Thursday, November 21, 2024
Homeహెల్త్Seasonal diseases: సీజనల్‌ వ్యాధులు జర పైలం..సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దూరం

Seasonal diseases: సీజనల్‌ వ్యాధులు జర పైలం..సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దూరం

వానలు కురుస్తున్నాయి.. వాతావరణ మార్పుల కారణంగా అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమయంలో వ్యాధులు సంక్రమించనుండడంతో చాలా మంది ఇబ్బందులు పడే అవకాశముంది
. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తాయి. వాతావరణం చల్లగా ఉండటంతో వైరస్‌లు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఈ సీజన్‌లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ప్రమాదం తీవ్రంగా ఉంటుంది.
ప్రతి పదిమందిలో నలుగురికి జలుబు, ఇద్దరికి జ్వరంతో కూడిన వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వైరల్‌ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య రోగి నిస్సత్తువగా మారిపోతాడు.
కొందరిలో ఒంటిపై దుద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. మరికొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వస్తుంటాయి. సాధారణంగా వీటిని విషజ్వరాలు అంటారు. వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్‌ జ్వరాలు కూడా కొన్ని ఉన్నాయి. తప్పనిసరిగా చికిత్స తీసుకోవాల్సిన మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి ఈ ఫీవర్‌ కిందకే వస్తాయి.
ప్రభావం
శరీరంలోని కణాలపై వైరస్‌ దాడిచేస్తుంది. వైరల్‌ ఫీవర్‌తో ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వైరస్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటే నరాలపై దాడిచేస్తుంది. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. రోగి బలహీనంగా మారి ఆహారం పూర్తిగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
వైరల్‌ ఫీవర్‌ రావడానికి కారణం
వైరల్‌ ఫీవర్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాస నాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తాయి. చల్లదనం తీవ్రత పెరుగడంతో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీంతో రక్త సరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు సంఖ్య క్రమంగా తగ్గడంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందే అవకాశమున్నందున జాగ్రత్తగా చూసుకోవాలి.
లక్షణాలు
ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం, ఒంటిపై దుద్దుర్లు, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతు నొప్పి, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలుగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి.
వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వైరల్‌ ఫీవర్‌ ఇన్‌ఫెక్షన్‌ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది.
ఆహారం షేర్‌ చేసుకోకపోవడం మంచిది.
చల్లదనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వానలో వెళ్తే గొడుగు, రెయిన్‌కోట్స్‌ తప్పనిసరిగా వాడాలి.
కాచి, చల్లార్చిన నీటిని తాగాలి.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి.
పిల్లలకు పండ్లు ఎక్కువగా తినిపించాలి., నూనె పదార్థాలు ఎక్కువగా వాడొద్దు.
వానలో తడిసినప్పుడు జలుబు, గొంతునొప్పిలాంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ప్రథమ చికిత్స
వైరల్‌ ఫీవర్‌కు సంబంధించిన లక్షణాలు రెండు, మూడు కనిపించిన రోగికి ఎక్కువగా నీళ్లు తాగించాలి. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. తేలికపాటి ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా రోగి ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలి. తాజా కొత్తిమీరతో చేసిన టీ, మెంతి వాటర్‌ తాగించాలి. దీంతో వైరస్‌ నాశనం అవుతుంది. పెద్దవాళ్లకైతే గంజి
తాగించడం మంచి పద్ధతి. ఇది వైరస్‌ను ఎక్కువకాలం బతకనివ్వదు.
అప్రమత్తంగా ఉండాలి
సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి జ్వరం వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యుల సలహాల మేరకే మందులు వాడాలి. దోమ తెరలను వినియోగించాలి. పూల కుండీలు, ఎయిర్‌కూలర్ల నీటి గొట్టాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చల్లటివి కాకుండా వేడి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

- Advertisement -

గార్ల, సిహెచ్ సి డాక్టర్ హనుమంతరావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News