Thursday, September 19, 2024
HomeతెలంగాణAndole: 'ధరణి'లో కొత్త సమస్యలు

Andole: ‘ధరణి’లో కొత్త సమస్యలు

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు అక్రమాల నివారణకు ప్రభుత్వం 2020 నవంబర్‌లో ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో భూ సమస్యల పరిష్కారం కన్నా కొత్తవి అనేకం ఎదురవుతున్నాయి. అప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 17 రకాల సమస్యలు నెలకొన్నా వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనేక పట్టా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. వాటిని సవరించుకునే అవకాశం ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. సంయుక్త రిజిస్ట్రేషన్‌లకు, గ్రీవెన్స్‌కు వీల్లేక జిల్లాలో వందల మంది రైతుల సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. చాలా మంది పాస్‌ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా నెలల తరబడి పరిష్కారం కాని దుస్థితి నెలకొంది.
సరిచేసేందుకు అవకాశం ఇవ్వాలి
కొందరు రైతుల పాస్‌బుక్‌ల్లో ‘భూమి స్వభావం’ అనే కాలంలో పట్టా భూములు అసైన్డ్‌ భూములుగా, అసైన్డ్‌ భూములు పట్టా భూములుగా నమోదయ్యాయి. నేచర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ను సవరించేందుకు ఆప్షన్‌ ఇవ్వాలి.
ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పరిశ్రమల స్థాపన, ఇతర అనేక అవసరాలకు ప్రభుత్వం భూములు సేకరించింది. వీటిని ఏ పద్ధతిలో ప్రభుత్వం సేకరించిందనే విషయాన్ని రికార్డు చేయాల్సి ఉంది. కొనుగోలు, ఇతర మార్గాల ద్వారా సేకరించినట్లు నమోదు చేయడానికి అవకాశం లేదు.
కొన్ని భూరికార్డుల్లో పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదయ్యాయి. అసలు పట్టాదారు పేరుకు బదులు భూమితో సంబంధం లేని వ్యక్తుల పేర్లు నమోదయ్యాయి. పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఇలాంటి తప్పులను సరిచేసేందుకు వీలు లేదు.
తప్పిన సర్వే నెంబర్‌ను రికార్డుల్లో నమోదు చేశాక లేదా అసలు భూమే లేని సర్వే నెంబరును తొలగించాక పాస్‌ పుస్తకాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులతో కొత్త పాస్‌బుక్‌లు జారీ చేసే అవకాశం ఇవ్వాలి.
కొత్త పట్టాదారులకు, సర్వేనెంబర్‌ తప్పిన పట్టాదారులకు కొత్త ఖాతానెంబర్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ధరణిలో ఈ అవకాశాన్ని ఇవ్వలేదు. పాత రెవెన్యూ రికార్డుల్లో ఖాతా నెంబర్లు కలిగి ఉండి ధరణిలో తప్పిన వారికి ఖాతా నెంబర్లు ఇచ్చేందుకు ఆప్షన్‌ ఇవ్వాలి. వ్యవసాయ భూములకు, ఈసీ, మార్కెట్‌ విలువ సర్టిఫికెట్‌లు మీ సేవ ద్వారా జారీ చేయడం లేదు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఈ సర్టిఫికేట్‌లు ఇచ్చేలా చూడాలి.
ధరణికి ముందే ఎన్ఐఆర్‌లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూములను రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేసేందుకు అనుమతివ్వాలి.
ఎవరైనా ఇద్దరు కలిపి భూమిని కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తరవాత దానిని మళ్లీ అమ్ముకోలేని పరిస్థితి ఉంది. సంయుక్త రిజిస్ట్రేషన్‌కు ధరణి పోర్టల్‌లో కాలం లేదు.
ఓ రైతుకు సంబంధించిన పట్టాభూమి ధరణి పోర్టల్‌లో అసైన్డ్‌ భూమిగా చూపిస్తుంది. ఇదేమిటని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదు. దీనిని సవరించాలని అనేకసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కలేదు. తహసీల్దార్లకు పోర్టల్‌లో సవరించే అధికారం లేకపోవడమే ఇందుకు కారణం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News