Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్BSP: కూర్చున్న కొమ్మను నరుక్కున్న బీఎస్పీ

BSP: కూర్చున్న కొమ్మను నరుక్కున్న బీఎస్పీ

భారతదేశ ప్రజాస్వామ్యంలో ఏ పాలక పక్షమైనా ప్రజలకు ఆశయాలకు తగ్గట్టుగా పాలన సాగించని పక్షంలో ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని, తమ శక్తి మేరకు విజయం సాధించే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా సహజమైన విషయం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీలు పొత్తు కుదర్చుకుని చేసింది ఇదే. ఈ రెండు పార్టీలూ కలిసి గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రచారం చేపట్టాయి. రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛలు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని, పాలక బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. బలహీనవర్గాలను, ఓబీసీలను, ముస్లింలను, క్రైస్తవులను బీజేపీకి వ్యతిరేకం చేయడంలో విజయం సాధించాయి. మండల్‌ సంవత్సరాల నాటి కుల సమీకరణాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ రెండు పార్టీలూ కలిపి 43 లోక్‌ సభ స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఓటు వాటాను పెంచుకున్నాయి. దళితులను, మైనారిటీలను ఓటు బ్యాంకులుగా మార్చుకో గలిగాయి.
ఇందుకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బి.ఎస్‌.పి) కేవలం 9.4 శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగింది. 2022 నాటి శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇది నాలుగు శాతం తగ్గినట్టు లెక్క. ఈ పార్టీకి అనేక సంవత్సరాలుగా విధేయులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటున్న జాతవ్‌ కులాల వారు కూడా ఈ సారి బీఎస్పీకి తక్కువగా, కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీలకు ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది. ఈ దళిత వర్గమే కాదు, ఈ పార్టీకి ఎన్నో ఏళ్ల పాటు మద్దతునిచ్చిన ముస్లింలు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలు, ఓబీసీలు గంపగుత్తగా కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీలకే ఓట్లు వేయడం జరిగింది. నిజానికి, ఈ వర్గాలను, ముఖ్యంగా దళితులను తమవైపు తిప్పుకోవడానికి ఎన్నికల సమయంలోనే కాదు, అంతకు ముందు కూడా బీఎస్పీ పెద్దగా చేసిందేమీ లేదు.
సుమారు 2000 సంవత్సరం ప్రాంతంలో కాన్షీరామ్‌ నాయకత్వంలో ఒక ఉద్యమంగా ఆవిర్భవించిన బీఎస్పీ అచిరకాలంలోనే రాష్ట్రంలోని దళితులనే కాక, దేశవ్యాప్తంగా దళిత వర్గాలను, అల్ప సంఖ్యాక వర్గాలను విపరీతంగా ఆకట్టుకుని ఒక సంచలనం సృష్టించింది. ఎన్నికల అనంతర సంకీర్ణ ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచింది. అంతేకాదు, 2007లో తనకు తానుగా ఘన విజయం సాధించి అధికారాన్ని కూడా చేపట్టింది. ఆ తర్వాత ఈ పార్టీ సిద్ధాంతాలు మరింతగా విస్తరించాయి. బహుజన్‌ అనేమాట మారిపోయి సర్వజన్‌ అనే మాట కూడా స్థిరపడింది. మరిన్ని వర్గాలను కూడగట్టుకోవడానికి ఇది తన పునాదులను విస్తరించింది. అయితే, అప్పటి నుంచి పార్టీలో వైరుద్ధ్యాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల స్థాయి, వారి ప్రాధాన్యం బాగా పెరిగింది కానీ, అధికారాలను పంచడం, పాలనా వ్యవహారాల వికేంద్రీకరణ వంటి సామాజిక, ఆర్థిక సంస్కరణల ద్వారా వారి అభ్యున్నతిని సాధించడం మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు.
కాగా, 2012 తర్వాత అధికారం నుంచి వైదొలగడంతో బీఎస్పీ కార్యకలాపాల్లో స్తబ్ధత చోటు చేసుకుంది. ఆందోళనలు, ఉద్యమాలు, ప్రదర్శనలతో రాష్ట్రాన్ని, పాలక పక్షాన్ని హోరెత్తించాల్సిన మాయావతి కేవలం పత్రికా విలేఖరుల సమావేశాలకు, పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడంతో కార్యకర్తల్లో ఉత్తేజం, ఆత్మవిశ్వాసం తగ్గిపోతున్నాయి. బీజేపీకి, కాంగ్రెస్‌-సమాజ్‌ వాదీ పార్టీ పొత్తుకు తామేమీ తీసిపోమని ఎన్నికల సమయంలో పదే పదే చెప్పిన మాయావతి, మరి కొందరు సీనియర్‌ నాయకులు చివరికి ఓట్లను కూడా చీల్చలేకపోయారు. ఎవరికి వారు కలుగుల్లో ఉండిపోయినట్టు కనిపించింది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన మాయావతి ఈవీఎంలను తప్పుబట్టడం ప్రారంభించారు. వాతావరణం అనుకూలంగా లేదని వ్యాఖ్యానించారు. ముస్లింల నుంచి తమకు ఆశించిన మద్దతు లభించలేదని ఆ వర్గాన్ని దుయ్యబట్టారు. తన కారణంగానే పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారవుతున్న విషయాన్ని మాత్రం ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. ఈ పార్టీలో మళ్లీ జవజీవాలు నింపాలన్న పక్షంలో ఆమె ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను నేర్చుకోవాలి. ఈ పార్టీ నుంచి విడిపోయి ఏర్పడిన ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరాం) నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఈ పార్టీ దళితుల కోసం ఇప్పుడు కూడా ఏదో ఒక ఆందోళన నిర్వహిస్తూ బలం పుంజుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News