Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్America pressure on Tibet: టిబెట్‌ సమస్యపై అమెరికా ఒత్తిడి

America pressure on Tibet: టిబెట్‌ సమస్యపై అమెరికా ఒత్తిడి

టిబెట్‌కు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్నదే ఈ చట్టం ఉద్దేశం

అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గం గత జూన్‌ 19న ధర్మశాలలో బౌద్ధమత గురువు దలైలామాతో సమావేశం కావడం ఇదివరకటి సమావేశాలు, చర్చలన్నిటికంటే భిన్నంగా, వైవిధ్యంగా కనిపించింది. చైనా దేశానికి బద్ధ వ్యతిరేకిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు మైకేల్‌ మెకాల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తదితర ఏడుగురు సభ్యులతో కూడిన ఈ ప్రతినిధి వర్గం ప్రత్యేకంగా ధర్మశాల రావడం జరిగింది. 2022లో పెలోసీ తైవాన్‌ను సందర్శించినప్పుడు అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా కాంగ్రెస్‌ సుమారు వారం రోజుల క్రితం టిబెట్‌ పరిష్కార చట్టాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఈ ప్రతినిధి వర్గం హిమాచల్‌ప్రదేశ్‌ లోని ధర్మశాలకు రావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చట్టం ప్రస్తుతం దేశాధ్యక్షుడి ఆమోద ముద్ర కోసం నిరీక్షిస్తోంది.
సహజంగానే, చైనా ఈ చట్టం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహ రించుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ దీనికి ఆమోద ముద్ర వేయకూడదని చైనా స్పష్టం చేసింది. అమెరికా ప్రతినిధి వర్గం ధర్మశాల వెళ్లి దలైలామాతో సమావేశం కావడాన్ని కూడా చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దలైలామా ఒక వేర్పాటువాద వర్గానికి నాయకత్వం వహిస్తున్నాడని చైనా వ్యాఖ్యానించింది. టిబెట్‌కు సంబంధించి అమెరికా 2002, ఆ తర్వాత 2022 సంవత్సరాల్లో కూడా రెండు చట్టాలను ఆమోదించింది. ఆ చట్టాల్లో ఉపయోగించిన భాష కంటే కఠినమైన భాషను ఈ తాజా చట్టంలో ఉపయో గించింది. పురాతన కాలం నుంచి టిబెట్‌ చైనాలో భాగమంటూ చైనా ప్రభుత్వం చేస్తున్న వాదనలను ఈ చట్టంలో తీవ్రంగా ఖండించడం జరిగింది. చైనా పాలకులు చరిత్రను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని అమెరికా విమర్శించింది. టిబెట్‌ పైన చైనా సాగిస్తున్న దుష్ప్రచా రాన్ని ఎప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో తిప్పికొట్టడమే ప్రస్తుత చట్టం ప్రధానోద్దేశం. దలైలామాతో గానీ, ఆయన ప్రతినిధులతో గానీ ఒకటికి రెండుసార్లు చర్చించి, టిబెటన్ల భాష, మతం, సంస్కృతి వగైరాల పరిరక్షణకు ఒప్పందం కుదర్చుకోవాలని ఈ చట్టం ద్వారా అమెరికా చైనాకు సూచించింది. టిబెట్‌కు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్నదే ఈ చట్టం ఉద్దేశమని మైకేల్‌ మెకాల్‌ ధర్మశాలలో ఒక బహిరంగ సభలో స్పష్టం చేశారు.
అమెరికాతో వాదనలకు దిగిన చైనా ఎక్కడా భారత్‌ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. మైకేల్‌ మెకాల్‌ నాయకత్వంలోని అమెరికా ప్రతినిధి వర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తో సమావేశమైనప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల మీదే మాట్లాడుకోవడం జరిగింది తప్ప వారి చర్చల్లో ఎక్కడా టిబెట్‌ ప్రస్తావన రాలేదు. తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాన్ని అమెరికా, భారతదేశాలు మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నాయి. చైనా ‘ఒకే చైనా విధానా’నికి కట్టుబడి ఉండాలని అవి కోరుతున్నాయి. తైవాన్‌ విషయంలో అనుసరిస్తున్న విధానాన్నే అవి టిబెట్‌కు కూడా వర్తింపజేస్తున్నాయనడంలో సందేహం లేదు. నిజానికి, తైవాన్‌, టిబెట్ల విషయంలో భారతదేశ వైఖరి చైనా పాలకులకు తెలియకపోలేదు. ఈ కారణంగా చైనా తరచూ భారతదేశానికి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటుంది. ఒకే చైనా అన్న విధానాన్ని భారత ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించదు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చలు జరిగినప్పుడు కూడా భారత ప్రభుత్వం ఏనాడూ వివాదాస్పద టిబెట్‌ అంశాన్ని ప్రస్తావించలేదు.
భారతదేశంతో సత్సంబంధాల కోసం, ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం తాము ఎదురు చూస్తున్నామని చైనా కూడా అధికారికంగా ప్రకటిస్తూనే ఉంటుంది. ఇది జరగాలన్న పక్షంలో చైనా తమకు భారతదేశంతో ఉన్న సరిహద్దు సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలి. నాలుగేళ్ల క్రితం లడఖ్‌ సరిహద్దుల్లో లేవనెత్తిన సమస్యపై కూడా దృష్టి సారించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News