Sunday, September 29, 2024
Homeపాలిటిక్స్KTR public letter to CM Revanth: నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ...

KTR public letter to CM Revanth: నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే

సీఎంకు కేటిఆర్ బహిరంగ లేఖ

-సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ

- Advertisement -

గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి…

గత పదేళ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేతరంగం.. ఇందిరమ్మ రాజ్యం పేరుతో మీరు తెచ్చిన ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయింది. గత  కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేవలం గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపేయాలన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల నేడు నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారు. సాంచాలను తూకం వేసే అమ్ముకునే దుస్థితి వచ్చింది. రోజురోజుకూ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది.  

కేవలం కేసిఅర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈరోజు ఈ పరిస్ధితి దాపురించింది. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపైన మీ అక్కసు వలన, వాటిని ఆపేడంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. మీ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. గత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు కొనసాగించాలని అనేక విజ్ఝప్తులు, అందోళనలు చేసినా స్పందించకపోవడం వల్లనే నేడు దారి లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధి లేక ఉసూరుమంటున్న నేతన్నలకు పని లేక మళ్లీ ఆకలి చావులే దిక్కైన స్థితి నెలకొంది. ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మగౌరవం చంపుకోలేక తనువు చాలిస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో, చేసేందుకు పనిలేకపోవడంతో ఇప్పటిదాకా పది మంది నేతన్నలు తనువు చాలించారు. సిరిసిల్లా, కరీంనగర్ తో పాటు టెక్స్ టైల్ శాఖ మంత్రి జిల్లా ఖమ్మంలోనూ ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకున్న కార్మికుల వివరాలను ఇక్కడ జతపరుస్తున్నాను.  ఖమ్మం జిల్లాకు చెందిన గుగ్గిల్ల నరేష్  (జనవరి,20), పెంటి వెంకన్న (మార్చ్ 17), సిరిసిల్లాకు చెందిన  తడక శ్రీనివాస్ (మార్చ్, 13), సిరిపురం లక్ష్మినారాయణ ( ఎప్రిల్ 7), ఈగ రాజు (ఎప్రిల్ 25 న), అడిచెర్ల సాయి (ఏప్రిల్ 26న), అంకారపు మల్లేషం (ఏప్రిల్ 26న), చింటోజు రమేష్ ( మే 23న), కుడిక్యాల నాగరాజు (జూన్ 22న), కరీంగనర్ కు చెందిన వెంకటేషం (జూన్ 16న) ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని అత్యంత బాధాతత్ప హృ‌దయంతో మీముందుకు తెస్తున్నాను. వెంటనే ఈ కుటుంబాలకు ప్రత్యేకంగా రూ. 25 లక్షల ఎక్స్ గ్రెేషియా అందించాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.  

కేవలం మీ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లనే మగ్గాల కార్మిక క్షేత్రంలో మరణమృదంగం మోగుతున్నది. కార్మిక క్షేత్రంలో మళ్లీ నేతన్నల ఆకలి చావులు ఆవేదన కలిగిస్తున్నాయి. పదేళ్ల పాటు కళకళలాడిన నేతన్న జీవితాల్లో చీకట్లు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలుగానే వీటిని భావిస్తున్నాము. అలాగే కాంగ్రెస్ గత ప్రభుత్వాల ట్రాక్ రికార్డు చూసినా.. ఎన్నడూ నేతన్నల కష్టాలు పట్టించుకున్న చరిత్ర లేదు. 

ఉద్యమ కాలంలోనూ కేసిఆర్ గారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులను కాపాడుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేస్తున్నాను. భూదాన్ పోచంపల్లిలో నేతన్న ఆత్మహత్య చేసుకుంటే జోలెపట్టి విరాళాలు సేకరించి  ఆదుకున్నారు. 

కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిన  సిరిసిల్లలో కార్మికులను ఆదుకునేందుకు  50 లక్షలతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద నేతన్నలకు అండగా నిలిచారు. గత అరవై ఏండ్ల నేతన్నల దుఖం, బాధలపై పూర్తి అవగాహన ఉన్నందునే కేసిఅర్, బీఅర్ ఎస్ ప్రభుత్వం రాగానే చరిత్రలో ఎన్నడు లేనంతగా బడ్జెట్ ను పెంచి చేనేత, జౌళి శాఖద్వారా నేతన్నల కోసం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. సంక్షోభంలో చిక్కిన పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసిఆర్ గారు సమీక్ష నిర్వహించారు. నేతన్నల వేతనాలను, కూలీలను రెట్టింపు అయ్యేలా, ప్రతి కార్మికుడు నెలకు కనీసం 15 నుంచి 20 వేలు సంపాదించుకుని గౌరవప్రదంగా జీవించేందుకు కార్యాచరణ రూపొందించి  అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. చేనేత మిత్రా, నేతన్నకు చేయూత, నేతన్న బీమా వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. గతంలో ఇతర రాష్ర్టాలనుంచి సరఫరా అయ్యే, రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లును రాష్ర్టంలోని నేతన్నలకు ఇచ్చి, చేతి నిండా పని కల్పించింది ఆనాటి బీఅర్ఎస్ ప్రభుత్వం. మగ్గాల ఆధునికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్ తో అనుసంధానం వంటి ఆల్ రౌండ్ అప్రోచ్ తో ముందుకు సాగింది. వీటన్నింటి వలన కార్మికులకు ఊరట లభించడంతో, వీరికి మరింత పని కల్పించడంతోపాటు, కడుపునిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన బతుకమ్మ చీరల పథకం ప్రారంభించింది. దీంతోపాటు రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా వారికి ఇవ్వడంతో కార్మికులకు మరింత ఉపాధి పెరిగి ఏడాదికి దాదాపు ఎనిమిది నెలల వరకూ వరుస ఆర్డర్లు అందడంతో.. పరిశ్రమలో సంతోషం వెల్లివిరిసింది. నేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఈ పథకాలు, కార్యక్రమాల వలన ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనింది. దీంతో ఆనాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగిపోయాయి. 

సంక్షోభం నుంచి గట్టెక్కిందనుకున్న చేనేత రంగం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి  రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి.. పరిశ్రమను దెబ్బతీయడంతోపాటు.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న మీ కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలి. మరణశయ్యపై మరమగ్గాల పరిశ్రమ ఉంది. దాన్ని వెంటనే ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90 శాతం సబ్సిడీని వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వ, ప్రభుత్వాధీనంలో ఉండే సంస్థలకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తిని నేతన్నలకు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ గతంలోనే దాన్ని అమలు చేసింది. చేనేత కార్మికులు, నేతన్నలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సర్కార్ బతుకమ్మ చీరలు, అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు సంబంధించి ఆర్డర్ ను నేతన్నలకు అప్పగించటం జరిగింది. దాన్ని అలాగే కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ సంక్షోభం వచ్చేదే కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే  నేతన్నలకు ఉపాధి కార్యక్రమాలు కొనసాగించాలి. సిరిసిల్ల సహా రాష్ట్రంలో  చేనేత, నేతన్నల ఆత్మహత్యలే ఉండకూడదన్న మంచి ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నేత కార్మికుల కోసం చేనేత మిత్రా, థ్రిప్ట్, యార్న్ సబ్సిడీ, నేత ఫించన్లు, నేతన్న భీమా పథకం తీసుకురావటం జరిగింది. విద్యుత్ సబ్సిడీని కూడా కొనసాగించాం. ఈ పథకాల కారణంగా చేనేత, నేత కార్మికుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నింటిని పట్టించుకోవటం లేదు. ఈ కారణంగా నేత కార్మికులకు చేసేందుకు పనిలేక దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వచ్చిన నేపథ్యంలో కార్మికుల బతుకులు బాగుపడే హామీలేమైనా ఇస్తారేమోనని అంతా భావించారు. కానీ సిరిసిల్ల నేతన్న సమస్యను ప్రస్తావించకుండానే మీరు వెళ్లిపోయిన తీరు కార్మికులను నిరాశకు గురిచేసింది. స్థానిక మంత్రి ప్రభాకర్ సైతం పలుమార్లు చేనేత, నేతన్నలను ఆదుకుంటామని ప్రకటనలు చేసినప్పటికీ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవటం బాధాకరం. 

గతంలో ఉన్నటువంటి విషాదకర పరిస్థితులను తిరిగి తేవద్దని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షోభం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలకు నేతన్న బీమా సాయం అందిస్తూనే… ప్రభుత్వం తరఫున వారి కుటుంబాలకు అదనంగా రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలి. నేతన్నల విషాదకరమైన పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా… మానవత్వంతో పరిష్కరించాల్సిన అవసరముంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఉపాధిలేక, అదాయంలేక, అప్పులపాలై 10 మంది నేత కార్మికులు ఆత్మబలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలి. ఉపాది లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న నేతన్నలకు, నేత పరిశ్రలమకు భరోసా కల్పించాలి. గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్రా, థ్రిప్ట్, యారన్ సబ్సిడీ, నేతన్న ఫించన్లు, నేతన్న బీమా, విద్యుత్ సబ్సిడీ మొదలైన పథకాలను కొనసాగిస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉన్నది. లేకపోతే సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని  నిలదీస్తాం, నేత కార్మికులకు అండగా ఉంటూ బీఆర్ఎస్ వారి తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం. 

జై నేతన్న

జై తెలంగాణ

జై బీఆర్ఎస్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News