సంప్రదాయాలు, ఆనవాయితీలకు భారతీయ జనతా పార్టీ తిలోదకాలిచ్చింది. లోక్‌సభలో విపక్షానికి ఉప సభాపతి ఇవ్వడమనే సంప్రదాయం ఎప్పటినుంచో ఉన్నదే. కిందటిసారి ఈ సంప్రదాయానికి తూట్లు పొడిచింది కేంద్ర ప్రభుత్వం. డిప్యూటీ స్పీకర్ లేకుండానే 17వ లోక్‌సభ నడిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ లో సంఖ్యాబలం ఉన్నప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి కమలనాథులు అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిగా కేరళకు చెందిన కె. సురేశ్ ను బరిలో నిలిపింది హస్తం పార్టీ. అందరూ ఊహించినట్లే అధికారపక్షానికి చెందిన ఓం బిర్లా మరోసారి లోక్‌సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. కాగా గత యాభై ఏళ్ల చరిత్రలో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారి.
పార్లమెంటరీ సంప్రదాయాలపై తమకు ఎటువంటి గౌరవం లేదని కమలనాథులు మరోసారి నిరూపించారు. ఏకగ్రీవంగా జరగాల్సిన లోక్‌సభ ఎన్నికను రచ్చరచ్చ చేసేంతవరకు బీజేపీ నాయకులు నిద్రపోలేదు. ఎన్టీయే తరఫున బరిలో నిలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఓం బిర్లా గెలుపు అందరూ ఊహించిందే. కేరళకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కె. సురేశ్ విజయం సాధిస్తారన్న భ్రమలు ఇండియా కూటమి నాయకులకు కూడా లేవు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి అధికారపక్షం అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సురేశ్‌ను బరిలో నిలబెట్టింది ఇండియా కూటమి. ఇదిలా ఉంటే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో సంప్రదాయాలు, ఆనవాయితీలు పాటించడంలో భారతీయ జనతా పార్టీ డొల్లతనాన్ని అందరికీ చాటి చెప్పింది హస్తం పార్టీ.
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో లోక్‌సభ స్పీకర్ ఎంతో ఉన్నతమైన పదవి . లోక్‌సభ స్పీకర్ పదవి అధికారపక్షానికి అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి రావడం మనదేశంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. వాస్తవానికి 17వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ లేకుండానే నడిచింది. డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి అవసరమైన సంఖ్యాబలం లేదన్న సాకుతో కాంగ్రెస్ పార్టీకి నో చెప్పింది అధికారపక్షం. కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే సంఖ్యాబలం ఉందా లేదా అనేది వేరే విషయం. సంఖ్యాబలం అనేది కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమే. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ హస్తం పార్టీకి ఉప సభాపతి పదవి ఇవ్వకూడదని కమలనాథులు నిర్ణయించుకున్నారు. దీంతో ఉప సభాపతి లేకుండా 17వ లోక్‌సభ పదవీకాలం ముగిసింది. స్పీకర్ అందుబాటులో లేని సమయాల్లో ప్యానెల్ స్పీకర్లే సభా కార్యక్రమాలను నిర్వహించారు. స్వతంత్ర భారత చరిత్రలో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి. 1952లో తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించారు. అప్పట్లో స్పీకర్ పదవికి జీవీ మావలంకర్, శంకర్ శాంతారామ్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికలో మావలంకర్ గెలుపొందారు. ఆ తరువాత 1967లో మరోసారి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలం సంజీవరెడ్డి, ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చిన ఇండిపెండెట్ ఎంపీ తెన్నేటి విశ్వనాథంపై గెలుపొందారు. దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించిన సందర్భంలో 1976లో మూడోసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అప్పట్లో జగన్నాథ్‌రావుపై బలిరామ్ భగత్ విజయం సాధించారు. 1976లో బలిరామ్ భగత్, జగన్నాథ్ రావు బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో జగన్నాథ్ రావు పై బలిరామ్ భగత్ విజయం సాధించారు. ఆ తరువాత నుంచి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే నడిచింది. ఎం ఏ అయ్యంగార్, జీఎస్ థిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి ఏకాభిప్రాయంతోనే స్పీకర్లు అయ్యారు.
సమాఖ్య స్ఫూర్తికి తూట్లు !
