Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్

Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్

జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజీత్‌ దోవల్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. క్యాబినెట్‌ మంత్రి హోదాతో సమానమైన ఈ పదవిలో ఆయన నియామకాన్ని కేబినెట్‌ నియామకాల కమిటీ ఈ నెల 13వ తేదీన ఆమోదించగా, ఈ నెల 10వ తేదీ నుంచి మొదలుకొని ప్రధాని నరేంద్ర మోడీ పదవీకాలం పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఎన్‌ఎస్‌ఏగా కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మే 30వ తేదీన తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 3 జూన్ 2019న రెండవ సారి నియమితులయ్యారు. విశ్రాంత ఐపిఎస్‌ అధికారి అయిన దోవల్ గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు.

- Advertisement -

హర్షణీయమైన పనితీరు:

అజిత్ దోవల్ జనవరి 20, 1945న ఉత్తరాఖండ్‌లోని ఓ కుగ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి, మేజర్ జిఎన్ దోవల్, భారత సైన్యంలో అధికారి కావడంతో ఆయన రాజస్థాన్‌లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్‌లో విద్యనభ్యసించారు. 1967లో ఆగ్రా యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. 1968లో ఐపిఎస్ అధికారిగా కేరళ కేడర్‌కు నియమితులైన ఆయన ఆ తరువాత 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు. 1989లో ఆయన భారత దేశంలోనే అశోక చక్ర తరువాత రెండవ అత్యున్నత శాంతి కాల శౌర్య పురస్కారమైన “కీర్తి చక్ర” అందుకున్న అత్యంత పిన్న వయస్కుడైన పోలీసు అధికారిగా చరిత్ర సృష్టించారు. వృత్తి నిర్వహణలో భాగంగా ఆయన మిజోరం మరియు పంజాబ్‌ రాష్ట్రాలలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన 1999లో కాందహార్‌లో హైజాక్ కు గురైన ఎయిరిండియా విమానం నుండి ప్రయాణీకులను విడుదల చేయించడానికి ఏర్పాటైన త్రిసభ్య సంధానకర్తల బృందంలో ఒకరిగా కీలక పాత్ర పోషించారు. 1971 మరియు 1999 మధ్యకాలంలో ఆయన కనీసం 15 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాల హైజాకింగ్‌ సంఘటనలను విజయవంతంగా పరిష్కరించారు. 1988లో ఆపరేషన్ బ్లాక్ థండర్ సమయంలో, దోవల్ ఐఎస్ఐ ఏజెంట్‌గా నటించి పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం లోకి ప్రవేశించాడు. ఖలిస్తానీ వేర్పాటువాదుల రహస్య సమాచారాన్ని సేకరించాడు. వారి బృందంలో ఒక ముఖ్యమైన సభ్యుడిగా వ్యవహరిస్తూనే వారి ప్రణాళికలను భంగపరిచేందుకు తప్పుడు సలహాలు ఇచ్చాడు. స్వర్ణ దేవాలయం లోకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రవేశించి విజయవంతంగా అక్కడ దాగి ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులను మట్టుబెట్టి వారి ఆధీనం నుండి మందిరాన్ని తప్పించి సాధారణ పరిస్థితులు కల్పించడంలో ఆయన అందించిన సహాయం అత్యంత కీలకం. సిక్కిం భారత్‌లో విలీనం కావడానికి అవసరమైన నిఘా సమాచారం సేకరించడంలో ఆయన పాత్ర శ్లాఘనీయమైనది. దోవల్ భారతదేశం యొక్క మూడవ జాతీయ భద్రతా సలహాదారు ఎం కె నారాయణన్ వద్ద ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో శిక్షణ పొందారు. 2004లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయనను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా నియమించగా 2005లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించి ఆయన పదవీ విరమణ పొందారు. అంతకు పూర్వం పదేళ్ళు ఆ సంస్థ ఆపరేషన్ విభాగం అధిపతిగా కొనసాగిన ఆయన ఐబి మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా అద్వితీయ ప్రతిభ కనబరిచారు. జూన్ 2014లో ఇరాక్‌, తిక్రిత్ లోని ఆసుపత్రిలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో దోవల్ కృషి సఫలమయ్యింది. 18 సెప్టెంబర్ 2016న జమ్మూ కాశ్మీర్ లోని యూరి లోని సైనిక ప్రధాన కార్యాలంపై జైష్ ఏ మొహమ్మద్ తీవ్రవాదుల దాడిలో 19 మంది భారత సైనికుల దుర్మరణానికి ప్రతీకారంగా 29 సెప్టెంబర్ 2016న జరిపిన సర్జికల్ స్ట్రైక్ మరియు 14 ఫిబ్రవరి 2019న పుల్వామాలో మానవబాంబు దాడి ద్వారా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఘటనకు ప్రతిచర్యగా పాకిస్థాన్ సరిహద్దులోని బాలాకోట్ లో యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా జరిపిన వైమానిక దాడులు దోవల్ పర్యవేక్షణలో జరిగాయి. ఈ దాడుల వ్యూహకర్తలలోని ఏడుగురు సభ్యుల బృందంలో ఒకరైన దోవల్ ఆ రోజు వార్ రూంలో నిద్రలేని రాత్రి గడిపారు. ఈ నేపథ్యంలో జరిగిన దాడుల సందర్భంగా పాక్ భూభాగంలో బందీగా చిక్కిన భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ ను విజయవంతంగా విడుదల చేయించడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి మరియు జాతీయ భద్రతా సలహాదారుతో ఆయన చర్చలు జరిపారు. దౌత్య మార్గాలు మరియు చర్చల ద్వారా డోక్లామ్ ప్రతిష్టంభనను తొలగించడంలో ఆయన చేసిన కృషిని విదేశాంగ మంత్రి జయశంకర్ మరియు చైనాలోని భారత రాయబారి విజయ్ కేశవ్ గోఖలేలు ప్రశంసించారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే కాక వ్యూహాత్మక నాయకత్వానికి ఆయన పేరు గడించారు. దోవల్ నేతృత్వంలో జరిగిన చర్చల ద్వారా 15 మే 2020న, మయన్మార్ సైనిక దళాలు అస్సాం మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాలలో చురుకుగా ఉన్న 22 మంది మిలిటెంట్ నాయకుల బృందాలను భారత ప్రభుత్వానికి అప్పగించాయి. విధి నిర్వహణలో అత్యధిక సమయాన్ని ఆయన యాక్టివ్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 2018లో, అతను వ్యూహాత్మక పాలసీ గ్రూప్ ఛైర్మన్‌గా నియమితుడయ్యారు.

