వెదజల్లే పద్ధతిలోనే వరిసాగు లాభదాయకమని కూలీల ఖర్చు మిగలడమే కాకుండా పంట కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు అన్నారు. గార్ల మండల కేంద్రంలో వెదజల్లే పద్ధతిలో సాగుచేసిన పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగులో మెళకువలు శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చునని, వెదజల్లే పద్ధతి వరి సాగు రైతులకు లాభదాయకమన్నారు. ఈ విధానంలో రైతుకు నాటు పద్ధతిలో కన్నా ఒక ఎకరానికి 6 నుంచి 7 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుందని, నారుమడి పెంచే అవసరం ఏర్పడదని, నాటు కూలీల ఖర్చులు ఆదా అవుతాయన్నారు.
10 రోజుల ముందుగా వరి కోతకు వస్తుందని, చీడ పీడల ఉదృతి తక్కువగా ఉంటుందని, ఒక ఎకరానికి 10 కేజీల విత్తనం సరిపోతుందని తెలిపారు. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టాలని, విత్తనం వెదజల్లిన 20 నుండి 25 రోజుల వ్యవధిలో కలుపు మందు స్ప్రే చేసి, కలుపు సమస్యను అధిగమించాలని సందేహాల నివృత్తి కొరకు మండల వ్యవసాయ అధికారైన తమను సంప్రదించాలని కోరారు. ఈ క్షేత్ర సందర్శన కార్యక్రమంలో ఏ ఈ ఓ ప్రశాంత్ రైతులు పాల్గొన్నారు.