గత పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి ని దెబ్బతీస్తున్నాయి. 2014లో అధికారానికి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. 2014 అలాగే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవసరమైన సంఖ్యాబలం రావడంతో నరేంద్ర మోడీ సర్కార్ ఒంటెత్తు పోకడలకు అంతూపొంతూ లేకుండా పోయింది. కీలకమైన బిల్లులపై కూడా ప్రతిపక్షాలను సంప్రదించడం, వారి సూచనలు, సలహాలు తీసుకోవడం వంటి సత్సంప్రదాయాలకు గుడ్‌బై కొట్టింది నరేంద్ర మోడీ సర్కార్. విపక్షాలను సంప్రదించడం సంగతి తరువాత కనీసం మాటమాత్రంగానైనా సమాచారం ఇవ్వకుండా పదేళ్ల కాలం గడిపేసింది నరేంద్ర మోడీ సర్కార్. ఈ పదేళ్ల కాలంలో అనేక సార్లు తన చర్యలతో, నిర్ణయాలతో సమాఖ్య స్ఫూర్తికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. వీలు దొరికినప్పుడల్లా రాష్ట్రాల హక్కులను హరించివేసింది. గత పదేళ్లకాలంలో లోక్‌సభలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం చూసి అనేక రాష్ట్రాలు మౌనాన్ని ఆశ్రయించాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి ఒకరిద్దరు బీజేపీయేతర నాయకులు మాత్రమే ఆయా సందర్బాలను బట్టి నరేంద్ర మోడీ సర్కార్ ఒంటెత్తు పోకడలను ఎండగట్టారు. భారతదేశం అంటే అనేక జాతుల, మతాల ప్రజల సమాహారం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఫెడరలిజానికి రాజ్యాంగ నిర్మాతలు పెద్ద పీట వేశారు. మనది ”సమాఖ్య” రాజ్యాంగం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా ప్రకటించారు. కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగం ఒకే రకమైన ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన నిర్వచనం….యూనియన్ ఆఫ్ స్టేట్స్ తప్ప మరొకటి కాదు. రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో ఉండేది ”సమాఖ్య ప్రభుత్వ”మే. కేంద్రానికి ఎల్లలు అంటూ ఏమీ లేవు. కాగా రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉంది. కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలున్నాయి.కేంద్ర, రాష్ట్రాలు ఎవరి పరిధుల్లో వాళ్లు ఉండాలని రాజ్యాంగం పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజన గీతలు కూడా స్పష్టంగా గీసింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది కేంద్రం జాబితా, ఇది రాష్ట్రాల జాబితా అనే పట్టింపులు ఏమీలేవు. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయానికి సంబంధించి 2020-21 మధ్యకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చించకుండా ఏకంగా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇంతటి కీలకమైన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలతో ఎటువంటి చర్చలు జరపలేదు. అంతేకాదు వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మెజారిటీ రాష్ట్రాలకు సమాచారం కూడా ఇవ్వలేదు. మూడు వ్యవసాయ బిల్లులను , మందబలంతో పార్లమెంటులో ఆమోదింపచేసుకున్నారు. దీంతో బిల్లులు కాస్తా చట్టాలయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో రైతులు దాదాపు ఏడాదిపాటు ఆందోళనలు నిర్వహించారు. రైతన్నల ఉద్యమ తీవ్రతను చూసి ప్రధాని నరేంద్ర మోడీయే వెనక్కి తగ్గారు. చివరకు అన్నదాతలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాల వివాదం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బయటపడ్డారు.
వివరణ అడగకుండానే మొయిత్రాపై వేటు
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ మహువా మొయిత్రా ఎపిసోడ్ కొంతకాలం కిందట జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సొమ్ములు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. అయితే తన వివరణ వినకుండానే ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేశారని మహువా మండిపడ్డారు. మరణశిక్ష అమలు చేయడానికి ముందు కూడా , దోషికి చెప్పుకునే అవకాశం ఇస్తారు. అయితే ఇక్కడ సొమ్ములు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మహువా మొయిత్రాకు మాత్రం లోక్‌సభలో తన వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.మహిళా బిల్లు గురించి జబ్బలు చరచుకునే కేంద్రప్రభుత్వం ఒక మహిళా ఎంపీ పట్ల వ్యవహరించిన తీరు ఇది. మహువా మొయిత్రా కొంతకాలంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసులా మారారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపించింది. అయితే తాజా లోక్‌సభ ఎన్నికల్లో మహువా మొయిత్రా మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇటీవల ఒకే దేశం – ఒకే ఎన్నిక పల్లవి అందుకుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎన్నికల ఖర్చు తగ్గించడం అనే ముసుగులో ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసే కొత్త ఎత్తుగడను కేంద్రం పన్నుతోంది. ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానం అమలులోకి వస్తే ఎన్నికల్లో జాతీయ అంశాలే కీలకంగా మారి, రాష్ట్రాల సమస్యలు గాలికి కొట్టుకుపోతాయంటున్నారు రాజ్యాంగ నిపుణులు. చివరకు జాతీయ పార్టీలు బలోపేతమై, ప్రాంతీయ పార్టీలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320