ప్రాణాలకు తెగించి గూఢచర్యం :

పాకిస్తాన్ లోని భారత హై కమిషన్ కార్యాలయంలో 1981 నుండి 1987 వరకు ఇస్లామాబాద్‌ లోని భారత హైకమిషన్‌లో పని చేసిన ఆయన అంతకు ముందు ఒక సంవత్సరం పాటు ఐబి రహస్య గూఢచారిగా (Undercover Spy) అత్యంత ప్రమాదకర పరిస్థితులలో వ్యక్తిగత ఉనికిని గోప్యంగా కాపాడుకుంటూ పాకిస్థాన్ కేంద్రంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న చురుకైన మిలిటెంట్ గ్రూపుల కదలికలపై కీలకమైన సమాచారాన్ని మాతృసంస్థకు చేరవేసే వారు. అప్పటి ఒక సంఘటన గురించి తెలిస్తే మన ఒళ్ళు జలదరిస్తుంది. పాకిస్థాన్ లో గూఢచర్యం నిర్వహిస్తున్న సమయంలో తన ఉనికి తెలియకుండా ఆయన సాధారణ స్థానిక పాకిస్థానీ పౌరుని వేషధారణతో సంచరిస్తుండగా ఒక మసీదు వద్ద కూర్చుని ఆయననే గమనిస్తున్న వృద్ధుడు తన వద్దకు రమ్మని సైగ చేయడంతో అతని వద్దకు వెళ్ళగా ఆయన దోవల్ ను నఖశిఖపర్యంతం చూసి నువ్వు ‘హిందువు’ కదా అనగా అందుకు ఆయన ‘కాదు’ అని సమాధానం చెప్పారు. దాంతో ఆ వృద్ధుడు దోవల్ ను తన వెంట రమ్మని మూడు నాలుగు సందుల గుండా నడిపించి ఒక పూరింట్లోకి తీసుకెళ్ళి తలుపు మూసి ఇప్పుడు చెప్పు నువ్వు ‘హిందువు’ కదా అని రెట్టించడంతో ఆయన మరోసారి కాదు అని చెప్పడంతో, ఆ వృద్ధుడు దోవల్ చెవికి ఉన్న చిన్న రంధ్రం చూపించి ఇది హిందువులకు మాత్రమే ఉంటుంది అన్నాడు. అందుకు దోవల్ “అవును నేను జన్మతః హిందువును అయినప్పటికీ తరువాత మతం మార్చుకున్నాను” అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు నేను కూడా హిందువునే అని చెప్తూ ఒక అరలో భద్రపరచిన దేవతామూర్తులను చూపించి నా కుటుంబ సభ్యులందరినీ ఇక్కడి వారు చంపేయడంతో నేను ఇస్లాంలోకి మారినట్లు నటిస్తూ ఏదో రకంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అన్నాడు. దోవల్ చెవిని చూపిస్తూ నువ్వు వెంటనే ఆ రంధ్రం కనబడకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో లేదంటే నువ్వు పట్టుబడే ప్రమాదం ఉంది అని సలహా ఇచ్చాడు.

