెప్పవచ్చు.ప్రముఖ బాలసాహితీవేత్త డాక్జర్ దాసరి వెంకటరమణ కథలు జాగ్రత్తగా పరిశీలిస్తే పాత్రలకు, ప్రదేశాలకు నిరంజన వరం, సౌశిల్య దేశం, త్రిథాముడనే యోగి, సాపర్ణుడు అనే పండితుడు, రత్నగిరి అనే రాజ్యం…ఇలా పేర్లు వినూత్నంగా పెట్టడమే కాకుండా అవే పేర్లు చాలా కథల్లో విరివిగా వాడుతుండటం గమనించవచ్చు.అది వీరి శైలి. అలాగే మరో ప్రముఖ బాలసాహితీవేత్త
డాక్టర్ హరికిషన్ కధలు పరిశీలిస్తే మనకు కధలనిండా కర్నూలు సరళమాండలిక సువాసనలు చుట్టుకుంటాయి. మట్టసంగ, పెరికింది, ఎర్రగడ్డ, వాకిలి వంటి పదాలు కథల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ కథలు పరిశీలిస్తే భాష చాలా సరళంగా ఉంటుంది.బుజ్జి బుజ్జి పదాలతో బాలలకు గోరుముద్దలు తినిపించినట్లు ఉంటాయి.కథను ఇరవై వాక్యాలలో చెప్పగలనేర్పు వీరిసొంతం. మొదలు ముగింపు రాసుకుని తర్వాత కథలోని ఎత్తుగను రాసుకుని కొసమెరుపు లివ్వటం రాయొచ్చు అని చెపుతుంటారు. అవేంటో పరిశీలిద్దాం.
రచయిత చెప్పినట్లు రాసే తీరు ఇది –

  1. రాజుకి నోటి దురుసు ఎక్కువ. మనసులో అనుకున్నది ముఖం మీద అనేస్తాడు. దాని వల్ల చాలామందికి శత్రువు అయ్యాడు.
    సంభాషణలతో కథ నడిపించటం మరో పద్ధతి —
  2. “రాజు! నీ నోటి దూల తగ్గించుకో! ఎదుటి వాళ్లని ఎంత మాటంటే అంత అనేస్తావు.” అన్నాడు ఆనంద్.
    ” అవును. దాని వల్ల చాలా సమస్యలు ఎదుర్కున్నాను ఆనంద్” అన్నాడు రాజు.
    “ఎవరి మీద కోపం ఉన్నా అదుపులో పెట్టుౖకోవాలి. నవ్వుతూ మాట్లాడాలి” రాజుకి నచ్చజెప్ప బోయాడు అనంద్.
    కథలోని పాత్రే కథ చెప్పడం మరో పద్ధతి.
  3. “నాకు మనసులోని మాటని దాచుకోవటం చేత కాదు. వెంటనే అనేస్తాను. ఈ బలహీనత వల్ల చాలా కష్టాల పాలు అయ్యాను. ఈ అలవాటు మానుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను”
    మనం తీసుకునే కథా వస్తువును బట్టి దానికి ఏ పద్ధతి అనువుగా ఉంటుందో దానిని అనుసరించాలంటారు చొక్కాపు వెంకటరమణ.
  • పైడిమర్రి రామకృష్ణ
    ( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
    సెల్ : 92475 64699.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News