కేంద్రంలో సరికొత్త ప్రణాళిక చోటు చేసుకుంటోంది. కీలకమైన దేశ అవసరాలను, సమస్యలను, ఎన్.డి.ఎ ఎన్నికల మేనిఫెస్టోలోని విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆలో చిస్తే కేంద్రంలో ఆరుగురు మంత్రులకు చేతి నిండా పని ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు తగ్గట్టుగా వంద రోజుల కార్యక్రమాన్నికూడా ప్రకటించినందువల్ల ఈ మంత్రులకు నిమిషం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడు తుందని భావించవచ్చు. ప్రస్తుతం అన్ని రకాల హడావిడులు తగ్గి, కేంద్ర మంత్రులు ఎవరి బాధ్యతల్లో వారు చేరి పోయినందువల్ల ఈ మంత్రుల మీద అందరి దృష్టీ పడింది. మోదీ నాయకత్వంలోని మూడవ పర్యాయపు ఎన్.డి.ఏ ప్రభుత్వం తమ వాగ్దానాలు, హామీలను అనుసరించి, వ్యవ సాయం, నీరు, పరిశ్రమలు, కార్మికులు, ఉద్యోగాలు వంటి రంగాలు ప్రధానంగా ఊపందుకోవాల్సి ఉంటుంది. నిజా నికి, మోదీ ప్రభుత్వం ఈ రంగాలను దృష్టిలో ఉంచుకునే వంద రోజుల కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇది ఒకటి రెండు రోజుల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలోని నలుగురు మంత్రులు – శివరాజ్ సింగ్ చౌహాన్, చిరాగ్ పాశ్వాన్, సి.ఆర్,పాటిల్, మన్ సుఖ్ మాండవీయాలను ఇప్పటికే సమాయత్తం చేయడం జరిగింది.
వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మం త్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు సంపూర్ణంగా తెలు సు. ప్రధానంగా వ్యవసాయ రంగం నుంచి వచ్చిన చౌహాన్ మొదటి నుంచి వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ వచ్చారు. మధ్యప్రదేశ్‌లో అపర చాణక్యుడుగా పేరున్న ఆయన ఇప్పటికే తనకు అవసరమైన సమా చారాన్ని సమీ కరించుకున్నారు. దేశంలో దాదాపు 45 శాతం మంది కార్మికులు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు. జాతీయాదాయంలో ఆరవ శాతం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతోంది. జాతీయాదాయాన్ని పెంచాల న్నా, పేదరికాన్ని నిర్మూలించాలన్నా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం అనేది కీలకం. పారిశ్రామిక రంగంలో మాదిరిగా కాకుండా వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.
రైతు సంక్షేమంపై దృష్టి
గతంలో లోక్ సభ ఆమోదించి, ఆ తర్వాత రైతుల నిరసనల కారణంగా ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను కొద్దిపాటి మార్పులతో తిరిగి ప్రవేశపెట్టే అవ కాశం ఉంది. రైతులకు మరింత వెసులుబాటుగా, సౌకర్య వంతంగా రుణ సౌకర్యాలు కల్పించడం, మార్కెటింగ్ సౌక ర్యాలను పెంచడం, ఆహార ధాన్యాల నిల్వకు వసతులు మెరుగుపరచడం, వ్యవసాయ సంఘాలను మరింత పటి ష్ఠం చేయడం వంటి విషయాల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. వ్యవసాయా భివృద్ధిని, గ్రామీణా భివృద్ధిని మేళవించి కొత్త కార్యక్రమాలను చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం ధ్యేయంగా కనిపిస్తోంది. అయితే, ఇం దులో సగానికి సగం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాల్సిన అవసరం ఉన్నందువల్ల చౌహాన్ కు మరింత పనిభారం పెరిగే అవకాశం ఉంది. నాలుగు పర్యా యాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చౌహాన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం సాధించాల్సి ఉంటుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిం చిన చిరాగ్ పాశ్వాన్ కొంత మేరకు చౌహాన్ తో సమ న్వయం సాధిస్తూనే, దేశంలో ఆహార ధాన్యాల సరఫరా, పంపిణీ వంటి కీలక విషయాల్లో తన సత్తా ఏమిటన్నది నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆహార ధాన్యాలు, నిత్యా వసర సరుకుల ధరలు పెరగడం ఆర్థిక రంగం మీదే కాక, రాజకీయ రంగం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆహార ధాన్యాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే దాదాపు 8 శాతం వరకు ద్రవ్యోల్బణం ఉన్నట్టు కనిపి స్తోంది. సరిగ్గా ధాన్యం ఉత్పత్తి జరగకపోవడంతో పాటు, సరైన నిల్వ వ్యవస్థలు లేకపోవడం, మార్కెటింగ్ సౌక ర్యాలు లేకపోవడం వల్ల రైతాంగం దీనావస్థలోనే ఉంటూ వస్తోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ప్పటికీ, ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో భారతదేశం బాగా వెనుకబడి ఉంది. పంట నష్టాలు జరగకుండా ఉండా లన్నా, పంట వృథా కాకుండా ఉండాలన్నా ఫుడ్ ప్రాసె సింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగాల సృష్టి
ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే రైతులు తమ ధాన్యా న్ని నిల్వ ఉంచుకోవడానికి, అవసరమైనప్పుడు లేదా వీలైన ప్పుడు అమ్ముకోవడానికి తగ్గట్టుగా నిల్వ కేంద్రాలను దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైతుల కోసం ఇటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక జిల్లా, ఒకే ధాన్యం అనే విధానాన్ని అవలంబించడం మీద కూడా దృష్టి సారించాల్సి ఉం టుంది. ఆహార ధాన్యాలను సరైన రీతిలో మార్కెటింగ్ చేయడంతో పాటు వీటి వల్ల వస్తున్న ఆదాయాన్ని పెంచ డం, వీటి ద్వారా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం కూడా ఇప్పుడు కీలకాంశంగా మారింది.