దావూద్ ఇబ్రహీం తప్పించుకున్న వైనం:

1993 బొంబాయి పేలుళ్ళ కుట్రదారుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుమార్తె మరియు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుని విందు జూలై 13, 2005న దుబాయ్‌లోని గ్రాండ్ హయత్ లో నిర్వహించబడుతున్నందున దావూద్ ను అంతమొందించడానికి అది అత్యంత అనువైన సమయమని భావించిన అజిత్ దోవల్ అందుకు పథకాన్ని రచించారు. విదేశీ గడ్డపై భారత కమాండోలకు బదులుగా దావూద్ తో శతృత్వం గల చోటా రాజన్ అనుచరులు విక్కీ మల్హోత్రా మరియు ఫరీద్ తనాషాలను అందుకు ఉపయోగించుకోవడం మంచిదని భావించి అన్ని ఏర్పాట్లు చేసింది ఇంటలిజెన్స్ బ్యూరో. కాగా ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు బొంబాయి పోలీసుల మధ్య సమన్వయలోపం కారణంగా ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన విక్కీ మల్హోత్రా మరియు ఫరీద్ తనాషాలను అరెస్టు చేయడంతో దావూద్ ను మట్టుబెట్టడం సాధ్యపడలేదు.

పురస్కారాలు మరియు గుర్తింపులు:

దోవల్ డిసెంబర్ 2017లో డా బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి, మే 2018లో కుమావ్ విశ్వవిద్యాలయం నుండి మరియు నవంబర్ 2018లో అమిటీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సాధారణంగా 15 సంవత్సరాలకు తక్కువ కాకుండా వృత్తి నిబద్ధత మరియు విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఇచ్చే “ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్”ను ఆయన సర్వీస్ లో చేరిన ఆరు సంవత్సరాలకే అందుకోవడం మరియు అతి పిన్న వయస్సులో అందుకున్న పోలీసు అధికారి కావడం విశేషం. వార్తాపత్రికలు మరియు పత్రికలకు వ్యాసాలు రాయడమే కాకుండా, అతను భారతదేశం యొక్క భద్రతా సవాళ్లు, విదేశాంగ విధాన లక్ష్యాల గురించి వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలలో, దేశ విదేశాలలో భద్రతకు సంబంధించిన మేధోమధన సదస్సులలో ప్రసంగించారు. ఆయన భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధీనంలో ఉగ్రవాద సంబంధిత సమాచారాన్ని సేకరించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేయడానికి ఏర్పాటైన మల్టీ-ఏజెన్సీ సెంటర్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సమాచారాన్ని పంచుకోవడానికి ఏర్పాటైన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు.

ఇప్పుడిప్పుడే లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెనువెంటనే కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు జరగడం ఒకింత ఆందోళన కలిగించే పరిణామాలు. ఈ నేపథ్యంలో మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ఇండియన్ జేమ్స్ బాండ్, అజిత్ దోవల్ తన సుదీర్ఘానుభవంతో దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భగవంతుడు ఆయనకు సర్వశక్తులు ప్రసాదించాలని దేశ హితాన్ని కాంక్షించే పౌరులుగా కోరుకుందాం.

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

హైదరాబాద్

✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News