దేశంలో నీటి సమస్యలు, జల సంక్షోభాలు క్రమంగా పేట్రేగిపోతున్న నేపథ్యంలో జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఈ రంగం మీద మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఇది ఎవ రికీ పట్టని సంక్షోభంగా మారిపోయింది. ఇప్పుడు ఈ సమస్యను, సంక్షోభాన్ని తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నీటి నిల్వ, నీటి లభ్యత, నీటి నాణ్య త, నీటి సరఫరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి ఉద్దేశించిన హర్ ఘర్ జల్ కార్య క్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టవలసి ఉంటుంది. దేశంలోని దాదాపు వంద లోక్ సభ నియోజక బవర్గాల్లో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయిలో ఉంటున్నాయి. ఈ నియోజకవర్గాలకు పూర్తిగా ట్యాంకర్ల ద్వారానే నీరు అందుతోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దాదాపు ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి నీరు తీసుకు వచ్చి సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.
కీలక సమస్యలకు పెద్ద పీట
దేశంలో అత్యవసరంగా ఉప్పు నీటి నుంచి మంచి నీటిని తీసే వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉంది. అంతే కాక, నీటిని రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకు భారీగా నిధులు సమకూర్చడమే కాకుండా, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇందుకు పన్నుల మినహాయింపులు, పన్నుల ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకుడుగానే కాకుండా, ఒక సాంకేతిక పరిజ్ఞాన నిపు ణుడుగా కూడా ఎంతో అనుభవం ఉన్న పాటిల్ ఈ రంగా న్ని ప్రక్షాళన చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఇప్పటి నుంచే నడుం బిగించడం జరిగింది. ప్రభుత్వం కూడా నిధులపరంగా, సిబ్బందిపరంగా ఇప్పటికే అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించినందువల్ల ఆయన రోజుకు 18 గంటల పాటు దీని మీద శ్రమించడం జరుగుతోంది.
కార్మిక వ్యవహారాలు, యువజన వ్యవహారాలు, ఉపా ధి వంటి కీలక రంగాలకు చెందిన మంత్రి మన్ సుఖ్ మాండవీయా, నైపుణ్యాల అభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్న జయంత్ చౌధురి ఇదివరకెన్నడూ లేనంత స్థాయిలో ఈ రంగాల మీద దృష్టి పెట్టడం జరుగుతోంది. దేశంలో అత్యంత కీలక, క్లిష్ట సమస్యగా ఉన్న ఉపాధి కల్పన రం గానికి కొత్త దశ, దిశ కల్పించేందుకు ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు అత్యధిక సమయాన్ని కేటాయించడం జరుగు తోంది. నిరుద్యోగం, ఉపాధి కల్పన వంటి సమస్యల ప్రభా వం గత ఎన్నికల్లో బాగానే కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిం చింది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కార్మికులను సృష్టించే విధానాన్ని ఇక పకడ్బందీగా అమలు చేసే పనిలో పడింది. విద్యావంతులకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి వారిని దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలను పెంచడం మీద ఈ మంత్రులు దృష్టి పెట్టారు. ఉద్యోగాలు దొరకని లక్షలాధి మంది విద్యావం తులకు సంబంధించిన వివరాలను సేకరించి, వారికి ఉద్యోగాలు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని వీరు చేపట్టే అవకాశం ఉంది.
పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా పదవీ బాధ్య తలు స్వీకరించిన పీయూష్ గోయల్ దేశంలో అనేక కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు, అతి ప్రధాన మైన వాణిజ్య సంస్థలను విస్తరించడం మీద దృష్టి కేంద్రీ కరిస్తున్నారు. విదేశాల నుంచి పెట్టుబడులను ఆకట్టుకోవ డంతో పాటు, విదేశీ కంపెనీలు భారతదేశంలో తమ సంస్థ లను ఏర్పాటు చేసేలా ఆయన చర్యలు తీసుకోవడం జరు గుతుంది. ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్, వైద్య పరికరాలు వంటి రంగాల్లో అతి వేగంగా అగ్రస్థానానికి చేరుకుంటున్న భారతదేశం ఈ రంగాలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి, తద్వారా ఉపాధి సమస్యను పరిష్కరించడానికి పీయూష్ గోయల్ ప్రయత్నిస్తున్నారు. చైనాను కాదని అనేక దేశాలు భారతదేశంలో తమ మార్కెట్ కార్యకలాపాలను విస్తరి స్తున్న నేపథ్యంలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసు కోవడానికి పీయూష్ గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక కేంద్రాలను విస్త రించే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో అమలు కాబో తోంది. వీటివల్ల విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడంతో పాటు ఉపాధి కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద రాజకీయ అనివార్యాలు, ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఈ మంత్రుల మీద ఉన్నట్టు అర్థమవుతోంది.
- అమరవాది శ్రీమన్నారాయణ